Hardik Pandya: ఇషాన్, శ్రేయస్‌లను తప్పించారు.. హార్దిక్‌కు మాత్రం ఎందుకు చోటిచ్చారు.. విమర్శలకు సమాధానం ఏంటంటే..
ABN, Publish Date - Mar 01 , 2024 | 08:44 PM
దేశవాళీ క్రికెట్ ఆడకపోయినప్పటికీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందగలిగాడు. దీంతో ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించిన బీసీసీఐ హార్దిక్‌ను మాత్రం కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపకపోవడంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)లకు బీసీసీఐ (BCCI) ఝులక్ ఇచ్చింది. వారిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయితే వారి లాగానే దేశవాళీ క్రికెట్ ఆడకపోయినప్పటికీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మాత్రం సెంట్రల్ కాంట్రాక్ట్ (Contract)పొందగలిగాడు. దీంతో బీసీసీఐ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. పాండ్యాకు ఛాన్స్ ఇచ్చి, ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు బీసీసీఐ అధికారి సమాధానం ఇచ్చారు. హార్దిక్ పాండ్యా ఇచ్చిన స్పష్టమైన హామీ కారణంగానే అతడిని కాంట్రాక్ట్‌లోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ``సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించే ముందు హార్దిక్ పాండ్యాతో మాట్లాడాం. ఫిట్‌గా ఉండి జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడతానని పాండ్యా చెప్పాడు. ప్రస్తుతం హార్దిక్ ఫిట్‌గా లేడని వైద్యులు నివేదిక ఇచ్చారు. కాబట్టి అతడు రంజీలు ఆడలేకపోయాడు. భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడనపుడు విజయ్ హజారే, ముస్తాక్ అలీ టోర్నీల్లో ఆడతానని హామీ ఇచ్చాడ``ని బీసీసీఐ అధికారి తెలిపారు.
పాండ్యాకు కాంట్రాక్ట్ ఇవ్వడం సముచితమేనని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తెలిపాడు. ``పాండ్యా ఎప్పట్నుంచో టెస్ట్ క్రికెట్ ఆడడం లేదు. టెస్ట్ మ్యాచ్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేసేంత ఫిట్‌నెస్ అతడికి లేదు. టీమిండియా టెస్ట్ సిరీస్‌లు ఆడేటపుడు అతడు ఖాళీగా ఉండక తప్పదు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లకే దూరమైనవాడు.. రంజీలు ఎలా ఆడతాడు? అతడు చేయని తప్పుకు అతడిని ఎలా బలి చేస్తారు? `` అంటూ ఆకాష్ చోప్రా కామెంట్ చేశాడు.
Updated Date - Mar 01 , 2024 | 08:44 PM