టమాటా ధర ఢమాల్
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:50 AM
టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సుమారు 25 కిలోల టమాటాలు వుండే క్రేట్ రూ.100కు తగ్గిపోయింది. కిలోకు నాలుగు రూపాయలు మాత్రమే చేతికి అందుతాయని, ఈ రేటు అయితే పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు.
25 కిలోల క్రేట్ రూ.100కు పతనం
రైతుకు దక్కేది కిలోకు రూ.4!
పెట్టుబడి కూడా చేతికి దక్కదని ఆవేదన
గొలుగొండ/ కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 29: టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సుమారు 25 కిలోల టమాటాలు వుండే క్రేట్ రూ.100కు తగ్గిపోయింది. కిలోకు నాలుగు రూపాయలు మాత్రమే చేతికి అందుతాయని, ఈ రేటు అయితే పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు.
మండలంలోని జోగంపేట, గొలుగొండ, పాతమల్లంపేట, సాలికమల్లవరం, కొత్తఎల్లవరం, పాలకపాడు, ఏటిగైరంపేట, ఏఎల్‌పురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట, సీహెచ్.నాగాపురం తదితర గ్రామాల్లో రైతులు రబీ పంటగా టమాటా సాగు చేశారు. జనవరి నుంచి వాతావరణం అనుకూలంగా వుండడంతో కాపు బాగా కాసింది. సుమారు మూడు వారాల నుంచి దిగుబడి వస్తున్నది. అప్పట్లో 25 కిలోల క్రేట్ రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలకడంతో రైతులు సంతోషించారు. అయితే అన్ని గ్రామాల్లోని పొలాల్లో టమాటా దిగుబడి పెరగడంతో, వ్యాపారులు తగ్గించేశారు. రాజమండ్రి, విశాఖపట్నం నుంచి వ్యాపారులు పొలాల వద్దకు వచ్చి 25 కిలోల క్రేట్ టమాటాలు రూ.100కు కొనుగోలు చేస్తున్నారు. వారం క్రితం క్రేట్ రూ.200 వుందని, ఇంతలోనే సగానికి ఎలా తగ్గిస్తారని రైతులు ప్రశ్నించగా, ఇతర ప్రాంతాల్లో కూడా టమాటా పంట చేతికి వస్తుండడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా కృష్ణాదేవిపేట చుట్టుపక్కల వున్న గొలుగొండ, కొయ్యూరు మండలాల్లోని పలు గ్రామాల రైతులు టమాటాలను కృష్ణాదేవిపేట మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. నాణ్యతనుబట్టి క్రేట్ టమాటాలు రూ.100 నుంచి రూ.150 ధర పలికాయి. అయినప్పటికీ కొనుగోలుదారుల కోసం మధ్యాహ్నం వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. కాగా తమ వద్ద కిలో రూ.4కు కొనుగోలు చేస్తున్నారని, ఇవే టమాటాలు రిటైల్‌గా కిలో రూ.15 నుంచి రూ.20కి అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. ఎకరా టమాటా సాగుకు రూ.30 వేల వరకు పెట్టుబడి అతుందని, దిగుబడి ఎనిమిది నుంచి పది టన్నులు వస్తుందని రైతులు చెబుతున్నారు. 25 కిలోలు రూ.100కు అమ్మితే పెట్టుబడి కూడా చేతికి రాదని వాపోతున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:50 AM