ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెద్ద పేగు పదిలంగా...

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:53 AM

పెద్ద పేగుల్లో చిన్న చిన్న బుడిపెలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కాలక్రమేణా కేన్సర్‌గా మారతాయి.

పెద్ద పేగు సమస్యల లక్షణాలను తేలికగానే

కనిపెట్టవచ్చు. కానీ మలవిసర్జనతో ముడిపడి ఉన్న

ఈ సమస్యల గురించి లోలోపలే మధన పడడం మినహా త్వరపడి వైద్యులను సంప్రతించే వాళ్లు తక్కువే! కానీ నిర్లక్ష్యం చేస్తే, కేన్సర్‌గా పరిణమించే పెద్ద పేగు సమస్యలను కొలనోస్కోపీతో ముందుగానే కనిపెట్టి, చికిత్సతో సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు.

పోషకాలను శోషించుకుని, విసర్జకాలను శరీరం నుంచి బయటకు పంపించే పెద్ద పేగులో పాలిప్స్‌ తలెత్తవచ్చు. పూతకు గురి కావచ్చు. మలద్వారం దగ్గర పైల్స్‌, ఫిషర్స్‌ లాంటి ఇబ్బందులు కూడా మొదలు కావచ్చు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, అవి కేన్సర్‌గా కూడా మారవచ్చు. కాబట్టి ఈ సమస్యల్లో తలెత్తే లక్షణాలను గమనిస్తూ ఉండడం అవసరం.

పెద్ద పేగు కేన్సర్‌

పెద్ద పేగుల్లో చిన్న చిన్న బుడిపెలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కాలక్రమేణా కేన్సర్‌గా మారతాయి. ఇలా కేన్సర్‌గా మారకముందే ఆ పాలి్‌ప్సను తొలగిస్తే, కోలన్‌ కేన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ పాలిప్స్‌ ఉనికికి సంబంధించి ఎలాంటి లక్షణాలూ బహిర్గతం కాకపోవచ్చు. కాబట్టి 55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుని పాలిప్స్‌ లేవని నిర్థారించుకోవాలి. ఒకవేళ ఉంటే, వాటిని తొలగించుకోవాలి. 30 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా అన్ని కేన్సర్లలో కోలన్‌ కేన్సర్‌ మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడది ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. పెద్దపేగులోని పాలి్‌ప్సను కొలనోస్పోపీతో ముందుగానే కనిపెట్టి వాటిని తొలగించడమే అందుకు కారణం. కాబట్టి కనీసం 55 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ పెద్ద పేగు కేన్సర్‌ నుంచి రక్షణ కోసం కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో పాలిప్స్‌ లేవని నిర్థారణ అయితే, ఐదేళ్లకు మరోసారి పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఆ పరీక్షలో కూడా పాలిప్స్‌ లేవని నిర్థారణ అయితే ఆ తర్వాత పరీక్ష చేయించుకోవలసిన అవసరం లేదు.

చికిత్స ఇలా: కేన్సర్‌ దశను కనిపెట్టడం చికిత్సలో కీలకం. పక్కలకు పాకకుండా ఒక ప్రదేశానికే పరిమితమైన మొదటి దశలో సర్జరీ చేసి, కేన్సర్‌ సోకిన భాగాన్ని తొలగిస్తారు. తొలగించిన భాగాన్ని పరీక్షించినప్పుడు, జీన్‌ మ్యుటేషన్స్‌ ఉన్నట్టు నిర్థారణ అయితే, వాళ్లకు మాత్రమే కీమోథెరపీ అవసరమవుంది. వ్యాధి లింఫ్‌ నోడ్స్‌కు కూడా పాకితే అది రెండు, మూడవ దశ కోలన్‌ కేన్సర్‌గా వైద్యులు నిర్ధారిస్తారు. పెద్దపేగు కేన్సర్‌ కాలేయానికి పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాల్గవ దశలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా కాలేయానికి పాకినప్పటికీ ఆ కేన్సర్‌ను సైతం నిర్మూలించే సమర్థమైన చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. సర్జరీ, కీమోథెరపీలతో పాటు అదనంగా అందించే టార్గెటెడ్‌ ఇమ్యునోథెరపీ వల్ల సమర్థమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ చికిత్సతో లైఫ్‌ ఎక్సెప్టెన్సీ 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువకు పెరుగుతోంది. కాబట్టి కోలన్‌ కేన్సర్‌కు భయపడవలసిన అవసరం లేదు.

పేగులో పూత

దీన్నే ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌ అంటారు. దీనికి అల్సరేటివ్‌ కొల్లైటిస్‌, క్రోన్స్‌ డిసీజ్‌ అనే మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం మన దేశంలో ఈ సమస్య ఎంతో తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ప్రాసెస్‌ చేసిన పదార్థాలతో కూడిన వెస్టర్న్‌ డైట్‌ పేగులో పూతకు ప్రధాన కారణం. అలాగే కొంతమందికి జన్యుపరమైన లోపాలు ఉంటాయి. ఈ లోపాలకు తోడు పర్యావరణ ప్రభావాలు కూడా తోడైతే పేగు పూత వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ మూలంగా తలెత్తే ఈ పేగు పూత కొద్ది రోజుల పాటు మందులు వాడితే తగ్గే సమస్య కాదు. మధుమేహం లాగే ఇదొక తీవ్ర ఆరోగ్య సమస్య. ఈ సమస్యకు జీవిత కాలం మందులు వాడక తప్పదు. లేదంటే పూత పెరిగి, ఇన్‌ఫెక్షన్లు పెరిగి, పేగుకు రంథ్రం పడే అవకాశం ఉంటుంది. పేగు, పోషకాలను శోషించుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది. కాబట్టి శరీరం బలహీనపడి, పలు రకాల ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇదే సమస్య కేన్సర్‌గా మారే అవకాశాలు 25 నుంచి 30ు ఎక్కువ.

లక్షణాలు ఇవే: మలవిసర్జన క్రమం తప్పడం, పలుచని విరోచనాలు, మలంలో రక్తం, పొట్టలో నొప్పి, విరోచనాన్ని ఆపుకోలేకపోవడం, బరువు తగ్గడం ప్రధాన లక్షణాలు. సాధారణంగా 15, 20, 30, 40 వయస్కుల్లో ఈ సమస్య ఎక్కువ. పైగా ఇది మలవిసర్జనకు సంబంధించిన సమస్య కాబట్టి నలుగురితో పంచుకోడానికి ఇబ్బంది పడుతూ, జీవనశైలి దెబ్బతిని, మానసిక కుంగుబాటుకు కూడా లోనవుతారు.

చికిత్స సులువే: పూత ఏర్పడిన ప్రదేశం మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. పెద్ద, చిన్న రెండు పేగుల్లో ఉందా? పెద్ద పేగులో ఎడమ వైపు ఉందా లేక కుడి వైపు ఉందా లేక పేగు మొత్తం వ్యాపించిందా? వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది అనే అంశాల ఆధారంగా వైద్యులు తగిన చికిత్సను ఎంచుకుంటారు. స్వల్ప పూతకు నోటి మాత్రలతో సమస్య మధ్యస్థంగా ఉంటే మందులు, ఇంజెక్షన్లతో, పూత తీవ్రంగా ఉండి, పేగుకు రంథ్రం పడే అవకాశాలుంటే, సర్జరీ చేసి ఆ పేగు భాగాన్ని తొలగించవలసి ఉంటుంది. పేగు పూత ఒకసారి మొదలైన తర్వాత చికిత్స తీసుకుంటూనే క్రమం తప్పక వైద్యులను కలుస్తూ, పూత పరిస్థితిని గమనించుకుంటూ, తగినట్టు చికిత్సను మార్చుకుంటూ ఉండాలి.

నివారణ ఉంది: వంశపారంపర్యంగా జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే పేగు పూతను నియంత్రించలేకపోయినా, ఆహారపుటలవాట్ల వల్ల వచ్చే ఈ సమస్యను ఆ పదార్థాలకు దూరంగా ఉండడం ద్వారా నియంత్రించుకోవచ్చు. కాబట్టి ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మానేయాలి. కొందర్లో జన్యు పరివర్తన జరిగి ఉండవచ్చు. అలాంటి వాళ్లు ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల ఈ సమస్య ప్రేరేపితం కావచ్చు. కాబట్టి ఆహారపుటలవాట్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ, లక్షణాలు తలెత్తిన వెంటనే వైద్యులను కలిస్తే పేగు పూతను సమర్థంగా అదుపులోకి తెచ్చుకోవచ్చు.

మొలల సమస్య

అస్తవ్యస్థమైన ఆహారపుటలవాట్లు, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మలబద్ధకం మొలలు, ఫిషర్‌లకు ప్రధాన కారణాలు. మలద్వారం దగ్గర వాపు, నొప్పి, రక్తస్రావం, అసౌకర్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించుకోవాలి. మొలల సమస్య ఉన్నప్పుడు అన్నిటికంటే ప్రధానంగా పెద్ద పేగు కేన్సర్‌ లేదని నిర్థారించుకోవడంతో పాటు, మొలలు, ఫిషర్‌లు ఏ దశలో ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. ఆ గ్రేడ్‌ల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్స తర్వాత ఈ సమస్యలు తిరగబెట్టకుండా పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

45, 50 ఏళ్లు దాటిన వాళ్లు, బోవెల్‌ హ్యాబిట్స్‌లో మార్పు కనిపిస్తే అప్రమత్తం కావాలి. మలబద్ధకం ఉన్నవాళ్లకు అకస్మాత్తుగా సాధారణ విసర్జన జరుగుతున్నా, సాధారణ విసర్జన జరుగుతున్న వాళ్లలో అకస్మాత్తుగా మలబద్ధకం తలెత్తినా... ఇలా మలవిసర్జన క్రమం తప్పి, బోవెల్‌ హ్యాబిట్స్‌లో తలెత్తే మార్పులను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. అలాగే మలంలో రక్తం పడుతున్నా, అకారణంగా బరువు తగ్గినా, అనీమియా తలెత్తినా కోలన్‌ కేన్సర్‌ ఉందేమోనని అనుమానించి కొలనోస్కోపీ చేయించుకోవాలి. కచ్చితంగా కోలన్‌ కేన్సర్‌ సోకి ఉండకపోయినా, ఇతరత్రా సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ ఈ పరీక్షతో బయటపడతాయి.

ఏది సహజం - ఏది అసహజం

కొందరికి రోజులో ఒకసారి మలవిసర్జన జరిగితే, ఇంకొందరికి రెండుసార్లు జరగవచ్చు. కొందరికి మూడు రోజులకోసారి లేదా ఐదు రోజులకోసారి మలవిసర్జన జరుగుతూ ఉండవచ్చు. మలవిసర్జన సమయంలో ఇబ్బందికి లోను కాకుండా, సాఫీగా జరగుతున్నంత కాలం ఈ అలవాట్లను ఆరోగ్యకరమైనవిగానే భావించాలి. ఇలా వ్యక్తుల్లో మలవిసర్జన వ్యవధులు భిన్నంగా ఉండడం కూడా సహజమే! అయితే ఈ ప్యాటర్న్‌ మారకుండా అలాగే కొనసాగుతున్నంత వరకూ భయపడవలసిన అవసరం లేదు. అలా కాకుండా ఈ బోవెల్‌ హ్యాబిట్‌ ప్యాటర్న్‌లో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను కలవాలి.

Updated Date - Feb 13 , 2024 | 12:53 AM

Advertising
Advertising