ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hetal Dave: సుమో దీదీ!

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:48 AM

‘‘నలుగురూ వెళ్ళే దారిలో వెళ్ళడం సౌకర్యంగా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా సంతృప్తికరంగా ఉండదు.

‘సుమో రెజ్లింగ్‌’ అనగానే గుర్తుకొచ్చేది భారీకాయులైన పురుషులే... పురుషుల ఆధిపత్యం కొనసాగే ఈ క్రీడలో ధైర్యంగా అడుగుపెట్టడమే కాదు... భారతదేశంలో తొలి మహిళా సుమో రెజ్లర్‌గా, ప్రపంచంలో టాప్‌-5లో ఒకరుగా తనదైన చరిత్ర సృష్టించారు హేతల్‌ దావే. ఆమె కథతో రూపొందిన ‘సుమో దీదీ’ చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మన్ననలు అందకుంది.‘‘ఈ రంగంలో మన దేశం నుంచి ఎక్కువమంది మహిళా ఛాంపియన్లను తయారుచేయడమే తన ధ్యేయం’’ అంటున్న 36 ఏళ్ళ హేతల్‌ విభిన్నమైన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

‘‘నలుగురూ వెళ్ళే దారిలో వెళ్ళడం సౌకర్యంగా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా సంతృప్తికరంగా ఉండదు. అందుకే ఎప్పుడూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటాను. ఈ స్వభావం నాకు మొదటినుంచీ ఉంది. అదే నన్ను ఈ స్థాయిలో నిలిపింది. దీనికి తొలి ప్రేరణ నా కుటుంబం నుంచే లభించింది. నా స్వస్థలం ముంబాయి. మా నాన్న సుధీర్‌ ధావేకి క్రీడలంటే ఎంతో ఇష్టం. అందుకే మా అన్నయ్య అక్షయ్‌ను మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రోత్సహించారు. అన్నయ్య సాధన చేస్తున్నప్పుడు తనతోపాటు నేనూ వెళ్ళేదాన్ని. అలా నాకు తెలియకుండానే వాటి మీద ఇష్టం పెరిగిపోయింది. బ్రూస్లీ, జాకీచాన్‌ సినిమాలు కూడా నన్ను ప్రభావితం చేశాయి. అన్నయ్యతోపాటు నేనూ జూడో నేర్చుకుంటానని ఇంట్లో చెప్పాను. మా కుటుంబంలో చాలాకాలం తరువాత పుట్టిన ఆడపిల్లనని నన్ను అందరూ అపురూపంగా చూసుకొనేవారు. అందుకే వాళ్ళు వద్దంటారని అనుకున్నాను. కానీ అమ్మానాన్నతో పాటు మా తాతయ్య, బామ్మ... ఇలా అందరూ ప్రోత్సహించారు. అప్పుడు నా వయసు అయిదేళ్ళే. జూడోలో ప్రావీణ్యం వచ్చిన తరువాత... కుస్తీ నేర్చుకున్నాను. సుమో రెజ్లర్‌ కావాలనే నా కలకు అప్పుడే బీజం పడింది. కానీ అది అంత సులభంగా నెరవేరలేదు.


ఆశ వదిలేసుకున్నా...

నాకు శిక్షణ ఇచ్చేవారి కోసం నాన్న ఎంతోమంది కోచ్‌లను కలిశారు. కానీ ‘‘అమ్మాయిలకి సుమో రెజ్లింగ్‌ ఏమిటి? మీకు మతిపోయిందా?’’ అంటూ అందరూ తిరస్కరించారు. చివరకు మా నాన్న, అన్నయ్య నాకు కోచ్‌లుగా మారారు. మన దేశంలో ప్రాక్టీస్‌ చెయ్యడానికి సుమో రింగ్‌లు లేవు. దాంతో మామూలు మైదానంలోనే సాధన చేశాను. మరోవైపు వీడియోలు చూస్తూ మెళకువలు నేర్చుకున్నాను. నా చదువు, క్రీడల్లో అభ్యాసం సమాంతరంగా సాగాయి. బి.కామ్‌. పూర్తి చేశాను. సుమో రెజ్లింగ్‌లో నాకు నైపుణ్యం వచ్చిందనుకున్న తరువాత... పోటీలకు వెళ్ళాలనుకున్నాను. కానీ మన దేశంలో నేనే మొదటి మహిళా సుమో రెజ్లర్‌ని. కాబట్టి పోటీల్లో పాల్గొనాలంటే విదేశాల్లోనే సాధ్యం. అదే పెద్ద సమస్యగా మారింది. నన్ను స్పాన్సర్‌ చెయ్యడానికి ఎవరూ లేరు. ఎవరినైనా అడిగినా... కనీసమైన సాయం చెయ్యకపోగా... ఎగతాళిగా, నిరుత్సాహపరిచేలా మాట్లాడేవారు. సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. శారీరకంగా చాలా గాయాలు భరించాను. శిక్షణలో ప్రతిరోజూ ఒక సవాలుగానే గడిచింది. వాటన్నిటికన్నా... నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం లేకపోయిందనే ఆలోచన నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఒక దశలో దాదాపు ఆశ వదిలేసుకున్నాను. ఆ సమయంలో నాన్న, అన్నయ్య ఎంతో కష్టం మీద డబ్బు సమకూర్చారు. 2008లో ఈస్టోనియాలో జరిగిన ‘నేషనల్‌ సుమో ఛాంపియన్‌షిప్‌’ పోటీలో, ఆ తరువాత పోలండ్‌, ఫిన్‌లాండ్‌... ఇలా పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లో నా సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది. 2015లో ‘ఏషియన్‌ సుమో ఛాంపియన్‌ షిప్‌’లో కాంస్యం, 2016లో మనదేశంలోనే జరిగిన ‘నేషనల్‌ సుమో ఛాంపియన్‌ షిప్‌’లో స్వర్ణ పతకం సాధించాను. చైనాలో నిర్వహించిన ‘ఆసియా ఛాంపియన్‌ షిప్స్‌’, చైనీస్‌ తైపీలో జరిగిన ‘వరల్డ్‌ గేమ్స్‌’... ఇలా ఎన్నో ఈవెంట్స్‌లో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాను. విదేశాల్లోని మహిళా సుమో రెజ్లర్లకు గట్టి పోటీ ఇచ్చే భారతీయురాలిగా పేరు వచ్చింది. ప్రపంచ స్థాయిలో అయిదో ర్యాంక్‌లో నిలిచాను.


ఆ తరువాతే చాలామందికి తెలిసింది...

ఇప్పటివరకూ ఇండియాలో, విదేశాల్లో 200కు పైగా పోటీల్లో పాల్గొన్నాను. ఎన్నో పతకాలు గెలిచాను. మన దేశంలో మొదటి ప్రొఫెషనల్‌ మహిళా సుమో రెజ్లర్‌గా ఖ్యాతిని, పలు పురస్కారాలను అందుకున్నాను. కొన్నిసార్లు పురుషులతోనూ పోటీ పడి నా ప్రతిభను నిరూపించుకున్నాను. ‘లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌’లో నా పేరు చోటుచేసుకుంది. కిందటి ఏడాది నా జీవిత కథతో ‘సుమో దీదీ’ అనే సినిమా రూపొందింది. కొత్త దర్శకుడు జయంత్‌ రోహత్గీ ఈ సినిమా గురించి ప్రతిపాదనతో వచ్చినప్పుడు... మొదట్లో సంకోచించినా, నా కథ కొందరికైనా స్ఫూర్తినిస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. ఆ సినిమాలో నా పాత్రను శ్రియమ్‌ భగ్నానీ పోషించారు. 2023 ‘టోక్యో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’, ఈ ఏడాది ‘పామ్‌ స్ర్పింగ్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’, ‘24వ న్యూయార్క్‌ ఇండియన్‌ చలన చిత్రోత్సవం’ తదితర పలు ప్రతిష్టాత్మకమైన చిత్రోత్సవాల్లో ‘సుమోదీదీ’ ప్రదర్శితమయింది. ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి ఆ సినిమా తరువాతే నా గురించి మన దేశంలో చాలామందికి తెలిసిందన్నా అతిశయోక్తి లేదు.

అదే నా తపన...

నన్ను కలిసిన ఎంతోమంది పిల్లలు సుమో రెజ్లర్స్‌ అవుదామనుకుంటున్నామని చెప్పినప్పుడు... ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. సుమో రెజ్లింగ్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యాన్ని పెంచాలి. ఎక్కువమంది అమ్మాయిలు ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకోవాలి. ఇదే నా తపన. అందుకే తీరిక సమయాల్లో ముంబాయిలోని పాఠశాలలకు వెళ్ళి, కుస్తీ, జూడో, సుమో రెజ్లింగ్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. ఇది కేవలం పోటీల్లో పాల్గొనడం, పతకాలను గెలవడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ముఖ్యంగా అమ్మాయిలపై సామాజికమైన నియంత్రణలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ దాటాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి, పట్టుదలతో, అంకిత భావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది. దానికి నేనే ఉదాహరణ.’’

Updated Date - Dec 18 , 2024 | 04:48 AM