రాయ ‘బేరాలు’
ABN, Publish Date - Mar 08 , 2024 | 01:34 AM
రాయ ‘బేరాలు’
ముద్రగడతో వైసీపీ నేతల మంతనాలు
తనయుడికి త్వరలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి
ఎన్నికల తర్వాత కుదిరితే ముద్రగడకు రాజ్యసభ పదవి ఆఫర్
పిఠాపురం సీటుపై పట్టుబట్టినా నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం
టీడీపీ, జనసేన తలుపులు మూసేయడంతో వైసీపీలోకి ఓకే
ఈనెల 14-17వ తేదీల మధ్య జగన్ సమక్షంలో కండువా
ఇటీవల వైసీపీ తనను అవమానించడంపై ముద్రగడ గుర్రు
ఇప్పుడు తిరిగి మళ్లీ అదే పార్టీలోకి వెళ్లేందుకు రెడీ
అటు పిఠాపురం నుంచి బరిలో కొనసాగనున్న వంగా గీత
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కాపు ఉద్యమ నేత ముద్రగడతో వైసీపీ బేరాలు కొలిక్కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్ని కలు దగ్గరపడ్డ నేపథ్యంలో రాజకీయంగా ఎంతోకొంత ఉపయోగపడతారనే కోణంలో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. వైసీపీ తీరుపై ముద్ర గడ తీవ్ర ఆగ్రహంతో ఇటీవల ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ తర్వాత టీడీపీ, జనసే నలో చేరడానికి ప్రయత్నించారు. కానీ రెండు పార్టీల నుంచీ తలుపులు మూసుకుపో వడంతో తిరిగి మళ్లీ ఫ్యాను కిందకే వెళ్లడానికి దాదాపు నిర్ణయించారు. ఈమేరకు పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చా ర్జులు గురువారం కిర్లంపూడిలో ముద్రగడతో నిర్వహించిన భేటీలో రాయబేరాలు ఫ లించాయి. బయటకు భేషరతుగా వైసీపీలోకి చేరడానికి ముద్రగడ అంగీకరించారని చెబుతున్నా ఇరువర్గాల మధ్య కొన్నిరోజులుగా పలు కీలక అంశాలపై మాటలు జరి గాయి. అందులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ సీటుపై ముద్రగడ కుటుంబానికి ఆసక్తి ఉండడంతో అక్కడి నుంచి పవన్‌పై ముద్రగడను బరిలోకి దించితే బాగుం టుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇటీవల జగన్ వద్ద ప్రతిపాదించారు. కానీ జగన్ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. పిఠాపురం బదులు ముద్రగడ తనయుడికి జగ్గంపేట సీటు ఇవ్వడానికి కొంతవరకు అంగీకారం తెలిపారు. కానీ ఈ ప్రతిపాదనపై ముద్రగడ సుముఖత చూపలేదు. ఈనేపథ్యంలో మళ్లీ ద్వారంపూడి, ముద్రగడ మధ్య చర్చలు జరగ్గా, భవిష్యత్తులో రాజ్యసభ సీటు ఇవ్వడానికి పార్టీ అంగీకరించిన విషయాన్ని ముద్రగడకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ప్రచారం కూడా చేయాలని ముద్రగడ ఎదుట ప్రతిపాదించారు. అయితే పిఠాపురం సీటు ఇచ్చే పరిస్థితి లేదని తేలినా మరో మార్గం లేక వైసీపీలో చేరడానికి కొన్ని రోజుల కిందట ముద్రగడ సూచనప్రాయ అంగీకారం తెలిపారు. ఈనేపథ్యంలో ముద్రగడ పచ్చ జెండా ఊపడంతో గురువారం మిథున్‌రెడ్డిసహా ఎమ్మెల్యేలు, ఎంపీ గీతా ఆయన నివాసానికి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఫోన్లలో జరిగిన సం భాషణలు, పార్టీ అధిష్ఠానం చెప్పిన విషయాలపై ముద్రగడతో వీరంతా చర్చలు జరిపారు. అయితే పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ముద్రగడ పేరును తాము ప్రతిపాదించినా అధిష్ఠానం సు ముఖత వ్యక్తం చేయని నేతలు ముద్రగడతో చర్చించారు. ఈ క్రమంలో టికెట్ బదులు ముద్రగడ తనయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అంశంపై ఒకరిద్దరు నేతలు ప్రస్తావించినట్టు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈపదవితో పెద్దగా ఉపయోగం లేదని తెలిసినా కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొద్దిరోజులైనా చేసిన హోదా ఉం టుందని ముద్రగడ ఎదుట వీరంతా ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఇవ్వడానికి పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్టు నేతలు ముద్రగడకు వివరించారు. వీటన్నింటికి అంగీకరించిన ముద్రగడ ఈనెల 14-17వ తేదీల మధ్య ఆ పార్టీలో చేరడానికి అంగీకరించినట్టు తెలిసింది. ఆరోజు తాడేపల్లిలో జగన్ చేతుల మీదుగా పార్టీలో చేరనున్నట్టు వైసీపీ నాయకులు పేర్కొ న్నారు. ఈ విషయం అటు అధికారికంగా వైసీపీ ఇటు ముద్రగడ వర్గం ఇంకా ధ్రువీకరించలేదు. మరోపక్క పిఠాపురం నుంచి వంగా గీతను మార్చుతారని ప్రచారం జరిగినా తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె అక్కడే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అప్పుడు దూరం పెట్టి.. ఇప్పుడు దగ్గరై..
అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్లకు వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. అయినా జగన్ ప్రభుత్వాన్ని ముద్రగడ ఏనాడు ప్రశ్నించలేదు. సరికదా తిరిగి ప్రతిపక్షాలపైనే లేఖాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో వైసీపీ అనుకూల నేతగా ముద్రగడ ముద్రపడ్డారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అందులోభాగంగా ముద్రగడ లేదా ఆయన తనయుడికి వైసీపీ పిఠాపురం సీటు ఇస్తుందని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడి అయితే కాకినాడ ఎంపీ టికెట్‌ను ముద్రగడ తనయుడికి ఇప్పించడానికి ప్రయత్నించారు. కానీ డిసెంబరులో టికెట్ల ప్రకటనలో భాగంగా వైసీపీ అధిష్ఠానం పిఠాపురం సీటును ఎంపీ వంగా గీతకు కట్టబెట్టింది. దీంతో ముద్రగడ అలిగారు. కారాలుమిరియాలు నూరారు. అలాగే రాజ్యసభ టికెట్ విషయంలోను వైసీపీ మాట తప్పడంపై తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశా రు. ఇదికాకుండా కొన్ని తాను ఆశించిన విషయాల్లోను వైసీపీ పెద్దలు గౌరవప్రదంగా వ్యవహరించకపోవడంతో విసిగిపోయారు. ఆ తర్వాత ముద్రగడ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటు నుంచి కూడా స్పందన లేదు. అదే సమయంలో విషయం తెలిసి ముద్రగడను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. కానీ వైసీపీ నేతలతో మాట్లాడడానికి ముద్రగడ ఇష్టపడలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు తాము జనసేనలోకి వెళ్తామని ముద్రగడ తనయుడు ప్రకటించారు. అదే సమయంలో కొందరు జనసేన నేతలు కూడా ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. సంక్రాంతి తర్వాత స్వయంగా పవన్ ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత జనసేన పార్టీ కూడా తలుపులు మూసేసింది. ఈ నేపథ్యంలో ముద్రగడ అకస్మాత్తుగా పవన్‌ను విమర్శిస్తూ ఇటీవల లేఖాస్త్రం సంధించారు. తనను కలుస్తానని చెప్పి కలవలేదని పవన్‌ను దుమ్మె త్తిపోశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనలో కూడా ముద్రగడకు దారులు మూసుకుపోయినట్టు అర్థమైపోయింది. దీంతో ముద్రగడకు వైసీపీ మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. అటు వైసీ పీకి సైతం గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేనను ఢీకొట్టే నేత లేకపో వడంతో మళ్లీ ముద్రగడ వైపు మనసు మళ్లించింది. ముద్రగడ సైతం తనకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో దూరం పెట్టిన వైసీపీ వైపే మళ్లీ దృష్టిపెట్టారు. ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేకపోవడంతో వైసీపీలో చేరడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత వైసీపీని ఛీకొట్టి మళ్లీ అదే ఫ్యాన్ కిందకు వస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Mar 08 , 2024 | 01:35 AM