TS Secretariat : సచివాలయ నిర్మాణ ఖర్చెంత?
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:22 AM
నూతన సచివాలయం నిర్మాణ ఖర్చు విషయంలో అర్ అండ్ బీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు! ఆర్టీఐ కింద అడిగితే.. గత ప్రభుత్వం దీనికోసం నిధులను కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు తప్ప.. వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వెల్లడించట్లేదు. సచివాలయం,
లెక్కలు దేవుడికెరుక..!
ఆమోదం కంటే తక్కువే అంటున్న ఆర్‌అండ్‌బీ
సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది రూ.617 కోట్లు.. అయిన ఖర్చు 558 కోట్లు
ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు, భవనాల శాఖ జవాబు
ఏడాది క్రితం ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో
అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి
ఈ రెండింటిలో ఏది నిజం? మతలబేంటి?
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నూతన సచివాలయం నిర్మాణ ఖర్చు విషయంలో అర్ అండ్ బీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు! ఆర్టీఐ కింద అడిగితే.. గత ప్రభుత్వం దీనికోసం నిధులను కేటాయిస్తూ మంజూరు చేసిన ఒక జీవో కాపీని చూపిస్తున్నారు తప్ప.. వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వెల్లడించట్లేదు. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నిర్మాణానికి అయిన ఖర్చులపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ.. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఆర్ అండ్ బీ అధికారులు ఇదే తీరులో జవాబివ్వడం గమనార్హం. నూతన సచివాలయం నిర్మాణం, అందుకు వెచ్చించిన నిధుల గురించి వివరాలు తెలపాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆర్ అండ్ బీ శాఖను సమాచార హక్కు కింద కోరగా.. గత ప్రభుత్వం జీవో ఎం ఎస్ నెం 47 ద్వారా రూ.617 కోట్లను మంజూరు చేసిందని, వాటిలో ఇప్పటివరకు రూ.588 కోట్లు ఖర్చు చేశామని సమాధానమిచ్చింది. కొత్త సచివాలయ శంకుస్థాపన 2019లో జరిగింది. 2020లో కొవిడ్ వల్ల.. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి, ఆమేరకు సచివాలయ నిర్మాణ వ్యయం అంచనాలు కూడా పెరిగాయని గత ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా వ్యవహరించిన వేముల ప్రశాంత్ రెడ్డి పలుమార్లు తెలిపారు. నిర్మాణం కోసం మంజూరు చేసిన రూ.617 కోట్లకు అదనంగా మరో 20-30 శాతం మేర ఖర్చు పెరగొచ్చని భావిస్తున్నట్టు.. సచివాయలం ప్రారంభోత్సవం సందర్భంగా 2023 ఏప్రిల్ 27న ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం.. అంతకన్నా తక్కువ ఖర్చే అయిందని చెబున్నారు. దీంతో సచివాలయ నిర్మాణం ఖర్చులో ఉన్న మతలబు ఏంటనే చర్చ మొదలైంది. ఇదే కాదు.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలు, అందుకు వెచ్చించిన నిధులపై ప్రస్తుత సర్కారు నజర్ వేసింది. కానీ అధికారులు పూర్తిస్థాయిలో ఖర్చు వివరాలను వెల్లడించడంలేదని సమాచారం.
ఈఎన్‌సీ మురళీధర్‌రావు రాజీనామాకు ఆమోదం
నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్(ఈఎన్‌సీ-జనరల్) సి.మురళీధర్‌రావు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కృష్ణా ప్రాజెక్టుల వ్యవహారంలో ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా మురళీధర్‌రావు వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. దాంతో 8వ తేదీనే ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామా ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
Updated Date - Feb 13 , 2024 | 04:22 AM