ఇదేం ఉచిత విద్య !?
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:14 AM
‘ఉచితవిద్య అంటూ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు పీకమీద కత్తిపెట్టినట్టుగా తక్షణమే ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడం తగదు.
అమ్మఒడి డబ్బుల నుంచి ఫీజులు కట్టుకోవాలని ప్రభుత్వ సూచన
ముందే చెబితే అడ్మిషన్లు వదులుకునే వారమని తల్లిదండ్రుల ఆగ్రహం
‘ఉచితవిద్య అంటూ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు పీకమీద కత్తిపెట్టినట్టుగా తక్షణమే ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడం తగదు. అమ్మఒడి డబ్బులు అందరికీ ఇచ్చారుకదా. పేదకుటుంబాల పిల్లలకంటూ, విద్యాహక్కు చట్టంకింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచితవిద్యకు అడ్మిషన్లంటూ ఆర్బాటంచేసి ఇప్పుడు ఫీజులు కట్టాల్సివస్తే మాకు అందుబాటులోవున్న స్కూళ్లలోనే పిల్లలను చేర్పించుకునే వాళ్ళం. నిన్న సాయంత్రం చెప్పి ఈరోజే ఫీజు చెల్లించాలంటే వేల రూపాయలు ఎక్కడినుంచి తేగలం ?’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– ఏలూరు ఎడ్యుకేషన్
ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లను పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈవిధంగా అడ్మిషన్ పొందిన ఓ బాలుడి తల్లి గురువారం ఏలూరు డీఈవో కార్యాలయానికి వచ్చి తమ కుమారుడు చదువుతున్న ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం నుంచి ఫీజు చెల్లింపు నిమిత్తం వచ్చిన ఫోన్ కాల్ గురించి కార్యాలయ సిబ్బందికి చెప్పగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకుని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించింది. వాస్తవానికి ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఉచిత అడ్మిషన్లు పొందిన బాలల తల్లిదండ్రులందరూ ఇదేరకమైన విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2022–23 విద్యాసంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం కోటా సీట్లకు ఉచిత అడ్మిషన్లు పొందిన వారిలో పట్టణ ప్రాంత కుటుంబాల వారైతే రూ.8 వేలు, గ్రామీణ ప్రాంత కుటుంబీకులైతే రూ.6500, ఏజెన్సీ కుటుంబాల వారైతే రూ.5100 ఫీజును సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. వాస్తవానికి తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నారేతప్ప విద్యార్థి తల్లిదండ్రులే అమ్మఒడి నగదు సాయంనుంచి చెల్లించాలని ఎక్కడా స్పష్టం చేయలేదు. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టంకింద అడ్మిషన్లు పొందిన వారికి ఉచితంగానే విద్యను అందజేయాలని, ఫీజులను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి భిన్నంగా అమ్మఒడి డబ్బుల నుంచి ఫీజులను చెల్లించుకోవాలని ప్రభుత్వం చేతులెత్తేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వస్తున్నాయి.
జిల్లాలో 83మంది విద్యార్థులు
గ్రామీణర పాంతాల్లో నివసించే బలహీనవర్గాల కుటుంబాల వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణప్రాంతాల వారికైతే రూ.1.40 లక్షలు ప్రాతిపదికన అర్హులను నిర్ణయించారు. పలుమార్లు ప్రకటనలు ఇచ్చిన తర్వాతకూడా ఈ స్కీంకింద ఏలూరు జిల్లాలో తగినన్ని దరఖాస్తులు అందలేదు. చివరకు జిల్లా మొత్తం మీద 44 ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 83 మంది బాలబాలికలు ఒకటో తరగతిలో 2022–23 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గడిచినేడాదికి ఫీజు చెల్లించాలని ఇప్పుడు ప్రభుత్వం హుకుం జారీచేయడాన్ని విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలందరికీ అమ్మఒడి డబ్బులిచ్చి, కేవలం ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టంకింద అడ్మిషన్లు పొందిన వారి నుంచి ఫీజు వసూలు చేయాలని ఆదేశాలు జారీచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నోటిఫికేషన్ సమయంలోనే ప్రస్తావిస్తే తమకు అందుబాటులో వున్న పాఠశాలల్లోనే చేర్చుకునే వారమని చెబుతున్నారు. ఈ ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు అయితే ఇచ్చారు గాని మిగతాఖర్చులైన పుస్తకాలు, వ్యాన్ చార్జీల రూపేణా వేలాది రూపాయలు ఖర్చులు తప్పలేదని వాపోతున్నారు.
ఇప్పటికి ఫీజు చెల్లించింది 31మందే
గత విద్యాసంవత్సరానికి ఉచిత అడ్మిషన్లు పొందిన 83 మంది బాలల తల్లిదండ్రులు సంబందిత ప్రైవేటుస్కూలులో చెల్లించిన ఫీజు రశీదులను ఆయా మండలాల ఎంఈవోలకు అందజేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ వెంటనే ఎంఈవో కార్యాలయాల నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు, అక్కడి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వెళ్లాయి. గురువారం సాయంత్రానికల్లా ఫీజు చెల్లించినట్టుగా రశీదులను తమకు అందజేయాలని, లేనిపక్షంలో స్కూలులో టీసీలు ఇచ్చి పంపేస్తామని బెదిరింపులకు కొన్ని పాఠశాలల యాజమాన్యాలు దిగాయి. ఈ నేపథ్యంలో పలువురు తలిదండ్రులు అకస్మాత్తుగా వేలాది రూపాయలు ఎక్కడినుంచి తీసుకువస్తామని, అసలు ఉచిత విద్య, అడ్మిషన్లంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఫీజులు తమనుంచి వసూలు చేసేటట్టయితే ముందుగానే తెలియజేసి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రానికి జిల్లాలో 31మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుచెల్లింపు రశీదులను అందజేశారు. దీనిపై సమగ్రశిక్ష కార్యాలయ వర్గాలను వివరణ కోరగా ‘అమ్మఒడి నగదు సాయంనుంచి ఫీజును కట్టుకోవాలని ప్రభుత్వం తల్లిదండ్రులకు సూచించింది. ఫీజుల చెల్లింపుపై కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టుని ఆశ్రయించడంతో ప్రభుత్వం ఈవిధంగా స్పష్టతనిచ్చింది. రాగల రెండు, మూడురోజుల్లో సంబంధిత పాఠశాలల్లో ఫీజుని చెల్లించి రశీదులను ఎంఈవో కార్యాలయాల్లో అందజేయాలి.’ అని వివరించాయి.
Updated Date - Mar 01 , 2024 | 12:14 AM