ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాహిత్య వికాసానికి సరికొత్త అడుగు

ABN, Publish Date - Feb 12 , 2024 | 01:25 AM

ఆధునిక సమాజం పొందుతున్న జ్ఞానాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు: విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు. విజ్ఞాన శాస్త్రాలలో ప్రకృతి శాస్త్రాలు, జీవశాస్త్రాలు ఉంటాయి. రాజ నీతి శాస్త్రం...

ఆధునిక సమాజం పొందుతున్న జ్ఞానాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు: విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు. విజ్ఞాన శాస్త్రాలలో ప్రకృతి శాస్త్రాలు, జీవశాస్త్రాలు ఉంటాయి. రాజ నీతి శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం మొదలైన అధ్యయనాలను కలిపి సామాజిక శాస్త్రాలు అంటారు. సాహిత్య సంబంధ మైన విషయాలన్నీ మానవీయ శాస్త్రంలోకి వస్తాయి. ఆధునిక కాలం పూర్వార్ధంలో విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి ప్రపంచ గమనాన్ని మార్చింది. విజ్ఞాన శాస్త్రాలకు సమాంతరంగా ఎదిగిన సామాజిక శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాల ఆలంబనతో కుదురుకొని వికసించాయి.

ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉనికిలోకి వచ్చాక శాస్త్రాలన్నీ అధ్యయనాంశాలుగా రూపొందాయి. అకడమిక్‌ పద్ధతులలో, ప్రమాణాలతో సిలబస్‌ను రూపొందించటం, పరిశోధనలు జరిపించటం విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రారంభమయ్యింది. పరిశోధనల ఫలితాలు ఎక్కువ మేరకు పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చేవిగా మారాక, వాటి మీద పెట్టుబడుల శాతం కూడా పెరిగింది. విజ్ఞాన శాస్త్రాల మీద కేటాయించిన బడ్జెట్‌తో పోల్చితే సామాజిక, మానవీయ శాస్త్రాల పరిశోధనకు అనేక పరిమితులు ఏర్పడ్డాయి. మానవీయ శాస్త్రాల మీద జరిగే పరిశోధనలు వ్యక్తుల ఆసక్తుల మీద ఆధారపడి జరిగాయే కానీ వ్యవస్థాగతంగా కాదనే విషయం జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తుంది. విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న ప్రాధాన్యత సామాజిక శాస్త్రాలకు ఉండదు. ఈ రెండింటి పట్ల ఉన్న మోజు మానవీయ శాస్త్రాల విషయంలో ఉండదు.

విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు ఆయా సందర్భాల్లో సమకాలీన పరిస్థితులకు అనువుగా రూపొందుతూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. కానీ మానవీయ శాస్త్రాలకు అనేక పరిమితులు ఏర్పడి, ఆటుపోట్లకు గురయ్యాయి. పరి శ్రమలు అనుసంధానంలో ఉంటూ విజ్ఞాన శాస్త్రాలు కొంత మేరకు నిధులను సమకూర్చుకుంటున్నాయి. దాని కోసం జాతీయంగా సమ్మేళనాలు కూడా జరుపుకుంటున్నారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ లాంటి సందర్భాలు వాటి గమనం, గమ్యం గురించి చర్చించుకోవడానికి దోహదపడు తున్నాయి. సైన్సెస్‌లో ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, చేయవలసిన పరిశోధనాత్మక కృషి మీద చర్చోపచర్చలు చేసి అంతిమ ఫలితాలను రాబట్టడానికి 1914లో మొదలైన సైన్స్‌ కాంగ్రెస్‌ వేదికగా ఉంటుంది. ఈ కోవలోనే సామాజిక శాస్త్రాలలో 1935 నుంచి ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చరిత్రలో జరిగిన, జరగవలసిన పరిశోధనల మీద విస్తృత చర్చలు, ప్రతిపాదనలు, నిర్థారణలు ఈ సమావేశంలో జరుగుతాయి. అదేవిధంగా సోషియాలాజికల్‌ సొసైటి, ఎకనామిక్స్‌ కాంగ్రెస్‌, కామర్స్‌ ఫోరం లాంటి సంస్థలు ఏర్పడి పనిచేస్తున్నాయి.

అయితే మానవీయ శాస్త్రాలలోని సబ్జెక్టులకు ఇలాంటి వేదికల ఏర్పాటు, నిర్వహణ చాలా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతీయ భాషలు కావటం వలన కూడా వీటి విస్తృతికి పరిమితులు ఏర్పడ్డాయి. తెలుగు లాంటి భాషా సాహిత్యాల పట్ల స్థానిక ప్రభుత్వాల వైఖరి కూడా ఉదాసీనంగానే ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యం సమాజ ప్రతిబింబంగా చలనంలో ఉంది. పురాణ, ఇతిహాసాల దశను దాటి కావ్య లక్షణాలను సంతరించుకొని చిక్కటి తెలుగు కవితను చిలకరించింది. మధ్యయుగాలలో సామాజిక అసమానతల మీద, అంధ విశ్వాసాల మీద కవిత్వమై తన అసమ్మతిని, తిరుగుబాటును ప్రకటించింది. ఆధునిక సందర్భంలో మనిషి కేంద్రంగా సాహిత్య సృజన జరుగుతుంది. రాజకీయార్థిక మార్పులకు తక్షణ స్పందనగా చైతన్య దీప్తిని వెలిగిస్తోంది.

గ్లోబలైజేషన్‌ కాలంలో కుదుపుకు గురైన సాహిత్యం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పెనుగులాడుతుంది, చదువుల క్రమం మారిపోయింది. ఫలితంగా తెలుగు భాష విస్మరణకు గురవుతున్నది. మాతృభాషలో పొందే జ్ఞానం మరే ఇతర భాషలలో పొందలేమనే సత్యాన్ని అందరూ విస్మరించారు. వర్తమాన అవసరాలలో ఆంగ్లం అనివార్యం. ఒక భాషగా అందరికి ఆంగ్లం వచ్చి ఉండాలి. కానీ తల్లిభాష పట్ల నిరాదరణ జ్ఞాన సముపార్జనలో అనేక పరిమితులను విధిస్తుంది. ఇప్పుడిప్పుడే విద్యలోకి ప్రవేశిస్తున్న ఉత్పత్తి వర్గాల పిల్లలకు ఏ భాషలోనూ ప్రావీణ్యం ఉండటం లేదు. ఫలితంగా శ్రవణ, భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాలకు కావలసిన సామర్థ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. మరోవైపు తెలుగు అధ్యయనాంశంగా డిగ్రీ పొందిన వారికి ఉపాధి అవకాశాలు శూన్యమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలో భాషా నైపుణ్యాలు అందకపోవటం వలన ఉన్నత విద్యలోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకే తెలుగు అధ్యయనాంశంగా ఉంది. ఇంటర్‌, డిగ్రీలలో ద్వితీయ భాష సంస్కృతానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ స్థాయిలో తెలుగు బోధించే వాళ్లకు ఉపాధి లేదు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు మాతృభాషను శాస్త్రీయ పద్ధతులలో బోధించే మెకానిజం లేకపోవటం వలన భాషానైపుణ్యాలు క్షీణస్థాయిలో ఉంటున్నాయి.

ఈ యాభై ఏళ్లలో సాహిత్య రచనలోకి కొత్త కలాలు ప్రవేశంతో సాహిత్య వస్తువులో, శిల్పంలో మార్పు వచ్చింది. వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా కొత్తగా ఉంటున్నాయి. సృజ నాత్మక సాహిత్యం మట్టి మనుషుల గాలి తగిలి పులకి స్తుంది. మునుపటి సాహిత్య ప్రమాణాలన్ని పూర్వ పక్షం అవుతున్నాయి. కొత్త ప్రమేయాలు సరికొత్తగా ఆవిష్క రించబడుతున్నాయి. కానీ వారి నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి సరైన వేదికలు ఉండటం లేదు. తమ వ్యక్తీకరణలో ఉండే లోపాలను సరిదిద్దే శిక్షణ కొరవడుతున్నది. ఫలితంగా సాహిత్య సృజనలోకి అసాహిత్యం ప్రవేశిస్తుంది.

కన్నడ, తమిళ భాషలను రక్షించుకోవడానికి నిర్మాణాత్మక మైన సంస్థలు ఏర్పడి పనిచేస్తున్నాయి. భాష పట్ల పట్టింపు ఉంటుంది. కానీ తెలుగు భాష గురించి ఆలోచించే మనుషులే కరువైపోతున్న సందర్భం రానున్నది. దేశవ్యాపితంగా తెలుగు మాట్లాడే ప్రజలు పదిహేను కోట్లకు పైగా ఉంటారు. అనేక సంస్థలు తెలుగు సాహిత్య రంగంలో పనిచేస్తున్నాయి. అకాడమీలు కూడా ఉన్నాయి. పాతికకు పైగా వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు సాహిత్యాన్ని బోధిస్తున్నాయి. భాషా పరిరక్షణ కోసం కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు శ్రమిస్తున్నారు. కానీ ఇన్ని పాయలుగా ఉన్న వ్యక్తులకు, సంస్థలకు ఉమ్మడి వేదిక లేదు. ఎవరికి వారుగా విసిరివేసినట్లుగా ఉన్నారు. ఈ అవరోధాలను, పరిమితులను అధిగమించడానికి పూనిక ఉండాలి. దేశ వ్యాపితంగా తెలుగు భాషా సాహిత్యాలలో ఆలోచనాపరులు, సృజనాత్మక రచయితలు, పరిశోధకులు, బోధనా వృత్తిలో ఉన్నవాళ్లు కలిసి అభిప్రాయాలను పంచుకొని అందరికి ఆమోదయోగ్యమైన విషయాల మీద ఆచరణాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఈ నేపథ్యం నుంచి వచ్చిన కొన్ని ఆలోచనల ఫలితంగానే మొదటిసారి తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ జరుగబోతోంది.

దేశవ్యాపితంగా సాహిత్య రంగంలో నిమగ్నమై ఉన్న మూడు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారు. వందమందికి పైగా ఈ సమావేశంలో సాహిత్య రంగంలో లోతుగా పనిచేస్తున్న పరిశోధకులు, అధ్యాపకులు, విమర్శకులు పాల్గొని పత్రసమర్పణ చేస్తారు. మరో యాభై మంది సృజనకారులు ఈ కాంగ్రెస్‌లో సామూహిక కవితా పఠనం, గానం చేస్తారు. ఇన్నిరకాల సాహిత్య వ్యాఖ్యాతలందరూ ఈ వేదిక మీది నుంచి సారవంతమైన ఆలోచనలు పంచుకుంటారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని మదింపు చేయడానికి నిపుణులైన సాహితీ వేత్తలు మూడు రోజులలో వివిధ అంశాల మీద ప్రసంగిస్తారు. తెలుగు లిటరరీ కాంగ్రెస్‌కు విశాల ప్రాతిపదిక, దార్శనిక భావన మూలధాతువుగా ఉంటుంది. మేధో మధనం ద్వారా సాహిత్య ప్రక్రియా వైవిధ్యాన్ని, సృజనాత్మక వికాసాన్ని, మూల్యాంకన పరికరాలను పదును పెట్టుకోవడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్‌ కొనసాగుతుంది. ఇక నుంచి హిస్టరీ కాంగ్రెస్‌, విజ్ఞాన శాస్త్రాలకు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వలె తెలుగు సాహిత్యానికి లిటరరీ కాంగ్రెస్‌ చరిత్రలో నమోదవుతుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వందేళ్ల చరిత్రను నమోదు చేసుకున్నాయి. తెలుగు నేల పునరుజ్జీవనంలో వీటి కృషి విస్మరించలేనిది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సంవాదంలో ఇవి పాలుపంచుకున్నాయి. సామాజిక, సాహిత్య చరిత్ర పురోగమించడానికి ఓయూ, తెలుగుశాఖ తమ జ్ఞానసంపదను జోడించాయి. తెలుగు సాహిత్య బోధన, పరిశోధన, విశ్లేషణ రంగాలలో నూతన ఒరవడిని, కొత్త ప్రమేయాలను సృష్టించిన ఘనత ఓయూ తెలుగుశాఖకు దక్కింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ 15, 16, 17 ఫిబ్రవరి 2024న మూడు రోజుల పాటు జరిగే తెలుగు లిటరరీ కాంగ్రెస్‌కు వేదిక కాబోతుంది. లిటరరీ కాంగ్రెస్‌ ఆలోచనకు, ప్రణాళికకు, ఆచరణకు తెలుగుశాఖ మూలధాతువు. నిర్దిష్టంగా ఈ మూడు రోజులలో కవిత్వతత్వం, కథా సందర్భం, కవితా వసంతం, నవలా సమయం, విమర్శా దర్శనం, సాహిత్య శిల్పం, కవితాపొద్దు, పరిశోధనా విపంచి, సాహిత్య గమ్యం, గమనం, సాహిత్య మూల్యాంకనం పేర్లతో పది విభాగాలుగా లిటరరీ కాంగ్రెస్‌ కొనసాగుతుంది. తెలుగుభాష భవిష్యత్‌ మీద నిర్దుష్ట కార్యక్రమ రూపకల్పన ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.

చింతకింది కాశీం

97014 44450

Updated Date - Feb 12 , 2024 | 01:25 AM

Advertising
Advertising