జగన్‌కు విశాఖ గుర్తొచ్చింది!
ABN, Publish Date - Mar 03 , 2024 | 03:30 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్లకు విశాఖపై ‘విజన్’ గుర్తుకొచ్చింది. అంతేకాదు...
5,7 తేదీల్లో విశాఖ నగరానికి సీఎం
‘వైజాగ్ విజన్.. ఫ్యూచర్ విశాఖ’ సమావేశం
7న రుషికొండ ప్యాలె్‌సలో కేబినెట్!?
విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్లకు విశాఖపై ‘విజన్’ గుర్తుకొచ్చింది. అంతేకాదు... ఎన్నికల ముందు ‘పరిపాలనా రాజధాని’లో ఏదో ఒకటి చేశాం అనిపించుకునేందుకు విశాఖపట్నంలో మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జగన్ ఈనెల 5, 7 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ‘వైజాగ్ విజన్... ఫ్యూచర్ విశాఖ’ పేరుతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ఇప్పటిదాకా ఏం చేశారో, ఇకపై ఏం చేయనున్నారో జగన్ చెబుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శనివారం తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వారందరినీ ఈ సమావేశానికి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వస్తారన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వివిధ రంగాల్లో ఉపాధి పొందిన యువతతో పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం జగన్ ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి శనివారం విశాఖపట్నం వచ్చారు.
7న విశాఖలో కేబినెట్ భేటీ?
విశాఖపట్నంలో ఈ నెల 7న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముచ్చటపడి సాగర తీరాన రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించుకున్న భవనంలోనే ఈ భేటీ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ భవనాన్ని రెండు రోజుల క్రితం శారదా పీఠాధిపతితో పూజలు చేయించి పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ నెల 5న జగన్ విశాఖ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రుషికొండ బీచ్‌లో నిర్మించిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. ఆ క్రమంలోనే కొత్త ‘ప్యాలె్‌స’ను పరిశీలిస్తారని తెలుస్తోంది. 7వ తేదీన మళ్లీ విశాఖకు వచ్చి... రుషికొండ ప్యాలె్‌సలో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Updated Date - Mar 03 , 2024 | 03:30 AM