హుస్నాబాద్ బస్టాండ్‌కు మహర్దశ
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:07 AM
40 ఏళ్ల అనంతరం ఆధునీకరణ
రూ.2 కోట్లు మంజూరు.. 8న శంకుస్థాపన
బస్టాండ్‌ను సందర్శించిన ఈడీ వినోద్‌కుమార్
హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణ డిజైన్
హుస్నాబాద్, మార్చి 2 : నాలుగు దశాబ్దాల అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌కు మహర్దశ రాబోతుంది. శిథిలావస్థకు చేరిన బస్టాండ్ రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషితో బస్టాండ్‌ను ఆధునీకరించబోతున్నారు. ఈ పనులకు రూ.2 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నారు.
40 ఏళ్ల బస్టాండ్
హుస్నాబాద్ బస్టాండ్‌ను 1984 జూన్‌లో అప్పటి ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతారావు కృషితో నాటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. అప్పుడు మూడు ఫ్లాట్ ఫామ్‌లుండేవి. తదనంతరం పలుమార్లు మరమ్మతులు వంటివి చేశారు. మళ్లీ 2017 ఆగస్టులో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి రూ.33.59 లక్షలను మంజూరు చేశారు. అప్పుడు హోటల్ గదులను తొలగించి విశాలంగా చేసి ఆధునీకరించారు. ప్రస్తుతం బస్టాండ్‌లో 8 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
ఆధునీకరణకు రూ.2 కోట్లు మంజూరు
హుస్నాబాద్ బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2 కోట్లు మంజూరు చేయించారు. ఈ ఆధునీకరణ పనుల్లో అదనంగా మరో మూడు ఫ్లాట్‌పామ్‌లను నిర్మించనున్నారు. గ్రానైట్, రెయిలింగ్ వంటి పనులతో ఆధునీకరించనున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ డిపోకు అదనంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు రాగా బస్టాండ్‌ను ఆధునీకరిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
శంకుస్థాపన పనుల పర్యవేక్షించిన ఈడీ
శనివారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్‌కుమార్ హుస్నాబాద్ బస్టాండ్‌ను సందర్శించారు. శంకుస్థాపన ఏర్పాట్లపై డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, అధికారులతో చర్చించారు. బస్టాండ్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ పనుల నిమిత్తం సర్వే చేశారు.
Updated Date - Mar 03 , 2024 | 12:12 AM