ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పంటల బీమాకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:39 AM

పంటల బీమా పథకాన్ని అమలుచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రైతుల్లో ధీమా పెరుగుతున్నది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పంటల బీమా పథకాన్ని అమలుచేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రైతుల్లో ధీమా పెరుగుతున్నది. సంబంధిత అధికారులతో సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం నిలిచిపోయింది. దీంతో నాలుగేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడంతో పథకం నిలిచిపోయింది. పంట నష్టం వాటిల్లినప్పుడల్లా వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ, పంట నష్ట పరిహారాలు పూర్తిస్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. గడిచిన నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆ మేరకు సీఎం కేసీఆర్‌ వచ్చే సీజన్‌ నుంచే పథకాన్ని అమల్లోకి తీసుకరావాలన్నారు. రైతులు పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లితే వారిని ఆదుకునేందుకు 2016-17లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆయా పంటల వారీగా చెల్లించే బీమా ప్రీమియం మొత్తంలో 25 శాతం రైతులు, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 50శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని గ్రామ యూనిట్‌గా అమలు చేశారు. దీనివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని బీమా పథకాన్ని సవరించాలని, రైతు యూనిట్‌గా బీమాను అమలుచేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కానీ కేంద్రం నిబంధనలను సవరించకపోవడంతో 2020 వానాకాలం సీజన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన పథకాన్ని నిలిపివేసింది. తమ వాటా ప్రీమియంను చెల్లించబోమంటూ చేతులెత్తేసింది. అలాగే బ్యాంకుల్లో రైతులు పంట రుణాలు తీసుకునే సమయంలోనే ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, వాటికి చెల్లించే పంటల బీమా ప్రీమియంలో రైతు వాటాను మినహాయించుకుని బీమా కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలను అందించేవారు. ఈ పథకం నుంచి అప్పటిప్రభుత్వం తప్పుకోవడంతో బ్యాంక్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంట రుణాలు ఇచ్చే సమయంలో రైతులకు తెలియకుండా బలవంతంగా ప్రీమియం సొమ్మును మినహాయించుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటినుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలుకావడం లేదు.

వేలాది ఎకరాల్లో పంటనష్టం..

ప్రతి సీజన్‌లో ఆయా బీమా కంపెనీలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నప్పటికీ, నేరుగా రైతులు పంటల బీమా చేయించుకోవడం లేదు. ప్రీమియం సొమ్మును మొత్తం భరించే స్థితిలో రైతులు లేకపోవడం గమనార్హం. గడిచిన మూడేళ్లలో అకాల వర్షాలు, భారీవర్షాలు, వడగళ్ల వర్షాలు కురిసినప్పుడు వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వ్యవసాయ శాఖను పంట నష్టపరిహారం నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీచేయడం, వాళ్లు క్షేత్రస్థాయిలో పర్యటించి 33శాతానికి మించి పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు ఒకసారి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. రైతులను ఓదార్చేందుకు ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన అప్పటి సీఎం కేసీఆర్‌ ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆ మేరకు జిల్లాలో కేవలం 6 వేల ఎకరాల పైచిలుకు పంటలకు మాత్రమే 6 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా రైతులకు పరిహారాన్ని విడుదల చేయలేదు. ప్రభుత్వం పరిహారం ఇచ్చినా, ఇవ్వకపోయినా పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తేనే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:39 AM

Advertising
Advertising