వాకీటాకీలను కాకులు ఎత్తుకెళ్లాయా...?
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:23 AM
గతంలో సిబ్బందికి ఇచ్చిన వాకీటాకీలు ఏమయ్యాయి..? ప్రస్తుతం ఒక్కటి కూడా కనిపించడం లేదు. కాకులు ఏమైనా ఎత్తుకెళ్లాయా...? అని కౌన్సిలర్ వైజీ బాలాజీ అధికారులను ప్రశ్నించారు
అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
ఆదోని టౌన్, మార్చి 7: గతంలో సిబ్బందికి ఇచ్చిన వాకీటాకీలు ఏమయ్యాయి..? ప్రస్తుతం ఒక్కటి కూడా కనిపించడం లేదు. కాకులు ఏమైనా ఎత్తుకెళ్లాయా...? అని కౌన్సిలర్ వైజీ బాలాజీ అధికారులను ప్రశ్నించారు మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ బోయ శాంత అధ్యక్షతన గురువారం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్షలు ఖర్చు చేసి సిబ్బందికి పరిపాలన సౌలభ్యం కోసం వాకీటాకీలను అందించారని, అవి ప్రస్తుతం ఒక్కరి చేతిలో కూడా కనిపించడం లేదని, కనుమరుగు కావడంపై సమాధానం చెప్పాలని కోరారు. వాటి మరమ్మత్తులు, నిర్వాహణ కోసం బడ్జెట్‌లో రూ.15 లక్షలు కేటాయించడం సమంజసం కాదని విమర్శించారు. అవసరానికి పనికి రాకుండా పోయిన వాటి కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడంలో అర్థం లేదన్నారు. కౌన్సిలర్ రఘు మాట్లాడుతూ రోడ్డు మార్కింగ్ (ట్రాఫిక్ గుర్తులు) కోసం రూ.15 లక్షలు మంజూరు చేశారని, గతంలో కూడా రోడ్డు మార్కింగ్ పేరుతో మంజూరు అయిన నిఽధులతో ఎక్కడ ఖర్చు చేశారో తెలియదని పేర్కొన్నారు. కౌన్సిలర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ప్రారంభం అవుతుండటంతో మైనారిటీలకు చెందిన ప్రార్థన స్థలాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రామచంద్ర రెడ్డి కౌన్సిల్ సభ్యులకు తన పరిచయం చేసుకున్నారు. సమావేశంలో ఎంఈ వెంకట చలపతి, ఆర్‌వో అస్లాం, ఏఈ రాజశేఖర్ రెడ్డి, మీటింగ్ క్లర్క్ చంద్రమోహన్, సానిటరి ఇన్‌స్పెక్టర్ హరినాథ్ పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:23 AM