యువత వద్దకు టీడీపీ
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:55 PM
యువ ఓటర్లపై టీడీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ కళాశాలల్లో యువ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో సమావేశమవుతోంది. ఈ ప్రభుత్వం యువతను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో వివరిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసపోతున్న వైనాన్ని ఉదహరిస్తోంది.
యువత వద్దకు టీడీపీ
రాష్ట్రంలో పరిస్థితులపై అవగాహన సదస్సులు
కొత్తగా ఓటు పొందిన విద్యార్థులతో ముఖాముఖీ
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
యువ ఓటర్లపై టీడీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ కళాశాలల్లో యువ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో సమావేశమవుతోంది. ఈ ప్రభుత్వం యువతను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో వివరిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలసపోతున్న వైనాన్ని ఉదహరిస్తోంది. టీడీపీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు యువ ఓటర్లతో జిల్లా నాయకులు ముఖాముఖీ ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే యువతకు, నిరుద్యోగులకు ఏవిధంగా మేలు చేయనుందో వివరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పేరొందిన యువ ప్రొఫెషనల్స్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల ద్వారా ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరంలోని కోచింగ్ సెంటర్లలో వందలాది మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారు. వీరితో పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్న వారిని కూడా ఒక చోటుకు చేర్చి అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరంలో శని, ఆదివారాల్లో కోచింగ్ సెంటర్ల వద్ద ఉన్న నిరుద్యోగ యువతను కలిసి ఓటుపై అవగాహన కల్పించారు. ఈనెల 10న కోట జంక్షన్, శంకరమఠం, గుమ్చిజంక్షన్ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లలో ముఖాముఖీ అయ్యారు. ఎస్.కోటలో శనివారం టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. బొబ్బిలిలోని వివిధ కళాశాలలు.. ఇంజినీరింగ్ విద్యార్థులతో తాజాగా సమావేశమయ్యారు. స్థానిక లోకబంధు రెసిడెన్సీలో తేజస్వి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. టీడీపీ వస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందిస్తారు.. ఐటీ కంపెనీలు ఎలా తీసుకు వస్తారు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారు.. నిరుద్యోగ యువతకు ఉపాధి ఎలా చూపుతారు అనేది స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి గురించి యువ ఓటర్లు ప్రశ్నలు వేశారు. బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన కూడా హాజరయ్యారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో సాయి సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులతో సోమవారం ముఖాముఖీ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ల మొదటి జాబితాలో చోటు దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాసరావు కూడా మాట్లాడారు.
జిల్లాలో కొత్త ఓటర్లు
జిల్లాలో ఈసారి కొత్త ఓటర్లు సుమారు 23,636 వరకు ఉన్నారు. ఈమధ్యే ఓటు హక్కు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. జనవరిలో ప్రకటించిన జాబితాలో మొత్తం ఓటర్లు 15,41,001 మంది ఉండగా పురుషులు 7,60,400... స్త్రీలు 7,80,518... ఇతరులు 83 మంది ఉన్నారు. కొత్త ఓటర్లలో పురుషులు 10,344, స్ర్తీలు 13,311 మంది ఉన్నారు. వేలాదిగా కొత్త ఓటర్లు ఉండటంతో టీడీపీ వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
=================
Updated Date - Mar 11 , 2024 | 11:55 PM