ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:56 PM
కొత్తగా ఓటు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్
కలెక్టరేట్, మార్చి 4: కొత్తగా ఓటు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ ఎం.నవీన్‌తో కలిసి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, ఎన్నికలు, ఆరోగ్యశ్రీ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, వేసవి నీటి ఎద్దడికి పరిష్కార మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 30 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న మార్పులు, చేర్పులు సవరణల కోసం వచ్చిన 4,334 ఓటర్ల దరఖాస్తుల పరిశీలన తక్షణమే పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌లో సాంకేతిక సమస్యలు లేవని, రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాకు 5,71,691 ఆరోగ్యశ్రీ కార్డులు రాగా 95 శాతం కార్డుల పంపిణీ జరిగిందని, మిగిలినవి రెండు రోజుల్లో లబ్దిదారులకు అందజేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, జలజీవన్ మిషన్ పనులు పూర్తిచేయాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రూ.38కోట్లు ఖర్చు చేశారని, ఇంకా రూ.23కోట్లు రానున్న పది రోజుల్లో వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి
జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పూర్తి చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ సూచించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సహాయక పోలింగ్ కేంద్రాలు, స్థానాల మార్పులు, కొత్తపేర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, నేతలతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లావ్యాప్తంగా 2,357 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పాతపట్నంలో అదనంగా ఒక సహాయ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆమదాలవలస నియోజకవర్గంలో రెండు పాత కేంద్రాలను కొత్త చోటుకు మార్పు చేశాం. ఇవి మినహా జిల్లాలో ఎటువంటి మార్పులు లేవ’ని స్పష్టం చేశారు.
115 కేంద్రాల పేర్లు మార్పు
‘పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, అప్‌గ్రేడ్ కారణంగా జిల్లాలో 115 కేంద్రాల పేర్లు మాత్రమే మార్చాం. అవి ఉండే స్థానాలను మాత్రం మార్చలేదు. అత్యధికంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 42 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చాం. శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవు. నరసన్నపేటలో 25, ఆమదాలవలసలో 22, పాతపట్నంలో 11, టెక్కలిలో 8, ఎచ్చెర్లలో 7 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చామ’ని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్, డీఆర్వో ఎం.గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీవో హెచ్.రంగయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు పీఎంజే బాబు, కింరాపు ప్రసాద్(టీడీపీ), రౌతు శంకరరావు(వైసీపీ), మాధవరావు, మల్లిబాబు(కాంగ్రెస్) బి.ఉమామహేశ్వర్రావు(బీజేపీ), డి గోవిందరావు(సీపీఎం) పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:56 PM