శివరాత్రి ఉత్సవాల్లో అధికారుల అత్యుత్సాహం
ABN, Publish Date - Mar 08 , 2024 | 01:42 AM
శివరాత్రి ఉత్సవాల్లో అధికారుల అత్యుత్సాహం
ఆహ్వాన పత్రికల్లో సీఎం జగన్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు
ఇదేం ప్రచారమంటూ భక్తుల మండిపాటు
పిఠాపురం, మార్చి7: పిఠాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన పాదగయ క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవదాయశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ ఉత్సవాలకు ము ద్రించిన ఆహ్వాన పత్రికల్లో దేవుడి ఫోటోలతోపాటు ముఖ్యమంత్రి జగన్, దేవదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుల ఫొటోలను ప్రచురించారు. గతంలో ఆహ్వానపత్రికపై పేర్లు, కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి ఫోటోలు మినహా వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఫోటోలు ముద్రించే సంప్రదాయం లేదు. అయితే ఈసారి ఆహ్వానపత్రికల్లో సీఎం, మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలను ముద్రించడం విస్మయాన్ని కలిగించింది. అధికార వైసీపీ పాలకుల ప్రాపకం కోసమే దేవదాయశాఖ అధికారులు ఇలా చేశారంటూ భక్తులు మండిపడుతున్నారు. దేవుడి కార్యక్రమాలో ఇదేమి ప్రచారమంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఆహ్వానపత్రికల ఫొటోలను తీసి సోషల్ మీడియాలో
పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.
Updated Date - Mar 08 , 2024 | 01:42 AM