మూడు రోజుల్లో పంటలకు బోనస్ ప్రకటించాలి
ABN, Publish Date - Mar 11 , 2024 | 12:41 AM
రేవంత్‌రెడ్డికి రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే మూడు రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 బోనస్ జీవో విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
గంభీరావుపేట, మార్చి 10: రేవంత్‌రెడ్డికి రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే మూడు రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 బోనస్ జీవో విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో మండల స్థాయి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా సావిత్రీ బాయిఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రేవంతరెడ్డి నిజాయితీ గల్ల మోసగాడని, లొడ లొడ నీతిలేని మాటలు మాట్లాడుతున్నాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలే బొందపెడుతారని అన్నారు. కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు రూ.2500, 46 లక్షల మంది వృద్దులకు రూ.4వేల పింఛన్ అందజేయాలన్నారు. డిసెంబరు 9న చేస్తానన్నా రూ.2 లక్షల పంట రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు చేయకుంటే తెలంగాణ ప్రజలే బొంద పెడుతారన్నారు.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ మఖ్యమంత్రి కాదని, త్వరలో రాహుల్ గాంధీకి వెన్నుపోటు పొడవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీలోకి పోతారన్నారు. రేవంత్‌రెడ్డి కల్తీ మనిషని, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పడతారని అన్నారు.
గంభీరావుపేట అభివృద్ధిపై బండి సంజయ్ చర్చకు రావాలి
గంభీరావుపేట మండలానికి ఎంపీ బండి సంజయ్ ఏం చేశాడో చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఐదేళ్ల కాలంలో కరీంనగర్ నియోజక వర్గం మొదలుకొని సిరిసిల్ల నియోజక వర్గంలోని గంభీరావుపేట మండలం వరకు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ ప్లామెంట్ సభ్యుడిగా ఎప్పుడైనా మండల పరిషత్ మీటింగ్,, జిల్లా పరిషత్ మీటింగ్, మున్సిపల్ సమావేశాలకు బండి సంజయ్ వెళ్లారా? అని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో రైతులు, ప్రజల కోసం బండి సంజయ్ గొంతు విప్పిన చరిత్ర ఉందా? అన్నారు. ఐదేళ్లలో బండి సంజయ్ పైసా పని చేయలేదన్నారు. దేశం కోసం దర్మకోసం అంటూ గాలి తిరుగుడు తిరిగే ఎంపీ కావాలా లేదా కరీంనగర్ ప్రజల కోసం గట్టిగా కొట్లాడే ఎంపీ కావాలా ప్రజలే నిర్ణయించాలన్నారు. చిత్తశుద్ధ్ది ఉంటే బండి సంజయ్ ఎంపీగా ఉన్న ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని, అంతకుముందు ఉన్న వినోద్‌కుమార్ ఏం చేశారో ప్రజల ముందు చెప్తారని అన్నారు. దమ్ముంటే గంభీరావుపేటలో జరిగే చర్చకు రావాలన్నారు. డేట్, టైం బండి సంజయ్ ఇష్టమని, దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.
నర్మాల మానేరుకు జలకళ తెచ్చింది మేమే
గంభీరావుపేట మండలం నర్మాల అప్పర్ మానేరు నిండాలి.. శాశ్వత జలకళతో ఉండాలనే ప్రజల చిరకాల కోరిక నేరవేర్చింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు. కాలేశ్వరం జలాలతో నర్మాల అప్పర్ మానేరును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఈ నెల 12న కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ మాజీ డైరెక్టర్ సుమలతశర్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, ఎంపీపీ వంగ కరుణసురెందర్‌రెడ్డి, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మన్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, జడ్పీ కో ఆప్సన్ హైమద్, పట్టణ అధ్యక్షుడు పెద్దవేని వెంకటి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు దయాకర్‌రావు, హన్మంతరెడ్డి, సీనియర్ నాయకులు రాజారాం, లింగమ్‌యాదవ్, మల్లేశం, రాజేందర్, రాజనర్సు, శివయ్య, నాగరాజు, అభిలాష్, శంకర్‌గౌడ్, వహీద్ ఉన్నారు.
Updated Date - Mar 11 , 2024 | 12:41 AM