నేటి నుంచి మిలాన్-2024
ABN, Publish Date - Feb 19 , 2024 | 04:33 AM
మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి రెండేళ్లకోసారి భారత నౌకాదళం నిర్వహిస్తున్న మిలాన్‌కు సర్వం సిద్ధమైంది.
విశాఖ తీరానికి విదేశీ నౌకలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి రెండేళ్లకోసారి భారత నౌకాదళం నిర్వహిస్తున్న మిలాన్‌కు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా సోమవారం ‘మిలాన్-2024’ ప్రారంభం కానుంది. ఈ నెల 27 వరకు కొనసాగే ఈ విన్యాసాల కోసం 50 దేశాల నుంచి ప్రతినిధులు, 20కి పైగా యుద్ధనౌకలు, విమానాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే విశాఖపట్నం హార్బర్‌కు చేరుకున్నాయి. మిలాన్ తొలి దశ (హార్బర్ పేజ్)లో భాగంగా అన్ని దేశాల నౌకా దళాలు కలసి ఆర్‌కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ నిర్వహిస్తాయి. మిలాన్ పేరుతో ఒక గ్రామాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నారు. రెండో దశ (సీ ఫేజ్)లో వివిధ దేశాల నేవీ దళాలు సముద్రంలో, గగనతలంలో విన్యాసాలు ప్రదర్శిస్తాయి. సబ్‌మెరైన్లపై పోరాటం, ఆకాశంలో లక్ష్యాలను ఛేదించడం వంటివి ఉంటాయి. ఇదిలా ఉండగా, మిలాన్-2024కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది, అతిథులు వచ్చేశారు. ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌లో భాగంగా నేవీ శక్తి సామర్థ్యాలు తెలియజేసే సాహస ప్రదర్శనల కోసం ఆదివారం ఆర్‌కే బీచ్‌లో రిహార్సల్స్ చేశారు. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్‌లో వచ్చి రక్షించడం, శత్రు మూకలపై జెమినీ బోట్లపై దాడి చేయడం వంటి ప్రదర్శనలు చేశారు.
Updated Date - Feb 19 , 2024 | 04:33 AM