సీఎం వచ్చారు... వెళ్లారు!
ABN, Publish Date - Mar 08 , 2024 | 01:08 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం చేపట్టిన జిల్లా పర్యటన ‘వచ్చారు.. వెళ్లారు..’ అన్న చందంగా సాగింది. అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద వైఎస్‌ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదల కోసం ఏర్పాటు చేసిన సభను రాజకీయ వేదిగా మార్చేశారు. జిల్లాలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల్లో ఒక్కదానిని కూడా సీఎం ప్రస్తావించలేదు. అదే విధంగా గత సాధారణ ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తలేదు.
జగన్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు
వైసీపీ సభగా మారిన చేయూత నిధులు విడుదల కార్యక్రమం
జిల్లాలో ప్రధాన సమస్యలు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల ఊసేలేదు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం చేపట్టిన జిల్లా పర్యటన ‘వచ్చారు.. వెళ్లారు..’ అన్న చందంగా సాగింది. అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద వైఎస్‌ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదల కోసం ఏర్పాటు చేసిన సభను రాజకీయ వేదిగా మార్చేశారు. జిల్లాలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల్లో ఒక్కదానిని కూడా సీఎం ప్రస్తావించలేదు. అదే విధంగా గత సాధారణ ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తలేదు. పైగా అమర్ (మంత్రి), భరత్ (వైసీపీ అనకాపల్లి సమన్వయకర్త) తనకు ఇద్దరూ తమ్ముళ్లేనని, ఎన్నికల్లో భరత్ విజయానికి పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అమర్‌ను తన గుండెల్లో పెట్టుకుంటానని, భవిష్యత్తులో మంచి చేస్తానన్నారు. చేయూత నిధులు విడుదల కోసం ప్రజాధనం ఖర్చుచేసి ఏర్పాటు చేసిన సభను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార వేదికగా మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హామీల ఊసెత్తని సీఎం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జిల్లాలో పాదయాత్ర చేశారు... ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని, మిగిలిన మూడు షుగర్ ఫ్యాక్టరీలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కానీ జగన్ సీఎం అయిన తరువాత తమ్మపాల షుగర్స్ ఆధునికీకరణను అటకెక్కించారు. పైగా ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలను మూసివేయించారు. దీంతో వేలాదిమంది చెరకు రైతులు, ఫ్యాక్టరీల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ ప్రధాన కాలువతోపాటు జిల్లాలో మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఆనకట్టలు, గ్రోయిన్ల అభివృద్ధి/ నిర్వహణ పనులకు ఒక్క ఏడాది కూడా నిధులు కేటాయించలేదు. సీఎం తన ప్రసంగంలో ఎక్కడా ఈ విషయాలను ప్రస్తావించలేదు. అయినప్పటికీ మరోసారి ఓట్లేసి గెలిపించాలని ప్రజలను కోరడం ఆయనకే చెల్లిందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి అయిన గుడివాడ అమర్‌నాథ్... అనకాపల్లి నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు. అయితే మూతపడిన తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీల గురించి మాత్రం నోరు విప్పలేదు. పరవాడ ఫార్మాసిటీలో ఔషధ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ రసాయనాలు సముద్రంలోకి వదులుతుండడం వల్ల మత్స్యసంపద నాశనం అవుతోంది. సమీపంలోని గ్రామాల్లో వున్న చెరువుల్లో వ్యర్థ రసాయనాలు కలవడం వల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అచ్యుతాపుం ఎస్‌ఈజడ్, పరవాడ ఫార్మా ఎస్‌ఈజడ్, హెటెరో, డోక్కన్ కెమికల్స్, తదితర పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన విషయాన్ని సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనలు ఇంతవరకు ప్రారంభించలేదు. కాగా జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అధ్యక్షతన జరిగిన ఈ సభలో. డిప్యూటీ సీఎంలు బూడి ముత్యానాయుడు, పీడిక రాజన్నదొర, విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 01:08 AM