భానుడి భగభగ
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:03 PM
వేసవి పూర్తిస్థాయిలో మొదలవకముందే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండవేడిమి తట్టుకోలేక పోతున్నారు.
=====================
- రోజు రోజుకు పెరుగుత్ను ఉష్ణోగ్రత
- ఉదయం పది దాటితే నిర్మానుష్యంగా
మారుతున్న పట్టణ ప్రధాన రహదారులు
- వడదెబ్బ భారిన పడకుండా జాగ్రత్తగా
ఉండాలంటున్న వైద్యులు
వనపర్తి అర్బన్, మార్చి 8 : వేసవి పూర్తిస్థాయిలో మొదలవకముందే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండవేడిమి తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే 33 డి గ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావడానికి భయపడుతున్నా రు. ఎండ తీవ్రతతో జిల్లా కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్, గాంధీచౌక్, రాజీవ్‌చౌక్, భగీరథ చౌరస్తా, వివేకానంద చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వీధి వ్యాపారులు ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మధ్యాహ్నాం బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురై సోడియం, పోటాషియం లాంటి లవణాలను కోల్పోతుంటారు. ఈ లవణాలు తగ్గకుండా ఉండటానికి పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్తతో వడదెబ్బకు దూరం
వేసవి కాలంలో వడ దెబ్బ బారిన పడు తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. వడ దెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి తీవ్రమైన తలనొప్పి రావడం, నాడి వేగంగా కొట్టుకోవడం, చర్మం ఎండిపోవడం, నీరసంగా ఉండడం, మూత్రం పసుపు రంగులో రావడం పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారకస్థితిలోకి వెళ్లడం లాంటివి ఉంటాయి. పై లక్షణాలు ఉన్నప్పుడు వడదెబ్బగా గుర్తించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని గాలి ప్రదేశానికి తీసుకువెళ్లి అతడు వేసుకున్న దుస్తులు విడిచేసి చల్లని గాలి తగిలేలా చూడాలి. అక్కడే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలి.
Updated Date - Mar 08 , 2024 | 11:03 PM