శ్రీశైలంలో విజయనగరం రాజులకాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం
ABN, Publish Date - Feb 04 , 2024 | 02:46 AM
శ్రీశైలం క్షేత్రంలో ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనులు సందర్భంగా విజయనగరం రాజుల కాలం నాటి తామ్ర శాసనాలు శనివారం లభ్యమయ్యాయి.
నంద్యాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనులు సందర్భంగా విజయనగరం రాజుల కాలం నాటి తామ్ర శాసనాలు శనివారం లభ్యమయ్యాయి. ఈ శాసనాలు విజయనగర రాజు సంగమ వంశానికి చెందిన మూడో విరూపాక్షుడి కాలానికి చెందిన శక సంవత్సరం 1395లో విజయ సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం 13వ తిథిన అంటే ప్రస్తుతం అనుసరిస్తున్న కేలండర్ ప్రకారం 1473వ సంవత్సరం మార్చి 12 శుక్రవారం నాడు రాయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనాలు సంస్కృత, కన్నడ, నాగరి లిపిలో ఉన్నాయి. వీటి ప్రకారం మూడో విరూపాక్షుడు శ్రీశైల మల్లికార్జున స్వామి రథోత్సవాల సందర్భంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అప్పటి కోపాణ సీమ యాదపురంలోని మంగళపురం, యలబర్గసీమలోని తిప్పరసోపల్లి, వేదవతి గ్రామాలను దానంగా రాయించి, అప్పటి భిక్షవృత్తి మఠాధిపతి సిద్ధయ్యదేవుడికి అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆత్రేయ గోత్ర, యజు శాఖకు చెందిన వల్లభ, దుర్గయ, విరాణ బ్రాహ్మణులకు 20 వరహాలను బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
Updated Date - Feb 04 , 2024 | 02:46 AM