అలల తాకిడికి ఫ్లోటింగ్ బ్రిడ్జి తలకిందులు
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:28 AM
ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిపై అధికారులు మొండి పట్టుదలకు పోతున్నారు.
మళ్లీ ఊడిన ‘టి జంక్షన్ వ్యూ పాయింట్’
అక్కడే కొనసాగించాలని అధికారుల మొండి పట్టుదల!
పర్యాటకులకు ఏమైనా అయితే బాధ్యత ఎవరిది?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిపై అధికారులు మొండి పట్టుదలకు పోతున్నారు. బలమైన కెరటాల ధాటికి ఆ వంతెనకు అమర్చిన ‘టి జంక్షన్ వ్యూ పాయింట్’ ప్రతి రోజూ తలకిందులు అవుతోంది. బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోతోంది.
ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ దానిపైకి ఎవరినైనా అనుమతించాలంటేనే ఈతగాళ్లే భయపడుతున్నారు. ముంబై నుంచి వచ్చిన నిపుణుల బృందం కూడా సరైన సూచనలు చేయలేకపోయింది. శనివారం ఉదయం మరోసారి అలల వంతెన తిరగబడడంతో ఆ ప్రాంతం అంతా కల్లోలంగా మారిపోయింది. అలలు వచ్చినప్పుడు ‘టి జంక్షన్ వ్యూ పాయింట్’ బాగా పైకి ఎగిసిపడుతోంది. ఆ సమయంలో పొరపాటున అక్కడ ఎవరైనా ఉంటే ప్రమాదమే. ఆర్‌కే బీచ్‌లో ఎక్కడికక్కడే పదునైన బండరాళ్లు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఈ ప్రాజెక్టును పెట్టి, దానిని ఎలాగోలా నడపాలని చూడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తప్పును సవరించుకుని సురక్షితమైన మరోచోట పెట్టుకోవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇంకొక దగ్గరకు మార్చాలంటే అనుమతులు అవసరమవుతాయని, దానికి జాప్యం జరుగుతుందని ఆలోచన చేస్తున్నారు.
ఆర్కే బీచ్ వద్ద సముద్రం ప్రశాంతంగా ఉండడం చాలా అరుదు. అలలు తీరాన్ని ఢీకొడుతూనే ఉంటాయి. అక్కడే ఫ్లోటింగ్ బ్రిడ్జిని కొనసాగించాలనే ప్రయత్నం కంటే..సురక్షితమైన ప్రాంతంలో నిర్వహించడం ఎంతో మేలు. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యాటకులకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. ఇవీమీ అధికారులకు అర్థం కావడం లేదు.
Updated Date - Mar 03 , 2024 | 01:28 AM