నేటి నుంచే రంజాన్
ABN, Publish Date - Mar 12 , 2024 | 04:26 AM
భారత్‌లో సోమవారం నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్లామిక్ సంవత్సరంలో రంజాన్ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లింలు భావిస్తారు. అలాగే
భారత్‌లో నెలవంక దర్శనం
ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు
చార్మినార్ /యాకుత్‌పురా, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో సోమవారం నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్లామిక్ సంవత్సరంలో రంజాన్ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లింలు భావిస్తారు. అలాగే ఎంతో శుభప్రదమైన ఈ నెలలో నరకలోక ద్వారాలు మూసుకుని, స్వర్గలోకపు ద్వారాలు తెరుచుకుంటాయని వారు నమ్ముతారు. దేవునిపై విశ్వాసాన్ని, భయభక్తులను, భక్తిశ్రద్ధలను తెలుపుకునేందుకు ముస్లింలు రోజా (ఉపవాస దీక్షలు) పాటిస్తారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ ఐదుపూటలా నమాజు, ఇషా తరువాత తరావీహ్ (ప్రత్యేక ప్రార్థనలే)తో పాటు ఆర్ధరాత్రి పూట తహజ్జుద్ నమాజ్ పేరుతో ఏకాంత ఆరాధనలో లీనమవుతుంటారు. చివరి పది రోజులలో ఎతేకాఫ్ పాటిస్తారు. అలాగే ధనవంతుడైన ప్రతి ముస్లిం దానధర్మాలకు అధిక ప్రధాన్యమిస్తారు. తమ ఆస్తిలో రెండున్నర శాతం తీసి పేదలకు పంచిపెడతారు. నెల రోజుల అనంతరం నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలను ముగించి రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్)ను జరుపుకుంటారు. మరోవైపు రంజాన్ నెలవంక దర్శనంతో సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని పాతబస్తీలో మటన్, చికెన్ షాపులు, కూరగాయల మార్కెట్‌లు, కిరాణా షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
ముస్లింలకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం మైనారీటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Mar 12 , 2024 | 04:26 AM