నిన్నటిదాకా నరకంలో పడేసి... ఎన్నికల వేళ రెవెన్యూ డే
ABN, Publish Date - Mar 05 , 2024 | 03:54 AM
స్వాతంత్య్రం రాకముందు 1786, జూన్ 20వ తేదీన బోర్డు ఆఫ్ రెవెన్యూను బ్రిటిష్ పాలకులు ఏర్పాటుచేశారు.
సంఘం అలా లేఖ రాయగానే ఇలా ఓకే
ఎన్నికల్లో రెవెన్యూ సేవలపై జగన్ కన్ను
మచ్చిక చేసుకునేందుకు వారిపై ‘డే’లం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
స్వాతంత్య్రం రాకముందు 1786, జూన్ 20వ తేదీన బోర్డు ఆఫ్ రెవెన్యూను బ్రిటిష్ పాలకులు ఏర్పాటుచేశారు. ఆ రోజును అనధికారికంగా రెవెన్యూడేగా పిలుస్తున్నారు. 238 సంవత్సరాల తర్వాత అంటే...2024లో సరిగ్గా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్‌కు ఈ విషయం గుర్తుకొచ్చింది. అంతే....హడావుడిగా రెవెన్యూ సంఘం ఆదివారం లేఖ రాయడం, ఆ మరుసటి రోజే జగన్ ప్రభుత్వం ఆమోదించేయడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఇదే రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెవెన్యూ డే సందర్భంగా మండలాలు, జిల్లాల స్థాయిలో సభలు, సమావేశాలు జరిపి.. ప్రతిభ కలిగిన రెవెన్యూ ఉద్యోగులను, సర్వీసులో ఉత్తమ సేవలు అందించిన రిటైర్డు సిబ్బందిని గుర్తించి వారికి సత్కారాలు, సన్మానాలు చేస్తారు.
ఇదీ వ్యూహం!
తనకు ప్రయోజనం లేద నుకుంటే జగన్ ఏదీ చేయరని ఆయన పాలనే చెబుతున్న వాస్తవం. ఎన్నికల విధుల్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించేది రెవెన్యూ ఉద్యోగులే. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి నుంచి పర్యవేక్షకులు, చివరకు బూత్ లెవల్ వరకు వారే ఉంటారు. ్ఞఅందువల్లే గడిచిన నాలుగున్నరేళ్లుగా వారితో నరకం స్పెల్లింగ్ రాయించి, ఇప్పుడు ఒక్కసారిగా ‘రెవెన్యూడే’ అంటూ హడావుడి మొదలుపెట్టారు. ఇది జగన్ మాత్రమే చేయగల దమ్మున్న మేలని ఇదే రెవెన్యూ సంఘం నేత బొప్పరాజు, మరి కొందరితో మహా అద్భుతమైన భజన కూడా చేయించుకున్నారు.
తిట్టారు.. కొట్టారు.. తొక్కేశారు..
గత నాలుగున్నరేళ్ల కాలంలో రెవెన్యూ ఉద్యోగులు అష్టకష్టాలుపడ్డారు. విజిలెన్స్, ఏసీబీలతో దాడులు చేయించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు ఏ శాఖ ఉద్యోగి అయినా క్షమించాల్సిన పనిలేదు. కానీ, తాము చెప్పిన అడ్డగోలు పనులు చేయడం లేదనో, అడ్డగోలుగా భూమి రికార్డులు మార్చడం లేదనో కారణంగా వైసీపీ నేతలు రెవెన్యూ ఉద్యోగులను రాచిరంపాన పెట్టారు. ఉద్దేశపూర్వకంగా కొందరిని ఏసీబీకి పట్టించారు. మరికొందరిపై విజిలెన్స్ విచారణలు చేయించారు. అయినా రెవెన్యూ వారు దారికి రావడం లేదని వైసీపీ నేతలే అనేక చోట్ల ఉద్యోగులు, అధికారులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. భూముల సర్వే సందర్భంగా అడ్డగోలు తప్పులు చేయాలన్న పెద్దల మాటలు వినలేక, తప్పులు చేయలేక అనేక మంది సర్వేయర్లు ఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణించారు. కలెక్టర్, డీఆర్‌వో, ఇతర అధికారులు రెవెన్యూ ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టిన ఉదంతాలు అనేకం వెలుగుచూశాయి. వీటిపై రెవెన్యూ ఉద్యోగ సంఘం ఏనాడూ స్పందించలేదు. బాధిత ఉద్యోగులకు న్యాయం దక్కేలా గట్టిగా పోరాటాలు చేస్తే సర్కారు పెద్దలు కన్నెర్ర చేస్తారేమోనని భయపడి సంఘం నేతలు మిన్నుకుండిపోయారు. రెవెన్యూ ఉద్యోగులకు సర్వీసు పరీక్షలు, పదోన్నతుల, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంది లేదు. కొత్తగా నియమితులైన వీఆర్‌వో, సర్వేయర్‌ల ప్రొబేషన్ డిక్లరేషన్, వారి పరీక్షల విషయంలో అనేక సమస్యలున్నా ప్రభుత్వ పెద్దలు పరిష్కారమార్గాలు అన్వేషించలేదు. ఈ విషయంలో సంఘ నేత బొప్పరాజు ఏం చేశారని ఉద్యోగులే ప్రశ్నించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
సరిగ్గా ఎన్నికల వేళ..
మరికొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల విధుల్లో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించబోతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం జగన్ తీరుపై గుర్రుగా ఉంది. ఈ నేపఽథ్యంలో రెవెన్యూ డే ప్రకటనతో రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకోవాలన్నది పెద్దల ఆలోచన. అందుకే బొప్పరాజు నాయకత్వంలోని సంఘంతో ఈ నెల 3వ తేదీన ప్రభుత్వానికి లేఖపెట్టించారు. 4వ తేదీన ఆప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ సీఎస్‌తో ఉత్తర్వులు ఇప్పించారు.
గత నాలుగున్నరేళ్లలో రెవెన్యూ ఉద్యోగులను జగన్ సర్కారు రాసిరంపాన పెట్టింది. నరకం అనే మాటకు స్పెల్లింగ్‌ను వారితో రాయించింది. మాట వినని సిబ్బందిపై ఇటు విజిలెన్స్, ఏసీబీ దాడులు, అటు వైసీపీ నేతల భౌతిక దాడులతో అల్లాడించారు. ఇన్నాళ్లలో వీలు చిక్కినప్పుడల్లా తొక్కేశారేగానీ, పిలిచి చిన్న ప్రోత్సాహకం ఇచ్చిన పాపాన కూడా పోలేదు. అలాంటిది.. ఎన్నికల వేళ రెవెన్యూ ఉద్యోగులపై ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చింది. పోలింగ్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించేది వీరే కావడంతో.. వారికి ఒక ‘డే’ ఉన్నట్టు హఠాత్తుగా గుర్తించి.. అంతే అనూహ్యంగా జీవో తెచ్చారు.
ఏటా జూన్ 20న రెవెన్యూ డే
ప్రభుత్వ ప్రకటనపై అసోసియేషన్ హర్షం
విజయవాడ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా ప్రకటించిందని అసోసియేషన్ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రమేశ్‌కుమార్ తెలిపారు. రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏ స్థాయి నుంచి కలెక్టర్ వరకు 24 గంటలూ ప్రజాసేవలోనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సంబంధిత బాధ్యతలు, విద్యార్థులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాల జారీ, మెజిస్టీరియల్ బాధ్యతలు, ప్రకృతి వైపరీత్యాల్లో పౌరులకు సరైన రక్షణ, వసతి కల్పించడం, ఓటరు నమోదు కార్యక్రమం, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు, వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ బాధ్యతలను రెవెన్యూ శాఖ సమర్థంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం రెవెన్యూ డే ఉపయోగపడుతుందన్నారు.
Updated Date - Mar 05 , 2024 | 08:41 AM