చిన్న కారు చిన్నబోయే..!
ABN, First Publish Date - 2024-02-11T04:46:05+05:30
గడిచిన కొన్నేళ్లుగా మారుతి ఆల్టో వంటి చిన్న కార్లకు డిమాండ్ భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. రూ.5 లక్షల లోపు విలువైన కార్ల మార్కెట్ వాటా 2015లో 33.6 శాతంగా ఉండగా..
గత ఏడాదిలో 0.3 శాతానికి పడిపోయిన మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: గడిచిన కొన్నేళ్లుగా మారుతి ఆల్టో వంటి చిన్న కార్లకు డిమాండ్ భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. రూ.5 లక్షల లోపు విలువైన కార్ల మార్కెట్ వాటా 2015లో 33.6 శాతంగా ఉండగా.. గత ఏడాదిలో ఏకంగా 0.3 శాతానికి పడిపోయింది. కొనుగోలుదారులు సన్ రూఫ్ వంటి హంగులతో పాటు ఆధునిక సాంకేతికత, భద్రత ఫీచర్లు కలిగిన హై ఎండ్ మోడళ్ల వైపే మొగ్గు చూపుతుండటంతో చిన్న కార్లు ఆదరణ కోల్పోయాయి. వాహన తయారీలో ఉపయోగించే కమోడిటీల ధరలు భారీగా పెరగడంతో పాటు ప్రభుత్వం భద్రత ప్రమాణాలను పెంచడం కూడా ఈ విభాగ కార్ల విక్రయాలకు పరోక్షంగా గండికొట్టాయి. స్మాల్ కార్ సెగ్మెంట్లో ప్రస్తుతం మారుతి సుజుకీ ఆల్టో, రెనో క్విడ్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
65 శాతం పెరిగిన ధరలు
గడిచిన ఐదేళ్లలో రూ.5 లక్షల లోపు విలువైన కార్ల ధరలు ఏకంగా 65 శాతం పెరగగా.. సెడాన్‌లు, ఎస్‌యూవీలు, లగ్జరీ కార్ల రేట్లు మాత్రం 24 శాతం వరకు పెరిగాయి. చిన్న కార్ల ధరలు పెరిగినంత వేగంగా ఆ సెగ్మెంట్ కస్టమర్ల ఆదాయాలు పెరగకపోవ డం కూడా విక్రయాలపై ప్రభావం చూపిందని మార్కెట్ పరిశోధక సంస్థ జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. కార్ల ధరలతో పాటు వాటి నిర్వహణ ఖర్చులు సైతం గణనీయంగా పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు సర్వీస్, మరమ్మతు చార్జీలు, విడిభాగాలు, టైర్ల ధరలు కూడా అనూహ్యంగా పెరగడంతో మధ్యతరగతి వర్గంలో చాలామంది కారు కొనగలిగే స్థోమత ఉన్నప్పటికీ నిర్వహణ వ్యయాలకు భయపడి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆధునిక ఫీచర్లపై ఆసక్తి
కరోనా సంక్షోభం తర్వాత అల్పాదాయ వర్గాల రాబడి మరింత తగ్గడం చిన్న కార్ల డిమాండ్‌పై ప్రభావం చూపిందని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ప్రస్తుత కారు కొనుగోలుదారుల్లో చాలా మంది బేస్ వేరియంట్ల కంటే కనెక్టివిటీ, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్ర్కీన్, ఎస్‌యూవీ డిజైన్, 360 డిగ్రీస్ కెమెరా, సన్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లున్న మోడళ్లనే ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఇందుకోసం అధిక మొత్తంలో చెల్లించేందుకూ వెనుకాడట్లేదన్నారు. దాంతో రూ.10 లక్షలకు పైగా విలువ చేసే కార్ల మార్కెట్ వాటా 2015లో కేవలం 12.5 శాతంగా ఉండగా.. 2023 చివరినాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 46 శాతానికి చేరుకుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్నవి ఈ విభాగ కార్లేనని శ్రీవాస్తవ అన్నారు. అయితే, వాహన తయారీ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కార్ల కంపెనీలు కూడా అధిక లాభాల మార్జిన్లు పంచగలిగే హై ఎండ్ మోడళ్లపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయని రవి భాటియా అన్నారు.
Updated Date - 2024-02-11T04:46:07+05:30 IST