వైసీపీ కార్పొరేటర్ భర్త దందా
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:35 AM
ఆయన ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త. పదేళ్ల కిందట నక్కవానిపాలెంలోని ఏడుగుళ్లు వెనుక కొంత స్థలాన్ని ఇద్దరి నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకుని అపార్టుమెంట్ నిర్మాణం ప్రారంభించారు.
అపార్టుమెంట్‌కు ఏడు గుళ్లు స్థలంలో రాత్రికి రాత్రి సీసీ రోడ్డు నిర్మాణం
ఆ రోడ్డును ప్రధాన రహదారికి అనుసంధానించేందుకు జీవీఎంసీ నిర్మించిన ఫుట్‌పాత్ ధ్వంసం
స్థానికులు అడ్డుకున్నా మొండిగా పనులు పూర్త్తి
సీసీ రోడ్డు బయటకు కనిపించకుండా అడ్డంగా ఫ్లెక్సీలు, బైక్‌లు
చోద్యం చూస్తున్న జీవీఎంసీ అధికారులు
ఫిర్యాదులు అందడంతో కోర్టులో వివాదం ఉన్నందున పనులు చేయొద్దంటూ
బిల్డర్‌కు చెప్పి చేతులు దులుపుకున్న వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆయన ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త. పదేళ్ల కిందట నక్కవానిపాలెంలోని ఏడుగుళ్లు వెనుక కొంత స్థలాన్ని ఇద్దరి నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకుని అపార్టుమెంట్ నిర్మాణం ప్రారంభించారు. అయితే అపార్టుమెంట్‌కు చూపించిన రహదారిపై ఏడుగుళ్లు ఆలయ కమిటీకి, నక్కవానిపాలెం గ్రామస్థులకు, అపార్టుమెంట్ స్థల యజమానులకు వివాదం తలెత్తడంతో కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో అపార్టుమెంట్ నిర్మాణం పదేళ్ల కిందటే నిలిచిపోయింది. ఆయన తాజాగా తన భార్య అధికారాన్ని అడ్డంపెట్టుకుని వివాదాస్పద స్థలంలో రాత్రికి రాత్రే సీసీ రోడ్డు నిర్మించేశారు. ఆ రోడ్డును ప్రధాన రహదారికి అనుసంధానించేందుకు జీవీఎంసీ నిర్మించిన ఫుట్‌పాత్‌ను ధ్వంసం చేయించి ర్యాంప్ నిర్మాణం చేపట్టారు.
సత్యం కూడలి నుంచి సీతమ్మధార వెళ్లే రోడ్డులో నక్కవానిపాలెం ఏడు గుళ్లు ఉంది. దాదాపు 800 గజాల స్థలంలో ఆలయం ఉంది. ఆలయం వెనుక ఇద్దరు అన్నదమ్ములకు కొంత స్థలం ఉంది. ఆ స్థలాన్ని 2008లో ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్న అప్పారి శ్రీవిద్య భర్త గిరిబాబు అపార్టుమెంట్ నిర్మాణం కోసం తీసుకున్నారు. ఆ స్థలానికి ఉత్తరం వైపు మూడు అడుగులు రహదారి మాత్రమే ఉంది. ఆ రోడ్డును చూపిస్తే అపార్టుమెంట్ నిర్మాణానికి జీవీఎంసీ అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. దీంతో డెవలప్‌మెంట్‌కు ఇచ్చిన స్థలానికి తూర్పు వైపు గల ఏడుగుళ్లు స్థలాన్ని 30 అడుగులు రోడ్డుగా చూపించి 2014లో అపార్టుమెంట్‌కు ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్ జారీకాగానే భవన నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టారు. ఐదు శ్లాబ్‌లు నిర్మించి, ఇటుక పనులు కూడా దాదాపుగా పూర్తవుతున్న సమయంలో ఏడుగుళ్లు స్థలంపైనక్కవానిపాలెం గ్రామస్థులకు, ఆలయ కమిటీ సభ్యులకు వివాదం తలెత్తడంతో కోర్టులో కేసులు వేసుకున్నారు. ఈ కేసులు ఇంకా కొలిక్కిరాకపోవడంతో అపార్టుమెంట్ నిర్మాణం నిలిచిపోయింది. ఇదిలావుండగా మూడు రోజుల కిందట రాత్రివేళ హఠాత్తుగా బిల్డర్ అయిన కార్పొరేటర్ భర్త అప్పారి గిరిబాబు ఏడుగుళ్లు స్థలంలో నుంచి అపార్టుమెంట్‌కు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. విషయం తెలియగానే నక్కవానిపాలెం గ్రామస్థులు అక్కడకు చేరుకుని గొడవకు దిగారు. అయినప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారు. దీనిపై గ్రామస్థులు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుకు, స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డికి ఫిర్యాదు చేయగా...వారంతా వెళ్లి కోర్టులో కేసు ఉన్నందున పనులు చేపట్టవద్దని బిల్డర్‌ను ఆదేశించి వెళ్లిపోయారు. మరుసటిరోజు రాత్రి మళ్లీ బిల్డర్ అక్కడకు చేరుకుని తాను అపార్టుమెంట్ కోసం నిర్మించిన సీసీ రోడ్డును నక్కవానిపాలెం ప్రధాన రహదారికి అనుసంధానించేందుకు వీలుగా జీవీఎంసీ నిర్మించిన ఫుట్‌పాత్‌ను ధ్వంసం చేసి, వాహనాలు సులభంగా అపార్టుమెంట్‌వైపు వెళ్లేందుకు వీలుగా ర్యాంపులను నిర్మించారు. దీంతో గ్రామస్థులు మరోసారి అక్కడకు చేరుకుని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడకు చేరుకుని కోర్టులో వివాదం కొలిక్కి వచ్చేంత వరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పి...అక్కడి నుంచి వెనుతిరిగిపోయారు. ఫుట్‌పాత్‌ను ధ్వంసం చేయడంతోపాటు మెయిన్‌రోడ్డుపై కాంక్రీట్ వేసి ర్యాంప్ నిర్మించారనే కారణంతో క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉన్నప్పటికీ బిల్డర్ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త కావడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు మౌనం దాల్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావడంతో బిల్డర్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై బిల్డర్, వైసీపీ కార్పొరేటర్ భర్త అప్పారి గిరిబాబు వివరణ కోరగా, ఏడుగుళ్లు ఆనుకుని ఉత్తరం వైపు నుంచి 30 అడుగులు రోడ్డు ఉన్నందున అది చూపించి జీవీఎంసీ నుంచి 2014లో అపార్టుమెంట్ నిర్మాణానికి ప్లాన్ పొందామన్నారు. దీనిపై గ్రామస్థులతోపాటు మరికొందరు కోర్టులో కేసులు వేసినప్పటికీ తామే గెలిచామన్నారు. తాజాగా రోడ్డు నిర్మించడంతో కొంతమంది తాగుబోతులు కావాలనే గొడవకు దిగుతున్నారన్నారు. కోర్టులో కేసులు గెలిచినప్పుడు అపార్టుమెంట్ నిర్మాణం ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించగా, తనకు డెవలప్‌మెంట్‌కు స్థలం ఇచ్చిన వారు ఎక్కువ ఫ్లాట్‌లు కావాలని డిమాండ్ చేశారని, దీనివల్ల గొడవ వచ్చి నిర్మాణం ఆగిందన్నారు. సీసీ రోడ్డు నిర్మాణంపై ఎలాంటి వివాదం లేకపోతే బయటకు కనిపించకుండా ఫ్లెక్సీలు, పాతవాహనాలను అడ్డంగా ఎందుకు పెట్టారని ప్రశ్నించగా...రాత్రిపూట గంజాయి బ్యాచ్‌లు, మందుతాగేవారు అపార్టుమెంట్ వైపు వెళ్లకుండా పెట్టామని సమాధానం చెప్పడం గమనార్హం.
Updated Date - Mar 03 , 2024 | 01:35 AM