Elections: ఎన్నికల షెడ్యూల్‌పై బిగ్ అప్‌డేట్.. వచ్చేది ఆ రోజే..
ABN, Publish Date - Mar 08 , 2024 | 03:57 AM
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వెలువడనుందా..? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందాయా? దీంతోనే అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తోందా
లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు!
అధికారులు అప్రమత్తం.. క్రియాశీలంగా కలెక్టర్లు.. పనులను త్వరగా పూర్తి చేయండి
కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ.. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు
రాజకీయ కాక షురూ.. పార్టీలు పారాహుషార్.. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ బిజీబిజీ
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వెలువడనుందా..? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందాయా? దీంతోనే అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తోందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. కలెక్టర్లు క్రియాశీలంగా మారి.. మిగిలిపోయిన పనులు, శంకుస్థాపనలు, భవనాల ప్రారంభోత్సవాలను వెంటనే చేపట్టాలంటూ క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. పనులు వేగంగా జరగడానికి.. సిబ్బంది సెలవులను సైతం రద్దు చేస్తున్నారు. వాస్తవానికి 2019లో షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. అదే నెల 18న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ దశలోనే తెలంగాణలోని లోక్‌సభ, ఏపీలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈసారి షెడ్యూల్ ఈ నెల 13న వస్తుందని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిని బలపరిచేలా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల రీత్యా రాష్ట్రంలో రాజకీయ కాక రాజుకుంది. మరోవైపు ప్రధాని మోదీ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పలు రాష్ట్రాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభలు 13వ తేదీనముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం లేదంటే మరుసటి రోజు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి వీలుండదు. కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉండదు. అందుకే.. ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోనిపార్టీలన్నీ ఎన్నికలకు సంబంధించి విస్తృత కార్యాచరణను ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయి కేడర్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రత్యర్థులపై వాడివేడి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఇతర పార్టీలు కూడా సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నాయి.
ప్రారంభోత్సవాల్లో సీఎం.. పర్యటనల్లో బీఆర్‌ఎస్, బీజేపీ
సీఎం రేవంత్‌రెడ్డి రోజూ కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే కోడ్ ఆటంకంగా మారుతుందన్న ఉద్దేశంతో పలు కార్యక్రమాలను ప్రారంభించేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో అల్వాల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే బంజారాహిల్స్‌లో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం (8వ తేదీన) ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు ఫరూక్‌నగర్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. మీరాలం ట్యాంకు వద్ద ఎస్‌టీపీ(మురుగునీటి శుద్ధి కేంద్రం), గోల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. శనివారం (9న) బైరామల్‌గూడ్ ఫ్లై-ఓవర్‌ను ప్రారంభించి, ఉప్పల్‌లో నల్ల చెరువు ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. బోయినపల్లి నుంచి ఆదిలాబాద్ మీదుగా నాగ్‌పూర్ వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు సికింద్రాబాద్ వద్ద శంకుస్థాపన చేస్తారు. 11న భద్రాచలంలో వివిధ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో స్వయం సహాయక బృందాల మహిళలతో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొంటారు. ఇలా సీఎం 12 వరకూ బిజీ బిజీగా గడపనున్నారు. మరోవైపు.. బీజేపీ, బీఆర్‌ఎస్ కీలక నేతలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలను ఓట్లు అడిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
అధికారుల హడావుడి ఇలా..
రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం నుంచి అందుతున్న అంతర్గత సందేశాల మేరకు చిన్న చిన్న ప్రారంభోత్సవాలను పూర్తికానిచ్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాల స్థాయిలో పూర్తిచేయాల్సిన పనుల వేగవంతంపై దృష్టిసారిస్తున్నారు. ఈ నెల 12వ తేదీకల్లా ఆయా పనులను పూర్తిచేసి ప్రారంభించడానికి కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరెక్టర్లు కింది స్థాయి అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు రెవెన్యూ సిబ్బందికి సెలవులను సైతం రద్దు చేస్తున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఎవరూ సెలవు పెట్టడానికి వీల్లేదంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉన్నదని వాటిలో పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్న ఇతర జిల్లాల్లోనూ కలెక్టర్లు ఇలాంటి ఆదేశాలే జారీచేసినట్లు తెలిసింది.
Updated Date - Mar 08 , 2024 | 07:02 AM