నెలకు సెల్‌ఫోన్ రీచార్జి రూ.3 వేలట
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:19 AM
సాధారణంగా మనం వాడే ఫోన్లను నెలకోసారి రీచార్జి చేసుకుంటాం. రోజుకు 1.5 జీబీ నెట్ వచ్చే ప్యాకేజీని జియో అయితే రూ.239కు అందిస్తుంది. ఇలాగే ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ పెడుతూ ఉంటుంది. కంపెనీని బట్టి నెలకు రూ.250 వేసుకున్నా, ఏడాదికి రూ.3వేలు దాటదు. కానీ, జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో సిమ్ రీచార్జి బిల్లు ఏడాదికి ఏకంగా రూ.40 వేలు పెట్టుకున్నారు. మరికొన్ని హాస్టళ్లలో రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు డ్రా చేసుకున్నారు. జిల్లా అధికారి సహకారంతో ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టుకుని పైనుంచి కింది స్థాయి వరకు అందరూ కలిసి పంచుకున్నట్లు అధికార వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఏడాదికి రూ.40 వేలు, రూ.30 వేలు బిల్లుల మంజూరు
ఇదీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బాగోతం
సాధారణంగా మనం వాడే ఫోన్లను నెలకోసారి రీచార్జి చేసుకుంటాం. రోజుకు 1.5 జీబీ నెట్ వచ్చే ప్యాకేజీని జియో అయితే రూ.239కు అందిస్తుంది. ఇలాగే ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ పెడుతూ ఉంటుంది. కంపెనీని బట్టి నెలకు రూ.250 వేసుకున్నా, ఏడాదికి రూ.3వేలు దాటదు. కానీ, జిల్లాలోని కొన్ని హాస్టళ్లలో సిమ్ రీచార్జి బిల్లు ఏడాదికి ఏకంగా రూ.40 వేలు పెట్టుకున్నారు. మరికొన్ని హాస్టళ్లలో రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు డ్రా చేసుకున్నారు. జిల్లా అధికారి సహకారంతో ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టుకుని పైనుంచి కింది స్థాయి వరకు అందరూ కలిసి పంచుకున్నట్లు అధికార వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
- చిత్తూరు
జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 57 వసతిగృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో మూడో తరగతి నుంచి పీజీ వరకు సుమారు మూడువేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థుల హాజరుపై తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. దాంతో విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లోనే పలు నెట్‌వర్క్ కంపెనీలతో జిల్లాస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికలు జరిగి, వైసీపీ అధికారంలోకి రావడంతో ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సిస్టం మరుగునపడిపోయింది.
సొంత ఫోనుతోనే అటెండెన్సు..
వసతిగృహాల్లో విద్యార్థుల అటెండెన్స్ వేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వలేదు. వార్డెన్లందరూ సొంతంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతుండడంతో ప్రస్తుతం వారి ఫోన్ల నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్‌ను నమోదు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో హాస్టల్‌కు ఏడాదికంతా రూ.3వేలు మించదు. ఈ మొత్తాలను వార్డెన్లు వారి సొంతానికి వాడుకునే ఇంటర్నెట్‌తోపాటు హాస్టల్ విద్యార్థులకు కూడా వాడుతున్నారు. తాను వినియోగించని ఇంటర్నెట్‌కు రూ.3 వేల చార్జీలతో అందిన బిల్లును తనకొద్దంటూ పలమనేరు ప్రాంతానికి చెందిన ఓ వార్డెన్ ఆ బిల్లును తిరిగి ఇచ్చేశాడు.
నకిలీ బిల్లులతో నిధులు కొట్టేసి..
ఇటీవల ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖకు ఇచ్చిన బడ్జెట్‌లో నుంచి కొంత మొత్తాన్ని ఇలా ఇంటర్నెట్ బిల్లుల కోసం కేటాయించారు. 2023 ఏడాదికి సంబంధించిన బిల్లుల్ని మంజూరు చేసుకోగా, ఆయా నెట్‌వర్క్‌ల పేరుతో నకిలీ బిల్లుల్ని సబ్‌మిట్ చేసి నిధుల్ని కొట్టేశారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఓ హాస్టల్‌లో నిరుపయోగంగా ఉన్న పాత సామాన్లను పైఅధికారులకు తెలియకుండా ఓ వార్డెన్ అమ్మేశాడు. ఆ శాఖ ఉన్నతాధికారికి నమ్మిన బంటు అని చెప్పుకుంటున్న ఆయనే బీఎ్‌సఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్‌తోపాటు మిగిలిన కంపెనీల నకిలీ బిల్లులను తయారు చేశారు. ఒక్కో నకిలీ బిల్లు తయారీకి రూ.1000 నుంచి రూ.1500 వరకు తీసుకున్నట్లు సమాచారం.
అనువైన వారికి అధిక మొత్తం..
జిల్లాలో ఉన్న 57 మంది వార్డెన్లలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా బిల్లులు పెట్టారు. ఆ శాఖ ఉన్నతాధికారికి అనుకూలంగా ఉన్న వార్డెన్లకు రూ.40 వేల వరకు బిల్లులు పెట్టగా.. అనుకూలంగా లేనివారికి రూ.3వేల నుంచి రూ.5వేల మధ్యలో బిల్లులు పెట్టారు. ఈవిధంగా జీడీనెల్లూరు వార్డెన్‌కు (గర్ల్స్, బాయ్స్) రూ.40 వేలు, పూతలపట్టు బాలికల హాస్టల్ వార్డెన్ పేరు మీద రూ.10వేలు, ఉగ్రాణంపల్లె వార్డెన్‌కు రూ.30వేలు, కొత్తపల్లెమిట్ట వార్డెన్‌కు రూ.30వేలు, తూగుండ్రం వార్డెన్‌కు రూ.30వేలుగా బిల్లులు పెట్టారు. మిగిలిన వార్డెన్లకు రూ.3వేల నుంచి రూ.10వేల వరకు బిల్లులు పెట్టారు. మంజూరైన డబ్బుల్లో జిల్లా స్థాయిలో ఓ అధికారికి 60 శాతం, ఏఎ్‌సడబ్ల్యూవోలు, వార్డెన్లకు కలిపి 40శాతం పంచుకున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 01:19 AM