TS Debts : రాష్ట్రం అప్పుల కుప్ప
ABN, Publish Date - Feb 16 , 2024 | 04:51 AM
తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ‘కాగ్’ ఆక్షేపించింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించిపోయాయని వెల్లడించింది. గ్యారెంటీ అప్పుల విషయంలో
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రుణాలు..
2022 మార్చి నాటికే రూ.4.33 లక్షల కోట్ల అప్పు
జీఎ్‌సడీపీలో ఈ అప్పు వాటా 38 శాతం
దళిత బంధుకు రూ.3,442 కోట్ల అధిక వ్యయం
రుణ మాఫీ, డబుల్ ఇళ్లకు కేటాయించినా డబ్బుల్లేవు
ఎంబీసీ కార్పొరేషన్ 500 కోట్లలో పైసా ఖర్చు కాలేదు
గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన కాగ్
అసెంబ్లీలో 2021-22 సంవత్సరపు నివేదిక సమర్పణ
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ‘కాగ్’ ఆక్షేపించింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించిపోయాయని వెల్లడించింది. గ్యారెంటీ అప్పుల విషయంలో పారదర్శకత లోపించిందని, చివరికి వీటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వమే వాయుదాలు చెల్లించాల్సిన పరిస్థితిని తప్పుబట్టింది. 2019 నవంబరు లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రెవెన్యూ లోటు పెరిగి పోయిందని, కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాగ్ చెప్పింది. వడ్డీల భారం పెరిగిపోయిందని, బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయాల మధ్య అంతరం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించికంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రూపొందించిన నివేదికలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టింది.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటిన అప్పు
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎ్‌ఫఆర్‌బీఎం)’ చట్టం పరిమితిని దాటిపోయాయని ‘కాగ్’ వెల్లడించింది. రాష్ట్ర సొంత రుణాలు రూ.3,14,663 కోట్లు ఉంటే, కార్పొరేషన్లకు హామీ ఇచ్చిన రుణాలు రూ.1,18,955 కోట్లు కలిపి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.4,33,618 కోట్లకు చేరుకున్నాయని చెప్పింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.11,48,115 కోట్లలో అప్పులవాటా 37.77 శాతమని ప్రస్తావించింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన 25 శాతం పరిమితిని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన 29.30 శాతం వెసులుబాటు కన్నా కూడా ఇది చాలా ఎక్కువని చెప్పింది. బడ్జెటేతర రుణాల వల్లే పరిస్థితి ఇలా అదుపు తప్పిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి సేకరించిన రుణాల్లో 74 శాతాన్ని మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2018-19 నుంచి మూడేళ్లుగా మూలధన వ్యయం కన్నా మార్కెట్ రుణాలే ఎక్కువగా ఉన్నాయని కాగ్ గుర్తించింది. ద్రవ్య లోటులో మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల ద్వారానే 79 శాతం వరకు భర్తీ అయిందని గుర్తించింది.
గ్రాంట్లలో విపరీత అంచనాలు
పన్నేతర రాబడులు, సహాయక గ్రాంట్లను అధికంగా అంచనా వేశారని అవేవీ ఖర్చు కాలేదని కాగ్ గుర్తించింది. బడ్జెట్ అంచనాలకు మించి రూ.2,63,092 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నా చేబదుళ్లను పక్కనబెడితే వాస్తవంగా అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లేనని తెలిపింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 77 శాతమేనని వెల్లడించింది.
ఇవి అధిక వ్యయాలు
సేవా పింఛన్ల కింద రూ.5046 కోట్లు, దళిత బంధు కింద రూ.3,442 కోట్లు, కుటుంబ పింఛన్ల కింద రూ.1,929 కోట్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల వడ్డీ కింద రూ.1,785 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధిక వ్యయాలుగా కాగ్ తప్పు పట్టింది.
కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు
కొన్ని పథకాలకు నిధులు లేని కారణంగా బడ్జెట్ కేటాయింపుల కంటే తక్కువ వ్యయం చేసినట్లు కాగ్ గుర్తించింది. రైతు రుణ మాఫీ(రూ.4,462 కోట్లు), గ్రామీణ పేదలకు రెండు గదుల ఇళ్ల నిర్మాణం(రూ.4,270 కోట్లు), పట్టణ పేదలకు రెండు గదుల ఇళ్ల నిర్మాణం(రూ.4,035 కోట్లు), సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాల ప్రత్యేక అభివృద్ధి నిధి(రూ.3,898 కోట్లు) చొప్పున నిధులు తగ్గడంతో ఖర్చు పెట్టలేక పోయినట్లు తెలిపింది. ఎంబీసీ సంస్థకు కేటాయించిన రూ.500 కోట్లలో పైసా ఖర్చు కాలేదని గుర్తించింది.
విద్యా వైద్యం ఖర్చు తగ్గింది
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో జీతాల భారం పెరిగిందని కాగ్ వెల్లడించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వ వ్యయం గత కొన్నేళ్లుగా తక్కువగా ఉంటోందని గుర్తించింది. విపత్తు నివారణ నిధికి ప్రభుత్వం నిధులను జమ చేయడం లేదని ఆక్షేపించింది.
పదేళ్లలో 2,52,048 కోట్లు చెల్లించాలి
2023-24 సంవత్సరం నుంచి 2032-33 నాటికి పదేళ్లలో కాళేశ్వరం అప్పులు రూ,2,31,782 కోట్లను చెల్లించాలని కాగ్ చెప్పింది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు మరో రూ.20,266 కోట్లను చెల్లించాలని తెలిపింది. 2017-18లో రూ.10,836 కోట్లుగా ఉన్న వడ్డీ భారం 2021-22 నాటికి రెట్టింపు అయ్యిందని వెల్లడించింది.
కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు రూ.72,067 కోట్లు
2022 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూ.86,788 కోట్లను వ్యయం చేయగా... అందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం సంబంధిత నిధులే రూ.55,808 కోట్లు అని వివరించింది. 2021-22లో కార్పొరేషన్‌కు అసలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1,422 కోట్లను రుణ రూపంలో, పెట్టుబడుల రూపంలో మరో రూ.3,072 కోట్లను అందజేసిందని తెలిపింది. దీనిని బట్టి కార్పొరేషన్ రుణాలను చెల్లించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయం రూఢీ అవుతుందని పేర్కొంది. 14 ఏళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వమే రూ.1,41,544 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ఇవి కాక నీళ్లు పోయడానికి విద్యుత్తు చార్జీల కింద ఏడాదికి రూ.10,375 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.1,24,495 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.
Updated Date - Feb 16 , 2024 | 04:51 AM