ఉప లోకాయుక్తగా రజనీరెడ్డి
ABN, Publish Date - Feb 20 , 2024 | 05:28 AM
ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్తగా పగిడి రజనీరెడ్డి నియమితులయ్యారు. సెలెక్షన్ కమిటీ సూచనల మేరకు గవర్నర్ ఆమోదంతో ఆమెను ఉప లోకాయుక్తగా
అర్హతల సడలింపుతో లభించిన అవకాశం
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్తగా పగిడి రజనీరెడ్డి నియమితులయ్యారు. సెలెక్షన్ కమిటీ సూచనల మేరకు గవర్నర్ ఆమోదంతో ఆమెను ఉప లోకాయుక్తగా నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. రజనీరెడ్డి హైకోర్టులో దేవదాయ శాఖ కేసులను వాదిస్తున్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త నియామకానికి గతంలో ఒక విధానం ఉండేది. హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జస్టి్‌సగా పనిచేసి రిటైరైన వారిని లోకాయుక్తగా, జిల్లా జడ్జిగా పనిచేసి రిటైరైన వారిని ఉప లోకాయుక్తగా నియమించే వారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సిఫారసు మేరకు... గవర్నర్ ఆమోదంతో నియామకం జరిగేది. ఈ పద్ధతిని జగన్ సర్కారు మార్చేసింది. హైకోర్టు సీజే ప్రమేయాన్ని తప్పించి... ముఖ్యమంత్రి, స్పీకర్, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతతో సెలెక్షన్ కమిటీని నియమించారు. ‘25 ఏళ్ల అనుభవమున్న న్యాయవాదిని కూడా ఉప లోకాయుక్తగా నియమించవచ్చు’ అంటూ కొత్త అర్హతలను నిర్దేశించారు. ఈ పోస్టు కోసం పలువురు రిటైర్డ్ జిల్లా జడ్జిలు, ఆ అర్హతతో ఇప్పటికే పలు హోదాల్లో పని చేసిన వారు, సీనియర్ న్యాయవాదులు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే... సెలెక్షన్ కమిటీ పి.రజనీ రెడ్డిని ఎంపిక చేసింది. ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఈ కమిటీ సమావేశానికి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు.
Updated Date - Feb 20 , 2024 | 08:37 AM