సమన్వయ బాధ్యత ఎమ్మెల్యేదే
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:28 AM
సూళ్లూరుపేటలో మన పార్టీ పరిస్థితి బాగాలేదని అధ్యక్షుడు జగనే తనకు చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
- సూళ్లూరుపేట అసమ్మతి నేతల సమావేశంలో పెద్దిరెడ్డి
- తప్పు చేసి వుంటే క్షమాపణలన్న ఎమ్మెల్యే కిలివేటి
సూళ్లూరుపేట, మార్చి 2: సూళ్లూరుపేటలో మన పార్టీ పరిస్థితి బాగాలేదని అధ్యక్షుడు జగనే తనకు చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. శనివారం సూళ్లూరుపేటలో నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి నేతలతో చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే నడుమ సమన్వయం లేకపోవడంతో పార్టీకి గడ్డుకాలం వచ్చిందని,చక్కదిద్దమని చెప్పి తనను పంపారని ఆయన వివరించారు.చిన్నపాటి సమస్యలొచ్చినా అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సిన బాధ్యత ఎమ్మెల్యే సంజీవయ్యదేనని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, పార్టీ నాయకుల్లో ఒకరికి న్యాయం చేసే సమయంలో ఇంకొకరికి అన్యాయం జరిగి ఉండవచ్చన్నారు. అలాంటివి మరోసారి జరగవన్న ఆయన తప్పుచేసి ఉంటే క్షమించాలని కోరారు. వైసీపీ రాష్ర్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ గాలి వీస్తోందని సీఎం నుంచి సీనియర్ నాయకుల దాకా చెబుతున్నా పెద్దఎత్తున నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడ, పార్టీ జెండాలు మోసిన వారిని విస్మరించడం వల్లే నేడు పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఎమ్మెల్యే మౌనంగా ఉన్నప్పటికీ ఆయన వర్గీయులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.గూడూరుకు చెందిన సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కళత్తూరు శేఖర్ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, మధుసూదన రెడ్డి, కళత్తూరు సునీల్ రెడ్డి, మారబత్తిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 01:28 AM