‘మెగా’ ఆశలు
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:00 AM
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
నిరుద్యోగుల నిరీక్షణకు తెర
మెగా డీఎస్సీ ప్రకటనపై హర్షం
తీరనున్న ఉపాధ్యాయుల కొరత
ఆన్‌లైన్‌లోనే పరీక్ష
సంగారెడ్డి అర్బన్/మెదక్ అర్బన్, ఫిబ్రవరి 29: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్త దరఖాస్తులను మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు స్వీకరించనున్నట్టు పేర్కొంటూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఏడేళ్ల అనంతరం
ఏడేళ్ల అనంతరం ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 2017లో టీఆర్‌టీ నిర్వహించారు. అనంతరం మళ్లీ నియామకాలు చేపట్టకపోవడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొన్నది. గతేడాది సెప్టెంబరులో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ కోర్టు కేసుతో ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో.. కొత్త నియామకాలకు అడ్డంకిగా మారింది. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ అమలులో భాగంగా సర్కార్ మెగా డీఎస్సీ ప్రకటన చేసింది.
సంగారెడ్డి జిల్లాలో 551 ఖాళీలు
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో 551 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అందులో స్కూల్ అసిస్టెంట్ 92, ల్యాంగ్వేజ్ పండిత్ 24, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 6, ఎస్జీటీలు 385, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ 9, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ 35 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇవేకాకుండా గెజిటెడ్ హెచ్‌ఎం గ్రేడ్-2 పోస్టులు 65 ఖాళీగా ఉన్నా.. వీటిని పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,247 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 1.25 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరతతో బోధనకు ఆటంకం కలగడంతో పాటు విద్యాశాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పాటు పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడటంతో ఈ ఏడాది కూడా సుమారు 155 మంది టీచర్లను డిప్యూటేషన్‌పై ఇతర పాఠశాలల నుంచి లేనిచోటకు తాత్కాలిక సర్దుబాటు చేశారు. జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ 47 ఉండగా, వీటిలో పనిచేసే ఉపాధ్యాయులను కూడా సమీప పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించారు. మెగా డీఎస్సీ ఖాళీల భర్తీతో ఉపాధ్యాయుల కొరత పూర్తిగా తీరనుంది.
మెదక్ జిల్లాలో 310 ఖాళీలు
తాజా డీఎస్సీలో మెదక్ జిల్లాలో 101 పోస్టులు పెరిగాయి. గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో 209 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వీటి కోసం వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజా నోటిఫికేషన్‌లో జిల్లాలో జిల్లా 310 ఖాళీలను పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్‌లు 92, ఎస్జీటీలు, భాషాపండితులు 30, వ్యాయామ ఉపాధ్యాయులు 1, సెకండరీ గ్రేడ్ టీచర్ 156 కలిపి మొత్తం 279 ఖాళీలు పేర్కొన్నారు. అదనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 31 ప్రభుత్వం ఈసారి కొత్తగా మంజూరు చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్‌లు 9, సెకండరీ గ్రేడ్ టీచర్ల 22 ఉన్నాయి. మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 310 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
Updated Date - Mar 01 , 2024 | 12:00 AM