Kumaram Bheem Asifabad: ఓం.. శివోహం..
ABN, Publish Date - Mar 08 , 2024 | 10:09 PM
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 8: మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం జిల్లాలోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉదయం 5గంటల నుంచి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
- కన్నులపండువగా మహాశివరాత్రి
- జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ
- ఈసుగాం, వాంకిడిలో ఆలయాలకు పోటెత్తిన జనం
- పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే హరీష్‌బాబు దంపతులు
- జాతరను సందర్శించిన ఎస్పీ సురేష్‌కుమార్
- జాతరకు ప్రత్యేక బస్సులు
- మొక్కులు తీర్చుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 8: మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం జిల్లాలోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉదయం 5గంటల నుంచి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. శివుని దర్శనం చేసుకోవడానికి అయన కటాక్షం పొందడానికి ప్రతి ఆలయంలో వందలాది సంఖ్యలో భక్తులు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్‌లో గల శివాలయంలో శివకల్యాణం కన్నుల పండువగా జరిగింది. ప్రజలు పెద్దఎత్తున శివ కల్యాణానికి హాజరయ్యారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధానవీదుల గుండా ఉత్సవవిగ్రహల భారీర్యాలీ నిర్వహించారు. అలాగే పెద్దవాగు ఒడ్డున గల బాలేశ్వర ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. మండలంలోని చిర్రకుంట, బూర్గుడ, గుండి గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చిర్రకుంట, బూర్గుడ శివాలయాలలో శివకల్యాణం, పల్లకీ ఊరేగింపు, రథోత్సవం అలరించింది. బూర్గుడ, గుండి శివాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. గుండి గ్రామంలోని శివాలయంలో శివరాత్రి వేడుకలను పురష్కరించుకొని నిర్వహించిన లక్కీడ్రాలో మొదటి బహుమతి స్కూటీని వాంకిడి మండలకేంద్రానికి చెందిన జవాజీసురేష్ గెలు పొందారు. ఆసిఫాబాద్ ఆర్టీసీ డీపో ఆధ్వర్యంలో వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెన మండల కేంద్రాలలో జరిగే శివరాత్రి వేడుకలకు ప్రత్యేక బస్సులు నడిపారు. అయా కార్యక్రమాల్లో ఎంపీపీ మల్లిఖార్జున్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మున్లు చిలూవేరి వెంకన్న, గాదవేణి మల్లేష్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.
వాంకిడి: మండల కేంద్రంలోని చికిలి నదీ తీరాన గల శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. వాంకిడి మండలం నుంచే కాకుండా ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, మహారాష్ట్ర సరిహద్దులోని రాజురా, లక్కడకోట్, దేవాడ, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శివకేశవుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివాలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి జనం పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది. మధ్యాహ్నం పెద్దసంఖ్యలో భక్తులు హాజరుకావడంతో శివకేశవులను దర్శించేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ ఆధ ్వర్యంలో సదుపాయాలు కల్పించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. సాయంత్రం 5గంటలకు నిర్వహించిన రథోత్సవాన్ని భక్తిశ్రద్దలతో జరిపారు. ఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీ సదయ్య, వాంకిడి జడ్పీటీసీ అజయ్‌కుమార్ ఎంపీపీ ముండె విమలాబాయి. వాంకిడి సీఐ శ్రీనివాస్, వాంకిడి, కెరమెరి ఎస్సైలు సాగర్, విజయ్‌కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ గాదే ప్రవీణ్ ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో భారీ పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణం, మండలంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయమే మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. ఈసుగాం శివమల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు దంపతులు పూజలు చేసేందుకు వచ్చారు. ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శివలింగానికి పూజలను చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. ఎస్పీ సురేష్ కుమార్ ఏర్పాట్లపై ఆరా తీశారు. శివమల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీతో పాటు సిర్పూరు(టి), కౌటాల, బెజ్జూరు, ఆసిఫాబాద్, రెబ్బెన, భీమిని, దహెగాం మండలాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు భక్తులకు అన్న దానం చేశారు. కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రావి శ్రీనివాస్ తాగునీటిని పంపిణీ చేశారు. పలు స్వచ్ఛందసంస్థల ఆధ్వర్యంలో భక్తులకు పండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే కోనప్ప పూజలు
ఈసుగాం శివమల్లన్న ఆలయంలో శుక్రవారం సాయంత్రం మాజీఎమ్మెల్యే కోనప్ప పూజలు నిర్వహించారు. శివలింగానికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట సతీమణి రమాదేవి, కార్యకర్తలు ఉన్నారు.
బెజ్జూరు: మండలంలోని రంగనాయక శివాలయం, హనుమాన్, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ, శక్తిడైరీఆధ్వర్యంలో సుధాకర్ గౌడ్, వెంకటరమణ, రవికాంత్, శ్రీనివాస్, సురేష్ మజ్జిగ పంపిణీ చేశారు, కాగజ్‌నగర పట్టణానికి చెందిన వ్యాపారి మంగిలాల్ అసవా ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. అందుగులగూడ శివమల్లన్న గుట్ట వద్ద ఆలయకమిటీ ఆధ్వర్యంలో అయిదు జంటలకు వివాహాలు జరిపించారు. భక్తులకు మజ్జిగ, పులిహార పంపిణీ చేశారు.
సిర్పూర్(యు): మండలకేంద్రంలోని మహదేవ్ ఆల యం భక్తులతో కిటకిటలాడింది. మహగాంలో భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించారు. అదే విధం గా మహగాం గురుదేవ్ ఆశ్రమం ఆధ్వర్యంలో శనివారం ఉచిత సామూహికవివాహలు నిర్వహించనున్నామని నిర్వా హకులు తెలిపారు.
సిర్పూర్(టి): మండలకేంద్రంలోని శివాలయంలో తెల్లవారు జామునుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగేబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో, టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోడ్సా పెన్‌గంగా వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఉపవాస దీక్షలు పాటించారు.
రెబ్బెన: మండల కేంద్రంలో శివరాత్రి పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. నంబాలలోని దుర్గాపూర్ శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాలతోపాటు తాండూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. భక్తుల సౌకర్యార్థం జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
చింతలమానేపల్లి: మండలంలోని కర్జవెల్లి ముసలమ్మ గుట్ట శివాలయం శుక్రవారం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధ్వజారోహణ, శివలింగానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శివపల్లి అటవీప్రాంతంలో ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కర్జవెల్లి శివాలయంలో క్రియేటింగ్ స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
కౌటాల: మండలంలో తాట్‌పల్లి, తుమ్మిడిహెట్టి, సదాశివపేట శివాలయం, కంకాలమ్మ ఆలయాల్లో ఘనంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే మండలానికి ఆనుకునిఉన్న ప్రాణహిత, పెన్‌గంగానదుల్లో పుణ్యస్నానాలు ఆచరిం చారు. ముఖ్యంగా తాట్‌పల్లి వద్ద నది మధ్యలో గల కుల్తా (దీపం)లో ఆలయం ఉండడంతో తెలంగాణ, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నది పరివాహకప్రాంతం కావడంతో కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణం జరిపించారు.
జైనూర్: మండల పరిధిలోగల పట్నాపూర్ సిద్ధేశ్వర్ సంస్థాన్‌లో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. తొలుతు సద్గురు పూలాజీబాబా సతీమణి ఇంగ్లే ద్రుపదబాయి, బాబా తనయుడు ఇంగ్లే కేశవ్‌రావ్, వామన్‌రావ్ ఇంగ్లే, మాజీఎంపీ రాథోడ్‌రమేష్ జెండాకు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పదినిమిషాల పాటు ధ్యానం చేశారు. సుమారు 6వేలమంది భక్తులు హాజరు కాగా చివరిరోజు శనివారం సుమారు 10వేల మంది భక్తులు రావచ్చని సిద్ధేశ్వర్ సంస్థాన్ చైర్మన్ కేశవ్‌రావ్ ఇంగ్లే తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత ఈశ్వర్, కరీంనగర్ డీటీడీవో గంగారాం, విద్యుత్ ఉన్నతాధికారి శేవరావ్, గ్రామపటేల్, మాగాడె రంగారావ్, మాగాడె దాదరావ్, కార్యదర్శి డుక్రె సుభాష్, ఆడె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామి పల్లకీ ఊరేగింపు
కెరమెరి: మండలకేంద్రంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే వెంకటేశ్వర స్వామి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయంలో మొదలైన శోభాయాత్ర నెహ్రూనగర్‌లోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కొనసాగింది. దారిపొడవున భాజాభజంత్రీలతో సందడినెలకొంది. మహిళలు మంగళహారతులతో శోభయాత్రకు స్వాగతం పలికారు. అలాగే స్థానిక శివాయలంలో సైతం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అలాగే గోయగాం, అనార్‌పల్లి గ్రామాల్లో శివాలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టి అన్నదానం చేశారు.
దహెగాం: మండలంలోని అయినం, కుంచవెల్లి, లగ్గాం, దహెగాం గ్రామాలతోపాటు పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అలాగే శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసదీక్షలు ఇంటి ముందర అఖండ దీపాన్ని వెలిగించి జాగరణ చేశారు.
Updated Date - Mar 08 , 2024 | 10:23 PM