మహీధరరెడ్డిని కలిశారు.. మద్దిశెట్టి, సుధాకర్‌బాబులను వదిలేశారు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:03 AM
అధికార వైసీపీ అధిష్ఠానం అనుసరిస్తున్న వ్యవహారశైలి ఆ పార్టీశ్రేణుల్లోనే తీవ్రమైన అనుమానాలు, అసంతృప్తికి కారణమవుతోంది. టికెట్ లేదు, పార్టీ పదవి లేదు పొండి అంటూ బయటకు పంపిన నేతల్లో కొందరి ఇళ్లకు అగ్ర నేతలు క్యూకొట్టడం, కొందరి గురించి పట్టించుకోకపోవటం అందుకు కారణమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలకు వారి స్థానాల్లోనే గాక వేరేచోట కూడా పోటీకి అవకాశం ఇవ్వకుండా జగన్ పక్కనబెట్టారు. అందులో ఒకరైన కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డిని కలిసేందుకు శనివారం అరడజను మందికిపైగా ముఖ్యనాయకులు ఆయన ఇంటికెళ్లారు. కానీ దర్శి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు వేణుగోపాల్, సుధాకర్‌బాబులను కనీసంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీరిలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టినైతే మీరు దర్శిలో పార్టీకి సహకరించాలని అడిగిన నాథుడే లేరు.
చెవిరెడ్డి పోకడపైనా అసంతృప్తులు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
అధికార వైసీపీ అధిష్ఠానం అనుసరిస్తున్న వ్యవహారశైలి ఆ పార్టీశ్రేణుల్లోనే తీవ్రమైన అనుమానాలు, అసంతృప్తికి కారణమవుతోంది. టికెట్ లేదు, పార్టీ పదవి లేదు పొండి అంటూ బయటకు పంపిన నేతల్లో కొందరి ఇళ్లకు అగ్ర నేతలు క్యూకొట్టడం, కొందరి గురించి పట్టించుకోకపోవటం అందుకు కారణమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలకు వారి స్థానాల్లోనే గాక వేరేచోట కూడా పోటీకి అవకాశం ఇవ్వకుండా జగన్ పక్కనబెట్టారు. అందులో ఒకరైన కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డిని కలిసేందుకు శనివారం అరడజను మందికిపైగా ముఖ్యనాయకులు ఆయన ఇంటికెళ్లారు. కానీ దర్శి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు వేణుగోపాల్, సుధాకర్‌బాబులను కనీసంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీరిలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టినైతే మీరు దర్శిలో పార్టీకి సహకరించాలని అడిగిన నాథుడే లేరు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వేరే స్థానాల్లో పోటీకి అవకాశం ఇచ్చిన జగన్ దర్శి, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు ఎమ్మెల్యేలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. వారి స్థానాలతోపాటు ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచార కార్యక్రమంలోకి రంగంలోకి వచ్చారు. పైగా 10వ తేదీ మేదరమెట్ల సమీపంలో సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా జరపాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగా శనివారం సిద్ధం సభ నిర్వహణపై ఒంగోలులో సమావేశం పెట్టిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనంతరం మాచవరం వెళ్లి ఎమ్మెల్యే మహీధరరెడ్డిని కలిశారు. ఆయన ఒక్కడే కాకుండా నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్న గోవర్థనరెడ్డిని, నెల్లూరు ఎంపీ ఆదాలని, మధుసూదన్ యాదవ్, ఎంపీ బీద తదితరులను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. మహీధరరెడ్డితో కాసేపు ఏకాంతంగాను తర్వాత అందరి సమక్షంలోను సాయిరెడ్డి మాట్లాడారు. పార్టీకోసం పనిచేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ వీరు తొలుత చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అభ్యర్థుల్లో చేర్పులు, మార్పులు ఉండొచ్చు కదా అని కూడా ఆయనతో అన్నట్లు తెలిసింది. నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీచేయబోతున్నందున ఆయన కొద్దిసేపు ప్రత్యేకంగా కూడా మహీధరరెడ్డితో మాట్లాడారు. తన మనసులోని బాధను మహీధరరెడ్డి సూటిగానే వ్యక్తం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, తన కుటుంబ అనుబంధాన్ని విస్మరించటాన్ని ఏ రకంగా చూడాలని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై మహీధరరెడ్డి చిక్కడు దొరకడు అన్న చందంగానే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.
కనిపించని ఆ ఇద్దరు
ఇదే సమయంలో జిల్లాలోని దర్శి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలను నాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. సిద్ధం సభ నేపథ్యంలో వారితో కూడా మాట్లాడాలన్న ఆలోచన కూడా చేసిన దాఖలాలు లేవు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన అనుచరులైతే ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోటీ చేయబోతున్న అభ్యర్థికానీ రాష్ట్ర నాయకులు కానీ మద్దిశెట్టిని దర్శి వెళ్లి పార్టీకోసం పనిచేయమని కోరిన దాఖలాలు లేవు. సిద్ధం సభ కోసమైనా ఆయన్ను పిలిచి మాట్లాడాలన్న ఆలోచన కూడా చేసినట్లు కనిపించలేదు. అదే సమయంలో తనను తప్పించినా రాష్ట్ర పార్టీకి టచ్‌లోనే ఉన్న ఎమ్మెల్యే సుధాకర్‌బాబును కూడా పట్టించుకోకపోవటం విశేషం. ఆరంభంలో మంత్రి నాగార్జున సుధాకర్‌బాబుకు ఫోన్ చేయటం ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పటం జరిగింది. నియోజకవర్గంలో ఇంతవరకు మంత్రి నాగార్జునతో పాటు ఒక్క కార్యక్రమంలోను పాల్గొనలేదు. చివరికి శనివారం విజయసాయిరెడ్డితో సహా ఇంతమంది నాయకులు వచ్చినా కార్యక్రమంలో ఆయన కనిపించలేదు. ఈ సమావేశానికి ఆయన్ను, మద్దిశెట్టిని పిలిచిన దాఖలాలు కూడా లేవు. శనివారం ఒంగోలు వచ్చిన నాయకులు అల్లంత దూరంలో ఉన్న మహీధరరెడ్డి ఇంటికి క్యూ కట్టారే కానీ వీరిద్దరినీ కనీసం సంతృప్తి కోసమైనా కలిసే ప్రయత్నం జరగలేదు. అలాగే ఇప్పటివరకు పర్చూరు ఇన్‌చార్జిగా ఉండి ప్రస్తుతం ఆ పదవి నుంచి తొలగించబడి అసంతృప్తితో ఉన్న ఆమంచిని కూడా అధిష్ఠానం పట్టించుకోలేదు. మిగతా వారిని వదిలేసి కేవలం ఒక సామాజికవర్గం నాయకుని కోసమే అధిష్ఠానం పనిచేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
చెవిరెడ్డి పోకడపైనా అనుమానాలు
ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా జగన్ నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహారశైలిపై కూడా ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ద్వితీయశ్రేణి నాయకత్వం అనుమానాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీగా పోటీచేస్తున్న చెవిరెడ్డి ఎమ్యెల్యే అభ్యర్థుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప పార్టీలోని ఇతర నాయకులను పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి ప్రారంభమైంది. అదే సమయంలో టికెట్ లభించని ఎమ్మెల్యేలు మద్దిశెట్టి, సుధాకర్‌బాబుల మద్ధతు పొందేందుకు కూడా ఆయన పెద్దగా ప్రయత్నించలేదని తెలుస్తోంది. మహీధర్‌రెడ్డి వద్దకు అంతమంది నాయకులు క్యూ కడితే ఇక్కడ పోటీలో ఉన్న చెవిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని తప్ప ఎవరికీ కన్నెత్తిచూడకపోవటం చర్చగా మారింది. ఇటీవల ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమై మీకు రాష్ట్రపార్టీ ఇచ్చే సహకారానికి అతీతంగా తనవంతు ఆర్థిక తోడ్పాటునిస్తానని చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా కొంతమొత్తాన్ని ముందస్తుగా కూడా వారికి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన విజయవాడ నుంచి రావటం పోవటం వస్తేగిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుకోవటం తప్ప బలమైన ఇతర నాయకుల వైపు కూడా కన్నెత్తి చూడలేదు. దీంతో భవిష్యత్తులో కూడా చెవిరెడ్డి పంథా ఇలానే ఉంటుందని తమకెలాంటి గుర్తింపు ఉండదని కిందిస్థాయి నాయకులు అభిప్రాయపడుతుండటం విశేషం.
Updated Date - Mar 03 , 2024 | 12:03 AM