‘ధరణి బూచితో భూముల స్వాహా’పై ప్రభుత్వం విచారణ జరిపించాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 04:13 AM
రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో భూదాన్ భూముల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భూమిని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం అక్షర సత్యం
వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులు భూముల్ని కాజేశారు: సంజయ్
జమ్మికుంట, మార్చి 2: రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో భూదాన్ భూముల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భూమిని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సోదరుడు లాగేసుకున్న ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ కోరారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘ధరణి బూచితో భూమి స్వాహా’ కథనం అక్షర సత్యమన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. రూ.500 కోట్ల విలువ చేసే భూముల్ని వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కాజేశారని ఆరోపించారు. ఇందుకు సంబందించిన అన్ని ఆధారాలను ‘ఆంధ్రజ్యోతి’ బయట పెట్టిందన్నారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని, భూములను మింగడం కోసమే ధరణిని తెచ్చారని ఆరోపించారు.
భూదాన్ భూములపై తాను 15 రోజుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నానని, ఈ క్రమంలోనే కుంభకోణాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కాంప్రమైజ్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి 350 ఎంపీ సీట్లు వస్తాయని, తెలంగాణలో 17 సీట్లనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములు ఇవ్వడం హర్షణీయమన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 04:13 AM