గ్రేట్ ‘జాబ్’
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:14 AM
ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే రోజూ గంటల తరబడి కష్టపడి చదవాలి. అలాంటిది ఏకంగా నాలుగు కొలువులు సాధించడం అంటే.. వారు ఎంతలా శ్రమించారో ఊహించుకోవచ్చు.
ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నలుగురు
ఒకే ఇంట్లో అక్కాతమ్ముడికి.. రెండు కొలువులు సాధించిన మరొకరు..
వికారాబాద్/కందుకూరు/దౌల్తాబాద్, మార్చి 2 : ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే రోజూ గంటల తరబడి కష్టపడి చదవాలి. అలాంటిది ఏకంగా నాలుగు కొలువులు సాధించడం అంటే.. వారు ఎంతలా శ్రమించారో ఊహించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని రామయ్య గూడకు చెందిన దుద్యాల పావని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తల్లి చంద్రమ్మ ఓ మెడికల్ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించింది. దానికి ఫలితంగా అహర్నిశలు శ్రమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పావని. గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, డెమోలో ప్రతిభ చూపింది. దాంతో ఏకంగా నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా అర్హత సాధించింది. పావనికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. నవాబుపేట మండలం పులుమామిడికి చెందిన లక్ష్మీగళ్ల జంగయ్య, అనంతమ్మల మూడో కుమారుడు మహిపాల్ ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగ ఫలితాల్లో నాలుగు ఉద్యోగాలకూ ఎంపికయ్యాడు. పేద కుటుంబంలో జన్మించిన మహిపాల్ పాఠశాల విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో.. హైదరాబాద్ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్, ఉస్మానియా వర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు సాధించాడు. పీజీటీ, జేఎల్ ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలో 2వ స్థానంలో, మల్టీజోన్-2లో మొదటి స్థానంలో నిలిచాడు. కాగా, మహిపాల్ 2018లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడు. తన వెన్నంటి ఉండి మద్దతిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చిన్నప్పటి నుంచి మార్గదర్శనం చేసిన గురువులకు, మిత్రులకు మహిపాల్ ధన్యవాదాలు తెలిపాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన సయ్యద్ అర్ఫా. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. డీఎల్(గణితం), జేఎల్, పీజీటీతో పాటు టీజీటీ కొలువులు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లోనూ ఆమె అర్హత సాధించింది. టీఎ్‌ససీఎస్సీ(జేఎల్) ఫలితాల్లోను రాణించనున్నట్లు అర్ఫా ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కాగా, తన భర్త ఎండీ సల్మాన్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యం అయినట్లు తెలిపారు. డిగ్రీ లెక్చరర్(డీఎల్) ఉద్యోగాన్ని ఎంచుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని అర్ఫా పేర్కొన్నారు. ఈనెల 4న సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామకపత్రం అందుకోనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన కొండా లలితకుమారి జేఎల్(రసాయన శాస్త్రం), టీజీటీ(భౌతిక శాస్త్రం), టీజీటీ(జీవ శాస్త్రం), టీజీటీ(జనరల్ సైన్స్)లలో ఉద్యోగాలు సాధించింది. ఈ సందర్భంగా లలితకుమారిని గ్రామస్తులు, కుటుంబసభ్యులు అభినందించారు.
ఒకే కుటుంబంలో(అక్కాతమ్ముడు) ఇద్దరికీ..
దోమ : మండలంలోని దిర్సంపల్లి తండాకు చెందిన ఒకే కుటుంబంలో అక్కాతమ్ముడు ఇద్దరూ గురుకుల ఫలితాల్లో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు సాధించారు. మొదట నేనావత్ పద్మ పీజీటీ ఉద్యోగం సాధించగా.. తాజాగా వెలువడిన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్(గణితం)గా.. సోదరుడు రమేశ్ టీజీటీ ఉద్యోగం సాధించాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు వారిని అభినందించారు.
ఏకకాలంలో రెండు ఉద్యోగాలకు ఎంపిక
పెద్దేముల్ : మహిళ గురుకుల పాఠశాలలో లెక్చరర్‌గా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావాలనే లక్ష్యంతో చదివి ఏకకాలంలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది మండలంలోని బండమీదిపల్లికి చెందిన మున్నూరు శివలీల. ఆమె గురుకుల ఫలితాల్లో జేఎల్‌కు ఎంపికైంది. ఇదిలా ఉండగా మళ్లీ ఫిజికల్ సైన్స్ (టీజీటీ) ఉద్యోగానికి కూడా ఎంపికై తన పట్టును నిరూపించుకోవడంతో పలువురు అభినందిస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:14 AM