పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలోకి రేవంత్
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:42 AM
పార్లమెంట్ ఎన్నికల తరువాత గుంపు మేస్త్రీ రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంపవుతారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 7: పార్లమెంట్ ఎన్నికల తరువాత గుంపు మేస్త్రీ రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంపవుతారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ సిరిసిల్ల పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులు గడిచిపోయిందన్నారు. వారు మరిచిపోవద్దు ప్రజలు మరిచిపోవద్దని వారు చెప్పిన అన్ని హామీలను పుస్తకరూపంలో తీసుకొచ్చినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఒక్కో కాంగ్రెస్ నాయకుడు ఎగిసిపడుతున్నారని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏ రోజు ఇంత చిల్లరగా ప్రవర్తించలేదన్నారు. సోషల్ మీడియాలో ఒక తమ్ముడు పోస్టు పెడితే అతడిపై కేసలు పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనపై నాలుగు సార్లు ఓడిపోయినోడు సిరిసిల్లలోని నేతన్నలను పట్టుకొని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను దేశంలోని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయన్నారు. అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను పట్టుకొని గుజారాత్ మోడల్‌గా చేస్తామంటూ ప్రధాన మంత్రి వద్ద మార్కులు కొట్టడం కోసం ముఖ్యమంత్రి దిక్కుమాలిన మాటాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రధాన మంత్రి 400 సీట్లు వస్తాయంటున్నాడని, నాలుగు సీట్లు తెలంగాణలో రాకపోతే ఏమవుతుందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ గాలి తిరుగుడు తిరగటోడు కావాలా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేసే వినోద్‌కుమార్ కావాలా ప్రజలు ఆలోచన చేసుకోవాలన్నారు.
ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలో బడి, గుడి కట్టావా సిరిసిల్ల నేతన్నలకు ఏంచేశావో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిరిసిల్లకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చే ఆలోచన లేదన్నారు. ఒక్కసారైన బండి సంజయ్ దీనిపై మాట్లాడారా? అని ప్రశ్నించారు.
కార్మికులను యజమానులను చేయాలని తమ ప్రభుత్వం వర్కర్ టూ ఓనర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. రూ. 400 కోట్లతో షెడ్లను పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపార వేత్తలకు కట్టబెట్టే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 12న కరీంనగర్ ఎస్‌ఆర్‌ఎస్ కళాశాలలో జరిగే కధనభేరి మహాసభను విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గడ్డం నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుడ్ల మంజుల, బీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:42 AM