పంట నష్ట పరిహారం వచ్చేనా...?
ABN, Publish Date - Feb 04 , 2024 | 11:51 PM
ఆరుగాలం కష్టపడి పంట పండించి కోతకు వచ్చిన సమయంలో మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం కురిసి చాలా మంది రైతులు పంటలు నష్ట పోయారు.
సైదాపూర్, ఫిబ్రవరి 4: ఆరుగాలం కష్టపడి పంట పండించి కోతకు వచ్చిన సమయంలో మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షం కురిసి చాలా మంది రైతులు పంటలు నష్ట పోయారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి, అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారం కింద ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పంటలు సర్వే చేసి దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి నివేదిక పంపించారు. మార్చిలో దెబ్బతిన్న పంటల పరిహారం చెల్లించిన అప్పటి ప్రభుత్వం ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెలించలేదు. ఇంతలో ఎన్నికలు రావడంతో పంట నష్ట పరిహారం నిలిచిపోయింది. తరువాత పరిణామాలతో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వ ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
-భారీగా దెబ్బతిన్న పంటలు
సైదాపూర్ మండలంలో ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తంగా 1271.27 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ
- పంట నష్ట పరిహారం అందలేదు
- వేముల రవిందర్, రైతు, బొమ్మకల్
నేను గత యాసంగిలో మూడెకరాల మొక్కజొన్న పంట వేశాను. ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. వ్యవసాయాధికారులు సర్వే చేసి పంట నష్టం వివరాలు రాసుకొని వెళ్లారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం వెంటనే చెలించాలి.
- సారు.. మమ్మల్ని ఆదుకోండి
- ఎలబోయిన చంద్రమోహన్ , రైతు, బొమ్మకల్
నేను గత యాసంగిలో రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. అకాల వర్షానికి పంట దెబ్బతిన్నది. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం అయినా పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
Updated Date - Feb 04 , 2024 | 11:51 PM