బావిలో జారిపడి ద్రావిడ వర్సిటీ విద్యార్థి మృతి
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:04 AM
ఈత సరదా కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ద్రావిడ వర్సిటీ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ బావిలో జారిపడి మృతి చెందాడు.
గుడుపల్లె, మార్చి 2: ఈత సరదా కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ద్రావిడ వర్సిటీ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ బావిలో జారిపడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన గుడుపల్లె మండలంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పెద్దనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన రాములు కుమారుడు సాధ్విక్(23) ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టడానికి విశ్వవిద్యాలయానికి కొంత దూరంలో ఉన్న ఎ.కొత్తపల్లె గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. స్నేహితులంతా బావిలో ఈత కొట్టి.. గట్టుకు వచ్చారు. సాధ్విక్ మాత్రం కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి బావి మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి పడి నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులొచ్చి సాధ్విక్‌ని బావి నుంచి బయటకు తీశారు. 108కి సమాచారం ఇవ్వడంతో వైద్యసిబ్బంది వచ్చి పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 01:04 AM