జనమేరి జహాపనా..?
ABN, Publish Date - Feb 24 , 2024 | 01:43 AM
‘ఐదు వేలమందికి పైగా ఇంటి పట్టాలిచ్చాం, రెండువేలమంది అటవీకార్మికులకు వేతనాలు పెంచాం. ఉద్యోగులు అడిగినవన్నీ తీర్చేస్తామన్న హామీలు ఇచ్చాం’ అనుకుని రాబోయే ఎన్నికల్లో టీటీడీ ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా మన ఖాతాలోనే పడిపోతాయని లెక్కలు వేసుకున్నారు.
- పట్టాలిచ్చినా...పత్తాలేరే..!
- ‘కరుణ’ కృతజ్ఞతా సభకు ఝలక్ ఇచ్చిన టీటీడీ ఉద్యోగులు
‘ఐదు వేలమందికి పైగా ఇంటి పట్టాలిచ్చాం, రెండువేలమంది అటవీకార్మికులకు వేతనాలు పెంచాం. ఉద్యోగులు అడిగినవన్నీ తీర్చేస్తామన్న హామీలు ఇచ్చాం’ అనుకుని రాబోయే ఎన్నికల్లో టీటీడీ ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా మన ఖాతాలోనే పడిపోతాయని లెక్కలు వేసుకున్నారు. పలు దశల్లో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు ‘అహో..రాజ, ఒహో భోజ’ అన్నట్టు కీర్తించారు. అయితే టీటీడీ ఉద్యోగులంతా మనవైపే ఉన్నారనుకున్న ధీమా శుక్రవారం టీటీడీ పరిపాలన భవనం వెనుక పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన భూమన ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగిన తీరుతో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా సన్నగిల్లిపోయింది.కరుణాకర రెడ్డికి ఉద్యోగులే ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞతాభినందన సభ వెలవెలబోయింది. కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుందని చెప్పి, మీడియాకు కవరేజీ కోసం కబురు పెట్టారు. ఉదయం నుంచి వేదిక ఏర్పాట్లు చేశారు. సీఎం సభ తరహాలో పెద్దఎత్తున గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం అయిదున్నర దాకా ఉద్యోగులు ఆశించిన సంఖ్యలో రానేలేదు.సభా ప్రాంగణాన్ని నింపేందుకు ఉద్యోగ సంఘ నాయకులు నానా తంటాలు పడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఆరు వరుసల గ్యాలరీలను ఏర్పాటు చేస్తే, రెండు వరుసల గ్యాలరీకే ఉద్యోగులు పరిమితమయ్యారు. అందులో కూడా అటవీకార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బందే ఎక్కువగా కనిపించారు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తే బాగుండదని, వేసిన కుర్చీలను మడతపెట్టి పడుకోబెట్టేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కరుణాకర రెడ్డి వేదికవద్దకు చేరుకున్నారు. కార్యక్రమం యథాప్రకారం పొగడ్తలతో సాగింది. ప్లాట్లు ఇచ్చినా ఎందుకు రాలేదనే చర్చ గ్యాలరీల్లో సాగింది. దాదాపు రూ.9లక్షలు వెచ్చించి ఎక్కడో సుదూరంగా ప్లాట్లు తీసుకోవడం వలన పెద్దగా ఒరిగేదేమీలేదన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ అసంతృప్తితోనే ఉద్యోగులు అనాసక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. - తిరుపతి, ఆంధ్రజ్యోతి
Updated Date - Feb 24 , 2024 | 01:43 AM