వైసీపీలో వర్గపోరు తారస్థాయికి
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:30 AM
వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది.ఓ వర్గం చేపట్టే అక్రమ గ్రావెల్ తవ్వకాలను మరో వర్గం అడ్డుకున్న క్రమంలో ఇరు వర్గాలూ దళితుల ద్వారా ఫిర్యాదులు చేయించాయి.
- పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు
- ముఖ్య నేతలు సహా 8మందిపై అట్రాసిటీ కేసుల నమోదు
- నిందితుల్లో డీసీసీబీ ఛైర్మన్, ఎంపీపీ, సర్పంచ్ తదితరులు
పెళ్లకూరు, మార్చి 2: వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది.ఓ వర్గం చేపట్టే అక్రమ గ్రావెల్ తవ్వకాలను మరో వర్గం అడ్డుకున్న క్రమంలో ఇరు వర్గాలూ దళితుల ద్వారా ఫిర్యాదులు చేయించాయి. రాజీ కుదిర్చేందుకు పార్టీ అగ్ర నేతలు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో ఇరువర్గాలపైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. పెళ్ళకూరు మండలం బంగారంపేట చెరువు నుంచీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు నాయకులు గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు.గురువారం సాయంత్రం సూళ్ళూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి కొంతమంది అనుచరులతో కలసి చెరువు వద్దకు వెళ్ళి తవ్వకాలను అడ్డుకున్నారు.ఆ మండలానికి చెందిన నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి ఈ విషయం తెలిసి పెద్దసంఖ్యలో అనుచరులతో అక్కడికి చేరుకుని శేఖర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సూళ్ళూరుపేట వైసీపీ నేతకు పెళ్ళకూరు మండలంలో ఏం పనంటూ ప్రశ్నించగడంతో పరస్పరం తోపులాడుకుని దుస్తులు కూడా చించుకున్నారు.ఇరు వర్గాలూ ఫిర్యాదు చేసినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం వరకు కేసులు నమోదు చేయకపోవడంతో నాయుడుపేట సర్కిల్ కార్యాలయం ఎదుట సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో ధర్నాకు దిగారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కళత్తూరు శేఖర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, నరే్‌షరెడ్డిలపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న మరోవర్గం మోదుగులపాలెం దళితకాలనీకి చెందిన ముత్యాలయ్యను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాయుడుపేట సర్కిల్ ఆఫీసుకు స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ను పిలిపించుకుని డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, చిల్లకూరు సర్పంచు పగడాల హరిబాబురెడ్డి, అదే గ్రామానికి చెందిన పిల్లమిట్ట వంశీకృష్ణ, శిరసనంబేడు గ్రామానికి చెందిన గెడ్డాం వెంకటకృష్ణారెడ్డి, నెలబల్లి గ్రామానికి చెందిన ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డిలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైసీపీకే చెందిన రెండు వర్గాల్లో ముఖ్య నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు కావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
Updated Date - Mar 03 , 2024 | 01:30 AM