ప్రాధాన్యమేదీ..?
ABN, Publish Date - Mar 10 , 2024 | 12:58 AM
రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మినుముతీత పనులు జరుగుతుండగా, వాటితో పాటే కుప్పనూర్పిళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై అధికారులు పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మరోవైపు ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండు నెలలుగా బిల్లులను చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తుండటంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో ధాన్యం బకాయిలు రూ.290 కోట్లకు పైనే..
సంక్రాంతి తరువాత నుంచి బిల్లులు చెల్లించని ప్రభుత్వం
తాజాగా కుప్పనూర్పిళ్లు వేగవంతం
పూర్తిస్థాయిలో ధాన్యం కొంటారో లేదోనని రైతుల్లో సందిగ్ధం
ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్న దైన్యం
రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తారా లేక నిలిపివేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మినుముతీత పనులు జరుగుతుండగా, వాటితో పాటే కుప్పనూర్పిళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై అధికారులు పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మరోవైపు ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండు నెలలుగా బిల్లులను చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తుండటంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు 4.90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో 1.40 లక్షల టన్నులకు పైగా ధాన్యం బిల్లులను రెండు నెలలుగా చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రబీ సీజన్‌లో రెండో పైరుగా సాగుచేసిన మినుముతీత పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే ఈ నెలాఖరులోపు కుప్పనూర్పిడి పనులను రైతులు పూర్తిచేస్తారు. కీలకమైన ఈ సమయంలో ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది.
ఆఫ్‌లైన్‌లో విక్రయించిన ధాన్యం ఊసెత్తని అధికారులు
జిల్లాలో డిసెంబరు, జనవరిలో 45 వేల టన్నుల ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో కొన్నారు. ఈ ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసి బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినట్లుగా లెక్కల్లోకి రాని ఈ ధాన్యం బిల్లులను ఎలా చెల్లిస్తారనే అంశంపై రైతుల్లో గందరగోళం నెలకొంది. గత ఏడాది ఆఫ్‌లైన్‌లో విక్రయుంచిన ధాన్యానికి బిల్లులు చెల్లించకుండా మూడు నెలలకు పైగా జాప్యం చేశారు. రైతులు పదేపదే కలెక్టరేట్ చుట్టూ తిరిగి, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తే అధికారులు మిల్లర్లతో మాట్లాడి బస్తాకు రూ.1,350 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిర్చారు. మిల్లర్లు మరింత ఆలస్యం చేసి నగదును అతికష్టం మీద రైతులకు అందజేశారు. ఈ ఏడాది ఆఫ్‌లైన్‌లో విక్రయించిన ధాన్యం బిల్లులను ఏ రూపంలో, ఎంత ధర నిర్ణయించి చెల్లింపులు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ధాన్యం కొనుగోలుపై అనుమానాలెన్నో..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 10.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటివరకు 4.90 లక్షల టన్నులే కొన్నారు. ప్రస్తుతం కుప్పనూర్పిళ్లు జరుగుతుండగా, మరో వారంలో మరింత వేగవంతమవుతాయి. జిల్లాలో ఇంకా 2 లక్షల టన్నులకుపైగా ధాన్యం ప్రభుత్వం కొనాల్సి ఉంది. ఇప్పటికే తహసీల్దార్లు, ధాన్యం కొనుగోలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. మరో వారంలో ఎన్నికల నోటిఫికే షన్ విడుదలైతే అధికారులంతా ఆ విఽధుల్లో నిమగ్నమవుతారు. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే అంశంలో అనేక ఇబ్బందులు ఎదురవడం ఖాయం. జిల్లాలో 301 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మలివిడతగా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతూనే, 50 వేల టన్నులకు మించి కొనేది లేదని, ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించుకోవాలని రైతులకు చెప్పకనే చెబుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి..
ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవ డంతో రైతులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వ్యాపా రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాకు రూ.1,634 వరకు రావాల్సి ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం నాణ్యతతో సంబంధం లేకుండా బస్తాకు రూ.1,500 నుంచి 1,530 వరకు ధర చెల్లిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ , మండపేట, చిత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన ధాన్యం వ్యాపారులు జిల్లాకు వచ్చి, స్థానికంగా ఉన్న మధ్యవర్తుల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొంటున్నారు. బస్తాకు రూ.100 మద్దతు ధర తక్కువగా వచ్చినా రైతులు ప్రైవేట్ వ్యాపారుల నుంచి నగదుకు సంబంధించి హామీ తీసుకుని ధాన్యం విక్రయించేస్తున్నారు. కుప్పనూర్పిడి చేసిన ధాన్యంలో తేమశాతం, ఇతర త్రాలకు సంబంధించిన ఇబ్బందులు పెద్దగా ఉండవు. దీంతో పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు వచ్చే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తేనే పూర్తిస్థాయి మద్దతు ధర లభించే అవకాశముంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మిన్నకుండిపోతోంది. రైతుల వద్ద ప్రస్తుతం ఉన్న రెండు లక్షల టన్నులకు పైగా ధాన్యం విక్రయిస్తే, మద్దతు ధర రూపంలో రూ.2 కోట్లకు పైగా రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు జిల్లా నుంచి ధాన్యం కొని తీసుకుపోతుండటంతో జిల్లాలోని 170 మిల్లులకు ధాన్యం రాని స్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా నుంచి 4వేల లారీల ధాన్యం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కొని తీసుకెళ్లిపోతున్నారు.
వారంలో ధాన్యం బిల్లులు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాం. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయులు మరో వారంలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొంటాం.
తోట సతీష్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
Updated Date - Mar 10 , 2024 | 12:58 AM