ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వన జాతరకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Feb 21 , 2024 | 12:52 AM

సమ్మక్క సారక్క అబ్బియా... జాలారు బండల్లో అబ్బియా.. జంపన్న వాగుల్లో అబ్బియా.. అంటూ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాలు నేటి నుంచి మారుమోగనున్నాయి. డప్పుల చప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య ఆ తల్లులు వనం వీడి జనారణ్యంలోకి రానున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

సమ్మక్క సారక్క అబ్బియా... జాలారు బండల్లో అబ్బియా.. జంపన్న వాగుల్లో అబ్బియా.. అంటూ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాలు నేటి నుంచి మారుమోగనున్నాయి. డప్పుల చప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య ఆ తల్లులు వనం వీడి జనారణ్యంలోకి రానున్నారు. ఆ దేవతల రాక కోసం నిలువెల్లా కనులై.. వారి దీవెనల కోసం పెద్దఎత్తున భక్తులు ఎదురుచూస్తున్నారు. భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారం.. కోరిన వరాలు ఇచ్చే ఆ దేవతలను పదిహేను రోజుల నుంచి మది నిండా తలచుకుంటూ పూజిస్తున్న భక్తులు వారిని దర్శించుకుని పునీతులయ్యేందుకు సంసిద్ధమయ్యారు. వారిని అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న భక్తులు ప్రతి రెండేళ్లకోసారి వారిని తలచుకుంటూ మొక్కులు అప్పగిస్తారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలోని జాతర ప్రాంగణాలన్నీ జనారణ్యంగా మారనున్నాయి. తెలంగాఽణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాలు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మేడారంనకు అనుబంధంగా జిల్లాలో 30చోట్ల జరగనున్న జాతర ఉత్సవాలకు దేవాదాయ శాఖ, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 21న సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదేరోజు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా జాతర ప్రాంగణాలకు తీసుక రానున్నారు. 22న సమ్మక్కను గద్దెకు తీసుకరానున్నారు. ఆరోజు నుంచి 24వ తేదీ వరకు దర్శించుకుని మొక్కులు అప్పగించనున్నారు. అదేరోజు సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనున్నది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే శ్రీసమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతిసారి పెరుగుతూ వస్తున్నది. జిల్లాలో ప్రధానంగా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి, అంతర్గాం మండలం గోదావరి ఒడ్డునగల గోలివాడ, మానేరు ఒడ్డునగల సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం కొలనూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌, కమాన్‌పూర్‌ మండలం గుండారం, ముత్తారం మండలం మైదంబండలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఇవేగాకుండా మడక, గర్రెపల్లి, దొంగతుర్తి, హన్మంతునిపేట, తుర్కలమద్దికుంట, తదితర ప్రాంతాల్లో జాతర జరగనున్నది. గోదావరిఖనిలో జాతర ఏర్పాట్లను కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. స్థానికంగా జరిగే జాతరలతో పాటు మేడారంనకు కూడా జిల్లా నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివెళుతున్నారు. జిల్లాకు మేడారం దిగువన ఉండడంతో భక్తులు తాము నివసించే గ్రామానికి దిగువ ప్రాంతాల్లో జరిగే జాతరలకు వెళ్లి మొక్కులు సమర్పించడం ఆనవాయితీ.

ఫ పదిహేను రోజుల నుంచే మొక్కులు..

జిల్లాలో పదిహేను రోజుల నుంచి ఇళ్లల్లో సమ్మక్కను చేసుకుని మొక్కు తీర్చుకుంటున్నారు. జిల్లా నుంచి వేలాది మంది ఇప్పటికే మేడారం వెళ్లివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు మొక్కుల ప్రకారం ఆ తల్లులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుంటున్నారు. జాతరలో ఆ తల్లులను దర్శించుకుని పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి వెదురు కంక, కుంకుమ భరిణెల రూపంలో ఉండే సమ్మక్కను మేడారం నుంచి వచ్చే ప్రత్యేక గిరిజన పూజారులు పూజలు నిర్వహించి ఊరేగింపుగా డప్పుల చప్పుళ్ల మధ్య తీసుకవస్తారు. ఈ సందర్భంగా దారిలో మహిళలు మంగళహారతులు పట్టుకుని జేజేలు పలుకుతారు. సమ్మక్కను తీసుకవచ్చే వడ్డె పూనకంతో ఊగిపోతుంటారు. సమ్మక్కను తీసుకవచ్చే వడ్డె వారిని తొక్కుకుంటూ వెళ్లాలని దారికి అడ్డంగా కొందరు భక్తులు పడుకుంటారు. గద్దెపైకి సమ్మక్కను తీసుకవచ్చిన తర్వాత భక్తులు ఇద్దరు తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఎక్కువగా శుక్రవారం రోజున జాతర ప్రాంగణాలు కిక్కిరిసిపోనున్నాయి. జాతరల్లో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, వైద్య సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. గద్దెలను అందంగా అలంకరించి విద్యుత్తు కాంతులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. గోలివాడ, గోదావరిఖని, కొలనూర్‌, నీరుకుళ్ల జాతర ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జాతర ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోనున్నాయి.

ఫ జిల్లా నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు..

ఇప్పటికే జిల్లాకు చెందిన అనేక మంది భక్తులు మేడారం వెళ్లివచ్చారు. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, యైుటింక్లయిన్‌ కాలనీ, మంథని ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా 536 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల సంఖ్య పెంచింది. 2022లో 360 బస్సులను నడపగా, ఈసారి అదనంగా 176 బస్సులను నడుపుతున్నారు. పెద్దపల్లి నుంచి 203, గోదావరిఖని నుంచి 135, యైుటింక్లయిన్‌ కాలనీ నుంచి 20, మంథని నుంచి 178 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులు మంథని, కాటారం, భూపాలపల్లి, గణపురం, జంగాలపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి మీదుగా మేడారం వెళుతున్నాయి. ఈనెల 18 నుంచే బస్సులు నడుపుతున్నారు. పెద్దపల్లి నుంచి పెద్దలకు రూ.380, పిల్లలకు రూ. 210, గోదావరిఖని, యైుటింక్లయిన్‌ కాలనీల నుంచి పెద్దలకు రూ. 370, పిల్లలకు రూ. 200, మంథని నుంచి పెద్దలకు రూ. 320, పిల్లలకు రూ. 180 రూపాయలుగా బస్సు టిక్కెట్లు నిర్ణయించారు.

ఫ సమ్మక్క గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు..

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సులే సురక్షితమని కరీంనగర్‌ ఆర్‌ఎం సుచరిత ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జాతర ప్రాంగణం వరకు ఆర్టీసీ బస్సులు వెళతాయని, ప్రైవేట్‌ వాహనాలను ప్రాంగణానికి 4 కిలోమీటర్ల దూరంలో నిలుపుతారని తెలిపారు. అక్కడినుంచి నడవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. బస్సుల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రతి నిమిషానికి బస్సులను నడుపుతున్నామని, భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం ప్రయాణికులను కోరారు.

Updated Date - Feb 21 , 2024 | 12:52 AM

Advertising
Advertising