చింతపండు రైతు దిగాలు
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:35 AM
మండలంలో కోనాం సంతకు వచ్చిన ఏజెన్సీ చింతపండుకి ఆశించిన ధర లభించక గిరిజన రైతులు దిగాలు చెందారు. మండలంలోని కోనాం పంచాయతీతో పాటు హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన పలు ఏజెన్సీ గిరిజన గ్రామాల నుంచి గురువారం కోనాం సంతకు చింతపండు తీసుకువచ్చారు.
కోనాం సంతలో లభించని గిట్టుబాటు ధర
కిలో రూ.30 నుంచి రూ.35లకు విక్రయం
చీడికాడ, ఫిబ్రవరి 29: మండలంలో కోనాం సంతకు వచ్చిన ఏజెన్సీ చింతపండుకి ఆశించిన ధర లభించక గిరిజన రైతులు దిగాలు చెందారు. మండలంలోని కోనాం పంచాయతీతో పాటు హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన పలు ఏజెన్సీ గిరిజన గ్రామాల నుంచి గురువారం కోనాం సంతకు చింతపండు తీసుకువచ్చారు. ఏజెన్సీ గ్రామాల్లో తుప్పలు, డొంకల నుంచి నడుచుకుంటూ వేకువజామున బయలుదేరి ఉదయం 9 గంటలకు కోనాం చేరుకున్నారు. గత వారం చింతపండుకి కిలో రూ.65లు నుంచి రూ.70ల వరకు ధర పలకడంతో ఈ వారం కూడా ఎక్కువ ధర వస్తుందని ఆశించిన గిరిజనులు ఎక్కువ చింతపండును తీసుకువచ్చారు. అయితే ఈ వారం ధర రూ.30ల నుంచి రూ.35లు పలకడంతో గిరిజన రైతులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ గురువారం జిల్లాలో పలు శుభకార్యాలు ఉండడంతో వ్యాపారులు కూడా ఎక్కువ మంది రాకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసిన గిరిజనులు కొంతమంది కోనాంలో వారి బంధువుల ఇంటి వద్ద చింతపండు నిల్వ చేయగా, మరికొంతమంది గిరిజనులు వ్యాపారులు అడిగిన ధరకు అమ్మి నిత్యావసర ధరలు కొనుగోలు చేసుకొని నిరాశతో స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
Updated Date - Mar 01 , 2024 | 12:35 AM