కల్యాణ వైభోగం
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:21 PM
దట్టమైన నల్లమల అభ్యయారణ్యంలో భౌరాపూర్ వద్ద వెలిసిన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు.
భౌరాపూర్‌లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వివాహం
చెంచుల సంప్రదాయం ప్రకారం వేడుకలు
అచ్చంపేట, మార్చి 8: దట్టమైన నల్లమల అభ్యయారణ్యంలో భౌరాపూర్ వద్ద వెలిసిన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిఽధ చెంచుపెంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చెంచుల కోసం ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. చెంచుల ఆడపడుచు అయిన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వివాహాన్ని చెంచు పూజారులు మల్లయ్య, లింగమయ్య, గురువయ్య, అయోధ్య వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. పెళ్లి కూతురు తరఫున ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అనురాధ దంపతులు, పెళ్లి కుమారుడు మల్లికార్జున స్వామి తరఫున సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి దంపతులు పెద్దలుగా పాల్గొని, ఎదుర్కోలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను మేళతాళాలతో తీసుకొచ్చి, కల్యాణం జరిపించారు. అంతకు ముందు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచులు సంప్రదాయ నృత్యాలు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అధికారులు భక్తులకు వసతులను ఏర్పాటు చేశారు. సీఐ రవీందర్, ఎస్‌ఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
కల్యాణ మండపం నిర్మాణం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఏటా జరిగే భమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి కల్యాణాన్ని నిర్వహించేందుకు వచ్చే ఏడాది వరకు మండపాన్ని నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. స్నానాలు చేసేందుకు ఘాట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నల్లమలలో జీవించే చెంచుల సమస్యలను ఒక్కోటి పరిష్కరిస్తానని చెప్పారు. స్వామి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరారు. వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ చెంచుల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ, డీటీడీఏ, అటవీ, పోలీస్, వైద్యం, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 11:21 PM