కాళేశ్వరం అదనపు టీఎంసీని పరిశీలించలేం
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:31 AM
గణాంకాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉన్నాయని పేర్కొంటూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పరిశీలించలేమని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం
‘అదనపు టీఎంసీ’కి చూపిన కారణాలు సహేతుకంగా లేవు..!
వాస్తవాలు నివేదించాల్సిందేనన్న కేంద్ర జలవనరుల సంఘం
హైదరాబాద్, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): గణాంకాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉన్నాయని పేర్కొంటూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పరిశీలించలేమని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. రూ.30 వేల కోట్లతో అదనపు టీఎంసీ చేపట్టడానికి చూపిన కారణాలు సహేతుకంగా లేవంటూ లేఖ రాసింది. అదనంగా రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసే కాంపోనెంట్‌ను 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల గెజిట్‌లో అనుమతి లేని జాబితాలో పెట్టింది. అయితే, రోజుకు 2 టీఎంసీలు తరలించే ప్రధాన పథకం, అదనంగా టీఎంసీని తరలించే పథకాలు వేర్వేరు కాదని అప్పటి సీఎం కేసీఆర్ వాదించారు. అదనపు టీఎంసీని వెంటనే గెజిట్ నుంచి తొలగించాలని కోరారు. దీనినే చెబుతూ సవరణ డీపీఆర్ సమర్పిస్తే, రెగ్యులర్ డీపీఆర్‌లాగే అన్ని పరిశీలనలు చేసి గెజిట్ నుంచి తొలగిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ మేరకు సవరణ డీపీఆర్‌ను రెండేళ్ల కిందటే సీడబ్ల్యూసీతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)లో దాఖలు చేశారు. కాగా, అదనపు టీఎంసీపై కోర్టులో కేసులు ఉన్నందున దానిని పరిశీలించబోమని ఓ దశలో గోదావరి బోర్డు పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ కూడా డీపీఆర్‌పై యథాతథ స్థితిని పాటించాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. న్యాయస్థానం ఆదేశాలతో కాళేశ్వరం డీపీఆర్ పరిశీలన జరిగింది. ఆ సమయంలో సీడబ్ల్యూసీ ప్రశ్నలకు గత ప్రభుత్వం జవాబులు చెప్పలేకపోయింది. తాజాగా తెలంగాణ సమర్పించిన గణాంకాలు చూసిన సీడబ్ల్యూసీ ఇక డీపీఆర్‌ను పరిశీలించేది లేదని తేల్చి చెప్పింది. కాళేశ్వరం పంపులకు వాడే కరెంట్ యూనిట్ రూ.3 నుంచి రూ.6.3కు చేరిందని, 2022 ఏప్రిల్‌లో బెనిఫిట్ కాస్ట్ రేషియా 1.542గా, 2023 జనవరిలో 1.873గా చూపారని ఆక్షేపించింది.
ఆది నుంచి వివాదాలే...
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రధాన కాంపోనెంట్ హెడ్‌వర్క్స్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసిన ప్రభుత్వం, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ జోలికి వెళ్లలేదు. ఈలోగా రోజుకు అదనంగా ఒక టీఎంసీ తరలించే కాంపోనెంట్‌ను తెరమీదికి తెచ్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ నిర్ణయంతో కాంపోనెంట్‌ను రద్దు చేసి, సవరణ డీపీఆర్‌ను వెనక్కితీసుకునే అవకాశాలున్నాయి.
Updated Date - Mar 01 , 2024 | 07:18 AM