ఎపిక్ టెన్షన్
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:27 AM
ఓటరు కార్డుల కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. ప్రింటింగ్‌లో నెలకొన్న జాప్యం కారణంగా, ఓటర్లకు ఎపిక్ కార్డులను పూర్తిగా పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ సమస్య నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎపిక్ కార్డుల కోసం ఓటర్ల నుంచి బీఎల్వోలపై ఒత్తిడి ప్రారంభమైంది.
ఇంకా 1,86,784 ఓటరు కార్డులు రావాలి
నోటిఫికేషన్ దగ్గర పడటంతో బీఎల్వోలపై ఒత్తిడి
పూర్తిస్థాయిలో ముద్రణ కాకపోవటంతోనే సమస్య
విజయవాడ నగరంలోనే పెండింగ్ ఎక్కువ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఓటరు కార్డుల కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. ప్రింటింగ్‌లో నెలకొన్న జాప్యం కారణంగా, ఓటర్లకు ఎపిక్ కార్డులను పూర్తిగా పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ సమస్య నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎపిక్ కార్డుల కోసం ఓటర్ల నుంచి బీఎల్వోలపై ఒత్తిడి ప్రారంభమైంది. కొత్తగా ఎపిక్ కార్డుల జారీకి సంబంధించి చూస్తే.. ఇంకా 4,00,516 ఎపిక్ కార్డుల ముద్రణ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు చూస్తే 3,97,166 ఎపిక్ కార్డులే జనరేట్ చేశారు. వీటిలో 2,14,616 కార్డులను ప్రింటింగ్ కోసం పంపారు. ఈ కార్డుల వరకు ముద్రణ పూర్తయింది. ఇంకా 1,86,784 కార్డులు ముద్రణ కాలేదు. ఈ కార్డులన్నీ ముద్రణ అయితే కానీ, పూర్తిస్థాయిలో నూతన ఎపిక్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాదు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 25,526 ఎపిక్ కార్డులే ప్రింటింగ్ అయ్యాయి. విజయవాడ పశ్చిమకు సంబంధించి 31,114 ఎపిక్ కార్డులు, విజయవాడ సెంట్రల్‌కు 33,047, విజయవాడ తూర్పుకు 57,372, మైలవరంకు 21,547, నందిగామకు 22,705, జగ్గయ్యపేటకు 23,335 ఎపిక్ కార్డులు మాత్రమే ముద్రితమయ్యాయి. పెండింగ్ ఎపిక్ కార్డుల విషయానికొస్తే తిరువూరులో 8,539 కార్డులు ఇంకా ప్రింటింగ్ కాలేదు.
విజయవాడ పశ్చిమలో 50,199, విజయవాడ సెంట్రల్‌లో 54,144, విజయవాడ తూర్పులో 21,499, మైలవరంలో 37,499, నందిగామలో 7,234, జగ్గయ్యపేటలో 7,790 ఎపిక్ కార్డులు ఇంకా ముద్రితం కావాల్సి ఉంది. మరో పక్షం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇంకా ఎపిక్ కార్డుల ముద్రణ జరగకపోవటంలో ఎన్నికల అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఓటర్ల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆన్‌లైన్‌లో చాలా వరకు ఓటరు కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని స్మార్ట్ కార్డులపై ప్రింటింగ్ చేయించుకుంటున్నారు. కొంతమంది హాలోగ్రామ్‌తో కూడిన ఎపిక్ కార్డుల కోసమే ఎదురుచూస్తున్నారు. ఇవి పాస్‌పోర్టు పొందటానికి దోహదపడుతుండటంతో చాలామంది హాలోగ్రామ్‌తో కూడిన కార్డుల కోసమే ఎదురుచూస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 01:27 AM