15 నుంచి ఒంటిపూట బడులు!
ABN, Publish Date - Mar 08 , 2024 | 04:32 AM
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
పదో తరగతి పరీక్షా కేంద్రాలుంటే
మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల దాకా
టెన్త్ హాల్‌టికెట్లు సిద్ధం.. 2,676 పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 23 వరకు ఇదే పద్ధతి కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే.. పదో తరగతి పరీక్షల కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యా హ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఈ సారి సైన్స్ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పార్ట్-1లో ఫిజికల్ సైన్స్, పార్ట్-2లో బయాలజీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం (040-23230942)ను సంప్రదించి, విద్యార్థులు అవసరమైన సేవలను పొందవచ్చని అధికారులు సూచించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించారు. అలాగే ఠీఠీఠీ.ఛట్ఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే.. సంబంధిత ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షల్లో మొత్తం 13 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఈ పరీక్షలకు 3,75,157 మంది హాజరు కావాల్సి ఉండగా 3,66,389 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరీంనగర్‌లో 2, వికారాబాద్‌లో 9, ములుగులో 2 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
Updated Date - Mar 08 , 2024 | 04:33 AM