ప్రాణం తీసిన ‘నిమిషం’
ABN, Publish Date - Mar 01 , 2024 | 03:49 AM
‘నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోం’ అన్న నిబంధన ఓ ఇంటర్ విద్యార్థి నిండు ప్రాణాలను బలిగొంది. పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన ఆ విద్యార్థి, లోపలికి అనుమతించాలని ఎంతగా
పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి
ప్రాధేయపడినా అనుమతించని అధికారులు
మనోవేదనతో సాత్నాల ప్రాజెక్టులో దూకిన విద్యార్థి
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ‘నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోం’ అన్న నిబంధన ఓ ఇంటర్ విద్యార్థి నిండు ప్రాణాలను బలిగొంది. పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన ఆ విద్యార్థి, లోపలికి అనుమతించాలని ఎంతగా వేడుకున్నప్పటికీ అధికారులు కనికరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటి నుంచి ఎంతో ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి బయలుదేరిన ఆ విద్యార్థి తీవ్ర నిరాశతో తిరుగుముఖం పట్టి మార్గమధ్యలో ఓ ప్రాజెక్టులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం రాములు-పంచపూల దంపతుల కుమారుడు 17 ఏళ్ల శివకుమార్. పరీక్షను మిస్ అయ్యాననే బాధను భరించలేకపోతున్నానంటూ నాన్నను ఉద్దేశించి శివ కుమార్ సూసైడ్ నోట్ రాశాడు. శివ కుమార్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం శివను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బైక్‌పై ఎక్కించుకొని ఆదిలాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద దిగబెట్టాడు. అయితే అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యమవడంతో పరీక్ష కేంద్రంలోకి శివను అధికారులు అనుమతించలేదు. అధికారులను శివ బతిమాలుకుంటున్న దశలోనే దిగబెట్టిన ఆ వ్యక్తి.. తనకు స్థానికంగా వెరేపని ఉదంటూ బాలుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత బతిమిలాడినా ఫలితం లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత శివ పుట్టెడు దుఖంతో తిరుముఖం పట్టాడు. గ్రామ శివారులోని సాత్నాల ప్రాజెక్టులోకి దూకాడు. స్థానికులు చూసి పోలీసులకు చెప్పడంతో గజ ఈతగాళ్లొ గాలింంచారు. శివను బయటకు తీసేటప్పటికే అతడు ప్రాణాలు విడిచాడు. గట్టు మీద.. సూసైడ్ నోట్, రిస్ట్ వాచీ, రెండు పెన్నులు లభించాయి.
శివ పరీక్ష కేంద్రానికే వెళ్లలేదు: ఎస్సై
ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి శివ కుమార్ అసలు పరీక్ష కేంద్రానికి వెళ్లలేదని జైనథ్ ఎస్సై పురుషోత్తం చెప్పారు. పరీక్ష కేంద్రం వద్ద తాము సీసీ ఫుటేజీని పరిశీలించామని, ఎక్కడా శివ కుమార్ కనిపించలేదని స్పష్టం చేశారు.
‘‘ నాన్న నన్ను క్షమించు. ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదు. మీరు నాకోసం చాలా చేశారు కానీ నేను మీ కోసం ఏదీ చేయలేక పోతున్నా.. నా జీవితంలో ఎప్పుడూ ఇంత బాధ కలగలేదు. మొదటిసారి ఎగ్జామ్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఊపిరి కూడా
తీసుకోలేకపోతున్నా’’
సూసైడ్ నోట్‌లో శివ కుమార్
Updated Date - Mar 01 , 2024 | 03:49 AM