తినేవాళ్లకు పెట్టడంలో ఉండే తృప్తే వేరు..!
ABN, Publish Date - Mar 07 , 2024 | 05:03 AM
అత్తాకోడళ్లే.. కానీ స్నేహితుల్లా ఉంటారు. ‘‘మా అత్తమ్మ మా ఉమ్మడి కుటుంబానికి ఇరుసు’’ అంటుంది కోడలు. ‘‘ఈ తరం వాళ్లను చూసి మేము నేర్చుకోవాలి.. ఈ వయస్సులో నన్ను వాణిజ్యవేత్తను చేసింది మా కోడలే’’ అంటారు ఆ అత్త. ఆ అత్తా కోడళ్లు ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన.
రేపు మహిళా దినోత్సవం
అత్తాకోడళ్లే.. కానీ స్నేహితుల్లా ఉంటారు. ‘‘మా అత్తమ్మ మా ఉమ్మడి కుటుంబానికి ఇరుసు’’ అంటుంది కోడలు. ‘‘ఈ తరం వాళ్లను చూసి మేము నేర్చుకోవాలి.. ఈ వయస్సులో నన్ను వాణిజ్యవేత్తను చేసింది మా కోడలే’’ అంటారు ఆ అత్త. ఆ అత్తా కోడళ్లు ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన. వాళ్లిద్దరి కబుర్లు వింటుంటే గంటలు గడిచిపోతూ ఉంటాయి. తాజాగా వారిద్దరూ కలిసి రెడీ టూ ఈట్ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలతో పాటు తమ అనుబంధం గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
కొణిదెల ఫ్యామిలీ వారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పెరుగన్నం తింటారు. నేను, చరణ్- ఇంగ్లాండ్‌లో ఒక పెద్ద రెస్టారెంట్‌కు వెళ్లాం. రాత్రి తిరిగి వచ్చేసిన తర్వాత - ‘‘పెరుగన్నం ఉందా?’’ అని అడిగాడు. తనకి రసం అంటే చాలా ఇష్టం.
- ఉపాసన
‘‘మాది చాలా పెద్ద కిచెన్. ఒక రూమ్‌లో ఫ్రీజర్, మరో రూమ్‌లో ఫ్రిజ్‌లు- ఇలా ఉంటాయి. ఉపాసన దీన్ని ‘ఇండస్ట్రియల్ కిచెన్’ అంటూ ఉంటుంది. ఎవరికి ఏం కావాలన్నా వండించి పెట్టడం నాకు ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు వంటవాళ్లు ఉన్నారు. నాలుగు తరాలవారికి అవసరమైనవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వారు ఏం చేయాలో చెప్పేది నేనే! నా చిన్నప్పుడు అమ్మ వాళ్లింట్లో- అందరం ఒకే వంట తినేవాళ్లం. వేర్వేరు వంటలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వేర్వేరు వంటలు తప్పనిసరి అయ్యాయి.’’
- సురేఖ
మెగాస్టార్ సతీమణిగా మీరు తెలుగు ప్రజలకు సుపరిచితులు. కానీ మీరు ఎప్పుడూ బయటకు రాలేదు. తొలిసారి బయటకు వచ్చి- ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభించటం ఎలా అనిపిస్తోంది?
సురేఖ: కొత్తగా ఉంది. మా అవసరాలకు తగినంత.. తగినట్లుగా ఆహారాన్ని తయారుచేసుకోవటం.. స్నేహితులకు పంచటం మాత్రమే మాకు తెలుసు. కానీ నాకు తెలిసినవన్నీ అందరికి పంచితే బావుండుననే ఆలోచన చాలాకాలంగా ఉంది. నేను, ఆయన (చిరంజీవి) అనేక దేశాలకు వెళ్తూ ఉంటాం. మాకు హాలిడే అంటే- సైట్ సీయింగ్ కాదు. ఒక చోట ప్రశాంతంగా ఉండటం, వండుకోవటం, తినటం. అయితే వేరే దేశాలకు వెళ్లినప్పుడు ఒకటి రెండు రోజుల కన్నా- ఎక్కువ బయట తినలేం. ఇంట్లో వండిన ఆహారం తినాలనిపిస్తుంది. గతంలో ఒకటి రెండుసార్లు చాలా ఇబ్బంది పడ్డాం. అప్పటి నుంచి... విదేశాలకు వెళ్లాలంటే- ప్రీమిక్స్‌లు తయారుచేసి పట్టుకెళ్లేదాన్ని. వాటిని వండుకొనేవాళ్లం. ఆస్కార్స్ సమయంలో ఉపాసన గర్భవతి. తనకు విదేశాలలో ఆరోగ్యకరమైన ఆహారం దొరకకపోవచ్చు కాబట్టి- ఇక్కడి నుంచి రకరకాల రెడీ మిక్స్‌లు చేసి ఇచ్చాను. ఉపాసన వాటిని బాగా ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో తనుకు పుట్టిన ఆలోచనే- ఈ ‘అత్తమ్మాస్ కిచెన్’. తన ఉద్దేశంలో ఇది ప్రజలందరికీ మేలు చేసే ఒక మంచి వ్యాపార అవకాశం. తను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. దీన్నొక అవకాశంగా భావించింది. ఈ విషయం తను చెప్పినప్పుడు నేను అంగీకరించా. ఎందుకంటే- ఈ తరం బాగా బిజీ అయిపోయింది. అనేక మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసి వచ్చి వండుకోలేని వాళ్లు ఉంటారు. అందుకే ఈ వయస్సులో- లేటుగా అయినా- వ్యాపారవేత్త అవ్వాల్సి వచ్చింది.
మీకు చిన్నప్పటి నుంచి బాగా వంట చేయటం వచ్చా?
లేదండి. మా అమ్మ వాళ్లింట్లో నేనే చిన్నదాన్ని. కూరలు తరగటం లాంటి చిన్న చిన్న సాయాలు చేయటం తప్ప వండటం రాదు. పెళ్లి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నా. ఇక్కడ మీకో రహస్యం చెబుతా. వంటలో నాకు గురువు- మా ఆయనే. మామయ్యగారు భోజన ప్రియులు. మా అత్తయ్యగారు చాలా బాగా వండుతారు. దాంతో ఆయన చిన్నప్పుడు రకరకాల వంటలు వండేవారట. మాకు పెళ్లైన కొత్తల్లో- అత్తమ్మలాగ నేను కూడా వంటచేస్తే బావుండునని ఆయనకు ఉండేది. కానీ నాకు రాదు. కాపురానికి వెళ్లిన తర్వాత- ఒక రోజు ఉప్మా చేశా. ఉండలు ఉండలుగా వచ్చింది. అప్పటిదాకా ఉప్మా అలాగే చేస్తారనుకొనేదాన్ని. ఆ తర్వాత ఆయనే నాకు ఉప్మా చేయటం, ఇతర వంటలు వండటం నేర్పారు. మా ఇంట్లో ఉప్మా- ఇప్పుడు చాలా ఫేమస్. చాలా మంది అడిగి మరీ తింటారు.
మరి ఈ ప్రీకుక్డ్ వంటలు ఎప్పుడు మొదలుపెట్టారు?
మా పెళ్లైన రెండు నెలలకు- ‘ 47 డేస్’ అనే సినిమా షూటింగ్ కోసం పారిస్ వెళ్లాం. అక్కడ సరైన ఆహారం లభించేది కాదు. వంట చేద్దామంటే- వంట సామాను దొరికేది కాదు. అది నాకొక పెద్ద పాఠం. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్లాలంటే- ముందుగానే రకరకాల ప్రీకుక్డ్ వంటలు తయారుచేసుకొని వెళ్లేదాన్ని. ఒక స్టవ్, కొన్ని గిన్నెలు- ఉంటే చాలు. వండుకొని తినే వాళ్లం.
మీది ఉమ్మడి కుటుంబం కదా.. అందరూ భోజన ప్రియులేనా?
ఆయన (చిరంజీవి) ఏది పెట్టినా తినేస్తారు. చివరకు పచ్చడీ అన్నమైనా తినేస్తారు. నాగబాబుకు మాత్రం అన్ని రుచులు కావాలి. కళ్యాణ్‌బాబుది వాళ్ల అన్నయ్య వరసే! ఎటువంటి డిమాండ్లూ ఉండవు. ఏది పెట్టినా తినేస్తాడు. ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. మామయ్యగారు చక్కగా తినేవారు. ఆయన తినటం చూస్తే- మిగిలిన వాళ్లకు కూడా తినాలనిపిస్తుంది. అదొక కళ.. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి- అందరికీ పెట్టడం నేర్పింది. ఎవరైనా తృప్తిగా తింటుంటే ఇంకా పెట్టాలనిపిస్తూ ఉంటుంది. తినేవాళ్లకు పెట్టడంలో లభించే తృప్తి వేరు!
ఉపాసన... మీరు వంట చేస్తారా?
ఉపాసన: కొన్నిసార్లు. పెళ్లికాక ముందు వంటలు రావు. పెళ్లి అయిన తర్వాత అత్తమ్మ దగ్గర వంటలు నేర్చుకున్నా!
మీ అత్తయ్య నుంచి మీరు నేర్చుకున్నదేమిటి?
వంటలు నేర్చుకోవటం ఒకటి. కుటుంబ విలువలు నేర్చుకోవటం మరొకటి. అత్తమ్మ- ఈ రోజుకి ఇంట్లో అందరూ తింటే తప్ప తను తినదు. నాకు పెళ్లైన కొత్తల్లో తనని చూస్తే చాలా ఆఽశ్చర్యంగా ఉండేది. ఆ తర్వాత ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి తాను ఒక ఇరుసు ఎందుకైందో నాకు అర్థమయింది. అంతే కాదు... తన వడ్డన కూడా చాలా అప్యాయంగా ఉంటుంది. నాకు ఒక పద్ధతిగా తినటం తనే నేర్పించింది. ఒకప్పుడు నేను ముందు పెరుగు తిని- ఆ తర్వాత మిగిలినవి తినేదాన్ని. కానీ నాకు అత్తమ్మ- ముందు పప్పు, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆ తర్వాత పెరుగు తినటం నేర్పించింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే- మన ముందు తరం వారిలో ఉన్న మంచిని నేర్చుకోవాలి. మొత్తం కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద- అందరూ ఏం తింటారో, ఎవరికి ఏది ఇష్టమో అత్తమ్మకు తెలుసు. మూడు రోజుల క్రితం- కళ్యాణ్‌గారు ఇంటికి వచ్చారు. వస్తారని తెలిసి ఆయనకు ఇష్టమైన బిర్యానీ చేయించారు. ప్రతి రోజు ఏదో ఒక వంట- ఎవరో ఒకరికి వెళ్తూనే ఉంటుంది.
సురేఖగారు... మీరు నాలుగు తరాలను దగ్గరగా చూశారు.. చూస్తున్నారు.. మీరు గమనించిన మార్పులేమిటి?
ఒకప్పుడు ఆహారంపైౖ పెద్ద అవగాహన ఉండేది కాదు. పెద్ద వాళ్లు చెప్పిందే పాటించేవారు. కానీ ఇప్పుడు అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక బలంగా ఉంది. ఎంత తినాలి? ఎప్పుడు ఆపేయాలి? అనే విషయంలో స్పష్టత ఉందనిపిస్తోంది. బయట ఎక్కువ తింటున్నారనే కంప్లైంట్ తప్ప- ఆహారం విషయంలో ప్రస్తుత తరమే మేలనిపిస్తోంది.
మీ సమయంలో ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేసేవారు కారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా?
సురేఖ: ఇప్పటి పిల్లలు చాలా కష్టపడుతున్నారు. కానీ ఏం చేస్తారు? ఇద్దరు పనిచేస్తే తప్ప అన్ని సౌకర్యాలు లభించవు. ఉద్యోగాలు చేసే అమ్మాయిలను చూస్తే జాలనిపిస్తుంది. కానీ వాళ్లు చాలా తెలివైన వాళ్లు. ఇటు పనిచేసుకుంటున్నారు, అటు పిల్లలతో కూడా సమయం గడుపుతున్నారు.
ఉపాసన: పని, ఇల్లు రెండూ ముఖ్యమైనవే! సమయానుకూలంగా ప్రాధమ్యాలు నిర్ణయించుకోవాలి. మార్చి ఎండింగ్ వచ్చేస్తోంది. అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఐదారు రోజులు ఆఫీసులోనే గడపాల్సి వస్తుంది. పిల్లల పరీక్షలు వస్తాయి. స్కూలు డేలు వస్తాయి. అలాంటప్పుడు కుటుంబంపైనే దృష్టి పెట్టాల్సి వస్తుంది. అయితే చాలాసార్లు రెండింటినీ కలిసి చూసి- పరిస్థితులు రివ్యూ చేసుకోకపోతే సమస్యలు వస్తాయి. చాలా మంది తమ బిజినెస్ గోల్స్‌ను రివ్యూ చేసుకుంటారు. కానీ ఫ్యామిలీ గోల్స్‌ను రివ్యూ చేసుకోరు.
‘‘మా అత్తయ్యగారు అంజనాదేవి గొప్ప కుక్. ఆవిడ దగ్గర నుంచి నేను వంట నేర్చుకున్నా. మామయ్య వెంకటరావు గారికి నాన్‌వెజ్ చాలా ఇష్టం. శనివారం నాన్‌వెజ్ వండేవారు కాదుట. అందువల్ల ఆ ఫ్లేవర్ వచ్చేలా అత్తయ్య వెజిటేరియన్ వంటలు వండేవారు. ఐదారు రకాల ఆకు కూరలతో అత్తయ్య బిర్యానీ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి బిర్యానీ ఎవరూ చేయటం నేను చూడలేదు.’’
ఆయన పచ్చడితోనైనా అన్నం తినేస్తారు. రకరకాల వంటలు తినాలని ఉండదు. కానీ ఉప్పు తక్కువైతే మాత్రం చెబుతారు. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మేము మద్రాసులో కాపురం ఉండే సమయంలో ఆయన షూటింగ్స్‌లో బాగా బిజీగా ఉండేవారు. ప్రసాద్‌బాబు, ఈయన కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక రోజు ఇంట్లో కూరలు లేకపోతే- పప్పుచారు పెట్టి, వడియాలు వేయించా. ఈయన అవి తినేసి షూటింగ్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం వచ్చిన తర్వాత- ‘‘ప్రసాద్‌బాబు షూటింగ్‌కి వచ్చి, వెళ్లిపోయాడు’’ అని చెప్పారు. దానికి కారణం- ఆ రోజు వాళ్లింట్లో జరిగిన గొడవట. అది కూడా కోడిగుడ్ల గురించి.ప్రసాద్‌బాబు వాళ్లావిడ కోడిగుడ్ల పులుసు పెడితే- అందులో రెండు గుడ్లే వేసిందని గొడవ చేసి ప్లేటు విసిరి షూటింగ్‌కి వచ్చాడట. వచ్చి ఈయనని ఏం తిన్నావని అడిగితే- పప్పుచారు.. వడియాలు అని చెప్పారట. ఈయన ఇంత సింపుల్‌గా ఉండటం చూసి, గిల్టీగా అనిపించి. భార్యకు సారీ చెప్పటానికి షూటింగ్ వదిలి వెళ్లిపోయారట. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
సంక్రాంతికి మొత్తం కుటుంబం అందరం కలిసి బెంగుళూరు వెళ్లాం. అందరూ వచ్చారు. పిల్లలు, పెద్దలు- ఇలా అందరికీ కావాల్సిన వంటలన్నింటినీ ముందే ప్లాన్ చేసి మెనూలు పంపేశాం. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. నా ఉద్దేశంలో- పిల్లలు పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారు. మనం ఒక మంచి పనిచేస్తే వాళ్లు చేస్తారు. మొన్న పండగ చాలా సంతోషంగా గడిచింది. పిల్లలు ఆ సంతోషాన్ని అనుభవించారు కాబట్టి వాళ్లు పెద్దయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తారు. ఆ పండుగ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. మొన్న అమెరికాకు వెళ్తే చాలా మంది ఆ పండుగ గురించే ప్రస్తావించారు. తాము కూడా స్ఫూర్తి పొందామని చెప్పారు.
మా ఇంట్లో పిల్లలకు తృణధాన్యాలతో ఆహారాన్ని నేనే తయారుచేస్తా. సెరిలాక్ వంటివి కూడా వాడం. బయట దొరికే ఆహార పదార్థాలలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయి.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
Updated Date - Mar 07 , 2024 | 05:03 AM