స్థలాల తంత్రం
ABN, Publish Date - Mar 05 , 2024 | 01:18 AM
జనాలను కొట్టుకు తినడం.. ఆ సొమ్ములో కొంతభాగం తాయిలాలుగా పంచడం... సర్కారీ స్థలాలను కబ్జా చేయడం.. చేయగా మిగిలిన స్థలాలను ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పప్పులు బెల్లాల మాదిరి పంచేయడం... విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు తీరిది. ప్రజల కోసం జేబు నుంచి పైసా డబ్బు తీయని వైసీపీ నాయకులు ప్రజల సొమ్మునే సొంత సొమ్ము మాదిరి పంపకాలు మాత్రం జోరుగా చేస్తున్నారు.
సెంట్రల్‌లో ఎమ్మెల్యే వెలంపల్లి పంపకాలు
ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలు ధారాదత్తం
నిన్న బుడమేరు కట్టపై మందిరానికి 300 గజాలు
నేడు ముత్యాలంపాడులో కల్యాణమండపానికి 500 గజాలు
మాయమవుతున్న ఇరిగేషన్ స్థలాలు
జనాలను కొట్టుకు తినడం.. ఆ సొమ్ములో కొంతభాగం తాయిలాలుగా పంచడం... సర్కారీ స్థలాలను కబ్జా చేయడం.. చేయగా మిగిలిన స్థలాలను ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పప్పులు బెల్లాల మాదిరి పంచేయడం... విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు తీరిది. ప్రజల కోసం జేబు నుంచి పైసా డబ్బు తీయని వైసీపీ నాయకులు ప్రజల సొమ్మునే సొంత సొమ్ము మాదిరి పంపకాలు మాత్రం జోరుగా చేస్తున్నారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి/సత్యనారాయణపురం) : సెంట్రల్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు సుమారు రూ.2 కోట్ల విలువైన 500 గజాల నీటిపారుదల శాఖ స్థలాన్ని వెలంపల్లి ధారాదత్తం చేసేశారు. ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన నీటిపారుదల శాఖ భూములను కులాలవారీగా పంచుతూ పోతుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముత్యాలంపాడు జీఎస్‌రాజు రోడ్డు సత్యసాయిబాబా మందిరం పక్కన ఇరిగేషన్ స్థలం ఉంది. దానిలో కొంతభాగం రజకులకు దోబీఖానా నిర్మించారు. మిగిలిన 500 గజాల్లో రజకులు కల్యాణమండపం కట్టుకుంటామని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇరిగేషన్ స్థలం కావడంతో ఇంతకాలం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.
రజకులకు కాకుండా..
ఎన్నికలు సమీపిస్తుండంతో వైసీపీ నాయకులు బరితెగించారు. ఇదే సమయంలో అనుమతి ఇస్తే.. ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఉండదని, అదేమని ప్రశ్నిస్తే బీసీల ఓట్లు వారికి పడకుండా ఉంటాయని పక్కా ప్లాన్ వేశారు. రజకులకు కాకుండా బీసీల కోసం అక్కడ కల్యాణమండపం కట్టేందుకు అనధికార అనుమతి ఇచ్చారు. దీంతో కాల్వ ఒడ్డున స్థలం చదును చేసి, పిల్లర్లు వేసి కల్యాణమండపం నిర్మాణ పనులు చకాచకా చేస్తున్నారు. ఇరిగేషన్ స్థలంలో చిన్న పాక వేసినా వాలిపోయి తొలగించే అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అటువైపు చూడలేదు. వెలంపల్లి అనధికార ఆదేశాల కారణంగానే వారు అటువైపు రావడం లేదని సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వస్తున్న తరుణంలో సుమారు రూ.2 కోట్ల విలువైన భూమిని ఇలా అన్యాక్రాంతం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జీఎస్ రాజు రోడ్డులో రెండున్నర కోట్ల రూపాయల విలువైన భూమిని బ్రాహ్మణులకు, రెండు కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్యవైశ్యులకు దారాదత్తం చేసిన విషయం తెలిసిందే. ఇవికూడా ఇరిగేషన్ భూములే. అంతకుముందు అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో పైపుల రోడ్డు నుంచి నందమూరి నగర్‌కు వెళ్లే దారిలో బుడమేరు కట్టపై సుమారు 300 గజాలను ఓ మందిరం నిర్మాణం కోసం కట్టబెట్టారు.
Updated Date - Mar 05 , 2024 | 01:18 AM